POCSO Case Supreme Court| పోక్సో చట్టం చాలా తీవ్రమైన నేరాలు నిరోధించడానికి చేయబడినది. ఈ చట్ట ప్రకారం.. చిన్నపిల్లలు, టీనేజర్లను లైంగిక వేధింపులను గురి చేసే వారిని కఠినంగా శిక్షలు విధిస్తారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తుండగా.. మరికొన్ని కేసుల్లో ఈ చట్టాన్ని తప్పుడు విధానంలో చూపిస్తూ.. నేరఉద్దేశం లేకపోయినా పరిస్థితుల వల్ల జరిగిన కొన్ని సంఘటనలను కోర్టుల్లో చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఈ కారణంగా అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు చట్టానికి వ్యతిరేకంగా వెళ్లి సంచలన తీర్పు ఇచ్చింది. 15 ఏళ్ల అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఒక 24 ఏళ్ల యువకుడికి జిల్లా కోర్టు 20 ఏళ్లు శిక్ష విధించగా.. సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేసింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి, 24 ఏళ్ల వయసులో 15 ఏళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె మైనార్టీ తీరిన తర్వాత, అతను ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారు పిల్లలతో సంతోషంగా కుటుంబ జీవితం గడుపుతున్నారు. అయితే, అప్పటికే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కింది కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది. 2023లో హైకోర్టు అతనికి ఊరట ఇస్తూ తీర్పు ఇచ్చింది. కానీ, బాలికలు తమ లైంగిక కోరికలను అణచుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఈ తీర్పును సుప్రీం కోర్టు స్వయంగా సీరియస్‌గా తీసుకుంది. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టి, 2023 ఆగస్టులో హైకోర్టు తీర్పును కొట్టేసింది. నిందితుడికి శిక్షను తిరిగి అమలు చేసింది. అయితే, బాధితురాలు.. అంటే అతని భార్య, సుప్రీం కోర్టు తీర్పును తిరిగి సమీక్షించాలని కోరింది. తన భర్తకు శిక్ష పడకుండా కాపాడాలని వేడుకుంది. ఆమె ప్రస్తుత మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి సుప్రీం కోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఏప్రిల్‌లో సీల్డ్ కవర్‌లో వచ్చింది. సుప్రీం కోర్టులో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జయ్ భుయాన్‌ల ధర్మాసనం దాన్ని పరిశీలించి.. ఆర్టికల్ 142 కింద తమ విశేష అధికారాలను ఉపయోగించి అతని శిక్షను రద్దు చేసింది.
సుప్రీం కోర్టు ఈ కేసును అరుదైనదిగా పేర్కొంది. బాధితురాలి కుటుంబం ఆమెను వదిలేసిందని, వ్యవస్థ ఆమెను నిందించిందని, న్యాయవ్యవస్థ విఫలమైందని వ్యాఖ్యానించింది. చట్టం ప్రకారం ఇది నేరమే అయినప్పటికీ, బాధితురాలు దీన్ని నేరంగా చూడడం లేదని, ఆమె తన భర్తను రక్షించడానికి పోలీసులతో, న్యాయస్థానాలతో పోరాడుతోందని కోర్టు గమనించింది. వారి భావోద్వేగ అనుబంధం, ప్రస్తుత కుటుంబ జీవితం వంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, పూర్తి న్యాయం చేయడానికి ఈ తీర్పు వెలువరించినట్లు కోర్టు తెలిపింది.
Also Read: కాంట్రాక్ట్ పూర్తి చేయకుండా ఉద్యోగం మానేస్తే జరిమానా తప్పదు.. సుప్రీం కోర్టు తీర్పు
ఈ కేసు చట్టం, న్యాయం, మానవ సంబంధాల మధ్య సంక్లిష్టతను చూపిస్తుంది. బాధితురాలు తన భర్త కోసం పోరాడటం, సమాజం, చట్టం ఆమెను తప్పుగా చూసినా, ఆమె ధైర్యంగా నిలబడటం ఈ కేసును ప్రత్యేకంగా చేసింది. సుప్రీం కోర్టు ఈ తీర్పుతో, చట్టాన్ని కఠినంగా అమలు చేయడమే కాక, మానవీయ కోణాన్ని కూడా పరిగణించవచ్చని నిరూపించింది.