Supreme Court: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నిర్వహించిన విద్యార్థుల నిరసనపై పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల అతిక్రమణలు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ డీజీపీ లేదా సీబీఐ విశ్రాంత డీజీ సభ్యులుగా ఉంటారని స్పష్టం చేసింది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు బుధవారం వెలువడుతాయని ధర్మాసనం వెల్లడించింది.
దిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసు చర్యను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానిస్తూ.. దౌర్జన్యానికి ఎలాంటి సమర్థనా లేదన్నారు. అందుకే పూర్తి స్థాయిలో ఆధారాలను పరిశీలించడానికి ఒక హైపవర్ కమిటీని నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కమిటీలో నియమించేందుకు ఒక విశ్రాంత సీబీఐ డీజీ, అలాగే సదరు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని ఒక విశ్రాంత రాష్ట్ర డీజీపీ అంగీకారం తీసుకున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వీరిద్దరూ ఎంతో సమర్థులని, వారి పేర్లను ప్రస్తుతానికి బహిర్గతం చేయడం లేదని సీజేఐ తెలిపారు. వీరిద్దరిలో ఎవరిని కమిటీలో ఉంచాలో తమకు తెలియజేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.
ఈ కమిటీకి కావలసిన పూర్తి మౌలిక వసతులను సుప్రీంకోర్టే స్వయంగా కల్పిస్తుందని ధర్మాసనం తెలిపింది. బాధితులు ఎవరు వచ్చినా కమిటీ వారికి వెంటనే అవకాశం ఇచ్చి వారి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. కమిటీ సమర్పించే నివేదికలు, సిఫార్సుల ఆధారంగా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read: మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!
దిల్లీ నిరసన సమయంలో మహిళా విద్యార్థులపై జరిగిన లైంగిక వేధింపులు, అసభ్యకర ఆన్‌లైన్ పోస్టింగ్స్, బాధితులపై చూపిన వివక్షను ఈ కమిటీ ప్రధానంగా పరిశీలిస్తుందని కోర్టు తెలిపింది. ఇదిలాఉంటే అప్పట్లో ఒక మహిళా నిరసనకారు పట్ల పోలీసు దారుణంగా ప్రవర్తించినట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు సైతం వచ్చాయి. అదే సమయంలో పెల్లెట్ తుపాకులను నిరసనకారులపై ఉపయోగించడం కూడా దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Also Read: వీడు మామూలోడు కాదు.. రూ.5 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరికి భలే బుక్కయ్యాడు!