Supreme Court Infants Purchase| ఇతర రాష్ట్రాల్లో పసికందులను దొంగతనం చేసి తీసుకువచ్చే క్రిమినల్స్ నుంచి సంతానం లేని దంపతులు దత్తత కోసం కొనుగోలు చేశారు. అయితే పోలీసులు ఆ ముఠాలను పట్టుకోవడంతో ఆ పసికందులను స్వాధీనం చేసుకొని వారిని కన్న తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హై కోర్టు పిల్లలను దత్తత తీసుకున్న వారికే చెందుతారని ఇటీవల తీర్పు వెలువరించడంతో హై కోర్టు తీర్పుని శిశు సంక్షేమ కమిటీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. దత్తత తీసుకున్న వారి పట్ల సానుభూతి చూపిస్తూనే వారిని తప్పులను ఎత్తిచూపింది.
‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి మాత్రమే చూపించగలం. అయితే, అంతకుమించి మీకు న్యాయం చేయలేం కదా?’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.2024లో హైదరాబాద్‌లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు చెప్పినదానిని బట్టి చూస్తే, మీకే కడుపు కోతా? మీరు కడుపుకోత అని అనుకుంటే, పిల్లలకు జన్మనిచ్చిన అసలైన తల్లిదండ్రులది ఏమనాలి?’’ అంటూ న్యాయస్థానం పిటీషనర్లపై ప్రశ్నలు సంధించింది.
ఢిల్లీ, పుణే, ఇతర ఉత్తర భారతదేశం నగరాల్లోని ఆసుపత్రుల్లో నుంచి అప్పుడే పుట్టిన పసికందులను దొంగలించే ఒక ముఠా.. హైదరాబాద్, ఇతర దక్షిణాది నగరాల్లో ఆ పిల్లలను విక్రయించేది. మే 22న ఫీర్జాదిగూడలో ఒక పసికందును విక్రయిస్తుండగా.. మేడిపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన (Infant Adoption) తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
అయితే శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా, ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read: మహిళా ఎంపీ కోసం ఒకరినొకరు తిట్టుకున్న టిఎంసీ ఎంపీలు.. వీడియోలు వైరల్ చేసిన బిజేపీ
పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ వాదిస్తూ.. ‘‘పిల్లలు లేని కారణంగానే ఆ పసికందులను దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలతో వారికెంతో భావోద్వేగం ఉంది. దత్తత తీసుకున్న వారి నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటినుండి వారు విలవిలలాడుతున్నారు, పిల్లలను తిరిగి దత్తత తీసుకున్న వారికే అప్పగించమని కోరుతున్నాం’’ అని చెప్పారు.
దీనిపై సుప్రీం కోర్టు (Supreme court) ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మీరు తీసుకున్నది చట్టవిరుద్ధమైనది. మమ్మల్ని న్యాయం చేయమంటే, మేము లీగల్ అని ఎలా చెబుతాం?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘మీరు రెండు రోజుల పసికందులను కొనుగోలు చేసిన విషయం గుర్తించారా? ఆ పిల్లలను కన్న తల్లిదండ్రుల క్షోభ గురించి మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా? మీరు చేస్తున్నది తప్పు అని మీ మనస్సాక్షికి ఎందుకు అనిపించలేదు?” అని ప్రశ్నించింది.
“ఈ విషయంలో మేము కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం, కానీ, కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను మీరు దత్తత తీసుకోలేదు. మీరు మరొకరి వద్ద కొనుగోలు చేశారు.’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విచారణను వచ్చే నెల 7 వరకు వాయిదా వేసింది.