Supreme Court Serious On UP Bulldozer Action| ఇళ్లను కూల్చేయడానికి నోటీసులు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్లతో ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పద్ధతులపై సుప్రీంకోర్టు మరోసారి కోపం వ్యక్తం చేసింది. యూపి ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదిస్తూ.. అన్ని నియమాలను పాటిస్తూనే ఇళ్ల కూల్చివేత జరుగుతోందని అన్నారు. కానీ ఆయన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది.
2023లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్‌కు చెందిన ఇళ్లుగా భావించిన ప్రయాగ్రాజ్ (అలహాబాద్) నగరంలోని భవనాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా న్యాయూవాది జుల్ఫికర్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరొక వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి ఇళ్లు అతీక్ అహ్మద్‌కు సంబంధించినవి కాదని, తప్పుడు ఆరోపణలతో కూల్చారని బాధితులు వాదించారు. కానీ హైకోర్టు వారి పిటిషన్ను తిరస్కరించడంతో, బాధితులు సుప్రీంకోర్టుకు మొరపెట్టుకున్నారు.
24 గంటల్లోనే ఇళ్లను కూల్చేయడం షాకింగ్: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును విచారణ చేసింది. న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ.. “ఇళ్లను ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కూల్చివేత ప్రక్రియ కూడా షాకింగ్! మార్చి 6 రాత్రి నోటీసులు ఇచ్చి.. మరుసటి రోజే కూల్చేస్తారా? ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఎప్పుడూ అంగీకరించవు. ఒక్క కేసులో ఇలా అనుమతిస్తే, ఇదే ప్రతి సారీ జరుగుతూ ఉంటుంది. బాధితులకు నోటీసులు అందిన తర్వాత వారికి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. 24 గంటల్లో ఇళ్లు కూల్చారు. ఈ కేసులో బాధితులు తిరిగి ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం ఇస్తాం. కానీ తుది తీర్పు వారికి వ్యతిరేకంగా వస్తే.. వారే ఆ ఇళ్లను కూల్చాల్సి ఉంటుంది.” అని చెప్పారు.
Also Read: మహారాష్ట్ర డిప్యూటీ సిఎంపై స్టాండప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. శివసేన హింసాత్మక దాడులు
అవి అక్రమ కట్టడాలు.. ప్రభుత్వ వాదన
ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి వాదిస్తూ.. “లీజు కాలం ముగిసిన తర్వాత కూడా పిటిషనర్లు అక్రమంగా ఈ ఇళ్లలో ఉన్నారు. 2020 డిసెంబర్, 2021 జనవరి, మార్చి 6న కూడా నోటీసులు ఇచ్చాము. ఆ తర్వాతే కూల్చాము.” అని చెప్పారు. కానీ న్యాయమూర్తులు ఈ వాదనను తిరస్కరిస్తూ మండిపడ్డారు. “మామూలు నోటీసులు ఇచ్చారు. చట్టం ప్రకారం రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. అలా కాకుండా చివరి నోటీసు మాత్రం రిజిస్టర్డ్ పోస్ట్ తో పంపి, వెంటనే కూల్చారు. ఇది న్యాయమేనా?” అని అటార్నీ జనరల్ కు ఎదురు ప్రశ్నించారు. కేసు తుది విచారణకు వాయిదా వేయబడింది.
క్రికెట్ నినాదాలు చేసినందుకు ఇళ్లు కూల్చేశారు
గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ సమయంలో భారతదేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ.. ఒక వ్యక్తి ఇల్లు కూల్చారని కితాబుల్లా హమీదుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందన తెలియజేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ లతూ కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది.
గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేయాలని బాధితుడు కోరాడు. ఫిబ్రవరి 24న సింధుదుర్గ్ జిల్లాలో అతని పాత సామాను దుకాణం మరియు ఇల్లు రెండింటినీ “అక్రమ నిర్మాణాలు” అని పేర్కొంటూ కూల్చారు. భారతదేశ వ్యతిరేక నినాదాలు చేశాడని ఆరోపించి, అతని 14 ఏళ్ల కుమారుడిని కూడా అరెస్టు చేశారు. తర్వాత భార్యాభర్తలను జైలుకు పంపారు. ఈ సమయంలోనే వారి ఇల్లు, దుకాణం కూల్చివేయబడ్డాయి.
ఇళ్ల కూల్చితే విషయంలో న్యాయబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాథమిక హక్కులు, న్యాయం అనేవి కేవలం నామమాత్రం కాకూడదని న్యాయమూర్తులు హెచ్చరించారు.