SC Verdict: కారుణ్య నియామకాలకు సంబంధించి దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ సేవల్లో ఉన్న ఉద్యోగి మరణిస్తే.. అతని కుటుంబం ఆర్థికంగా ఒంటరిగా మారిపోకూడదు అనే సదుద్దేశ్యం ఈ నియామకాల వెనుక ఉందని సుప్రీం వెల్లడించింది. అంతే కానీ.. ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదని.. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్‌సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం తెలిపింది.
సాధారణంగా.. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో ఉండగా శాశ్వత వైకల్యం పొందినా లేదా మరణించినా వారి కుటుంబాలకు ప్రభుత్వాలు కల్పించే భరోసా కారుణ నియామకం. దీని ద్వారా చాలా మంది ఉద్యోగులు ధైర్యంగా విధులు నిర్వహిస్తుంటారు. అయితే.. దీనిని హక్కుగా భావించవద్దని, ఈ నిబంధన కింద ఉద్యోగం పొందేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 1997లో మరణించిన ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
ఓ వ్యక్తి, సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవాలని సూచించలేమని తెలిపింది. సాధారణంగా జరిగే కారుణ్య నియామకం.. ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దని అని గుర్తు చేసింది. అంతే కానీ.. ఓ సారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, అందులో మరిణిస్తే.. ఎంతకాలం తర్వాతనైనా ఉద్యోగం పొందవచ్చనే అభిప్రాయం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చిన కేసు 1977కి సంబంధించింది. హరియాణాకు చెందిన పిటిషనర్ టింకూ తండ్రి జై ప్రకాశ్ 1997లో పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉండగా మరణించారు. అప్పటికి.. టింకూ వయసు ఏడేళ్లు మాత్రమే.. అతని తల్లి నిరక్షరాస్యురాలు. దాంతో.. జై ప్రకాశ్ ఉద్యోగానికి భార్య అర్హురాలు కాలేకపోయింది. బిడ్డ మైనర్ కావడం, తల్లి నిరక్షురాలు కావడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించలేదు. అయితే.. కుమారుడి పేరును మాత్రం మైనర్ల జాబితాలో చేర్చాలని, అతను మేజర్ అయిన తర్వాత కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభిస్తుందని ఆశించారు. వస్తుందని ఆశించారు. దాంతో.. భవిష్యత్త్ లో ఉద్యోగావకాశం కల్పించేందుకు వీలుగా 1998లో టింకూ పేరును అప్పటి హరియాణా డీజీపీ నమోదు చేయించారు. తండ్రి మరణించిన 11 ఏళ్లకు 2008లో మేజరైన టింకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.
టింకూ దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వ విభాగం.. ఆ నియామకం నిబంధనల మేరకు లేదని తేల్చింది. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన మూడేళ్ల లోపే కారుణ్య నియామకానికి అర్హులని తేల్చి చెప్పింది. ఆ విధంగా 1999లో తీసుకొచ్చిన నిబంధనను అనుసరించి అధికారులు.. కారుణ్య నియామకానికి నిరాకరించారు. దాంతో.. తనకు ఉద్యోగం ఇప్పించాల్సిందేనంటూ కోర్టులను ఆశ్రయించారు. దిగువ స్థాయి కోర్టులు సహా.. పంజాబ్-హరియాణా హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేయగా.. అధికారుల నిర్ణయాల్ని కోర్టులు సమర్థించాయి. కారుణ్య నియామకాలు.. అంత సుదీర్ఘ కాలం తర్వాత ఇవ్వడం కుదరదని స్పష్టం చేశాయి.
Also Read : అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ
ఈ విషయమై తాజాగా టింకూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. కేసును పూర్తిగా పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. దిగువ కోర్టుల తీర్పుల్ని సమర్థించింది. అలా ఉద్యోగం ఇవ్వడం కుదరదని తేల్చింది. అయితే అతని కుటుంబానికి ఊరట కలిగిస్తూ.. సంబంధిత విభాగానికి పరిహారం కోసం అభ్యర్థించవచ్చని టింకూ తల్లికి అనుమతినిచ్చింది. ఆ అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీం కోర్టు.. ఆమెకు నష్టపరిహారం ఇవ్వకపోతే.. ఆపై జరిగే ఆలస్యానికి వడ్డీతో సహా చెల్లించాలని సూచించింది.