Tahavvur Rana Mumbai Attack| ముంబై తాజ్ హోటల్‌లో 2008 దాడులకు కుట్రదారుడు ప్రధాన నిందితుడు తహవ్వుర్ రాణా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అమెరికాలో ఉన్నాడు. పాకిస్తాన్‌లో జన్మించి సైన్యంలో కెప్టెన్ గా పనిచేసిన రాణా.. ఆ తరువాత కెనడా దేశ పౌరసత్వం పొందాడు. అక్కడే స్థిరపడి భారతదేశంలో ఉగ్రవాద దాడులకు కుట్రలు చేశాడు. ముఖ్యంగా 2008 సంవత్సరంలో తాజ్ హోటల్ లో జరిగిన పేలుళ్ల వెనుక తహవ్వుర్ రాణా కీలక పాత్ర పోషించడాని ఆధారాలున్నాయి. దీంతో అతడిని భారత దేశానికి ప్రత్యర్పణం (మరో దేశంలో ఉన్న వ్యక్తిని తీసుకురావడం) చేయాల్సిందిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత అధికారుల నుంచి తప్పించుకోవడానికి తహవ్వుర్ రాణా కెనెడా నుంచి అమెరికా వెళ్లాడు. తన ప్రత్యర్పణానికి వ్యతిరేకంగా అక్కడ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు.
ఇప్పటికే భారతదేశ ప్రత్యర్పణానికి వ్యతిరేకంగా తహవ్వుర్ రాణా కెనెడా, అమెరికా దేశాలలోని చాలా కింది కోర్టులు, ఫెడరల్ కోర్టులను ఆశ్రయించినా ఆ కోర్టులు అతనికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించాయి. దీంతో చివరి అవకాశంగా అమెరికా దేశంలోని సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న సుప్రీం కోర్టులో నవంబర్ 13న తన ప్రత్యర్పణానికి వ్యతిరేకంగా పిటీషన్ ఫైల్ చేశాడు.
Also Read: ప్రపంచంలో ఖరీదైన పాస్‌పోర్ట్ ఈ దేశానిదే.. ఇండియా కన్నా చీప్‌గా మరో దేశంలో..
ఇంతకుముందు అమెరికాలోని నైన్త్ సర్కూట్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, చికాగో ఇల్లినాయిస్ నార్తరన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో పిటీషన్లు వేశాడు. కానీ అక్కడ అతనికి వైఫల్యమే ఎదురైంది. చివరగా నైన్త్ సర్కూట్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పుని సవాల్ చేస్తూ.. ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. ఈ కేసులో భారత దేశ అధికారులు 2008 పేలుళ్ల కేసులో తహవ్వుర్ రాణాకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు సమర్పించడంతో అతనికి కోర్టు నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా సుప్రీం కోర్టులో తహవ్వుర్ రాణా వేసిన పిటీషన్ అతను భారత న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశాడు. తనను ఇండియా పంపిస్తే.. న్యాయ విచారణ పారదర్శకంగా జరగదని.. దోషిగా తేల్చేసి వెంటనే మరణ శిక్ష విధిస్తారని రాణా పిటీషన్ లో పేర్కొన్నాడు. అందుకే తనకు భారతదేశానికి ప్రత్యర్పణం చేయకుండా ఆపాలని పిటీషన్ లో కోరాడు.
ముంబై నగరంలో 26-11-2008న ఉగ్రవాదులు దాడి చేశారు. 60 గంటలపాటు ముంబై నగరంలో ఉగ్రవాదులు విధ్వంసం స్పష్టించారు. ముంబైలోని కీలక ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 166 మంది చనిపోయారు. మరణించినవారిలో ఆరుగురు అమెరికన్లు, 10 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి పాకిస్తాని అమెరికన్ లష్కరే తయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్ మెన్ హెడ్లీ. అయితే కుట్రలో అతనికి పూర్తిగా తహవ్వుర్ రాణా సాయం అందించాడని ఆధారాలున్నాయి.
అమెరికా, కెనడా దేశాల్లో దాగి ఉన్న తహవ్వుర్ రాణాను అక్కడి ప్రభుత్వాలు భారత దేశానికి ప్రత్యర్పణం చేసేందుకు అక్టోబర్ 2024లో చర్చలు జరిగినట్లు సమాచారం. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఇరుదేశాల అధికారులు రాణాను ఇండియా జైలుకు తరలించేందుకు ఏర్పాట్ల చర్చల జరిపారని సమాచారం. డిసెంబర్ 20 లోగా తహవ్వుర్ రాణాని ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయమే కీలకంగా మారింది.