CM Stalin Letter To 7 States Over Delimitation| కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య వ్యవస్థపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రాల పరిపాలనను శిక్షించడమే ఈ ప్రయత్నం యొక్క లక్ష్యమని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ విషయంపై తన అసమ్మతిని స్పష్టంగా వ్యక్తం చేస్తూ, స్టాలిన్ ఏడుగురు రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. అదే విధంగా, మాజీ ముఖ్యమంత్రులకు కూడా లేఖలు పంపినట్లు ఆయన తెలిపారు.
ఈ అంశంపై స్టాలిన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ (X) ద్వారా తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేశారు. ఆయన పేర్కొన్నారు, “ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జనాభా నియంత్రణ మరియు సుపరిపాలనపై పార్లమెంటులో మన గొంతు వినిపించుకోకుండా చేయడమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇది ఎంతమాత్రం సమ్మతించదగినది కాదు.”
Also Read: మహారాష్ట్రలోనూ భాషా రాజకీయం.. ప్రజలు మరాఠీ నేర్చుకోవాల్సిందేనన్న సిఎం..
డీలిమిటేషన్ తో ఎవరికి నష్టం?
2026లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ ప్రక్రియలో దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం జరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా తక్కువగా ఉండటంతో, లోక్ సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడుతుందని భయం వ్యక్తం చేయబడుతోంది. కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణ భారత రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో, అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు లోక్ సభలో తమ సీట్ల సంఖ్యను పెంచుకోనున్నాయి.
ఫలితంగా.. కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణ భారత రాష్ట్రాలకు తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేయబడుతోంది. ఈ పరిస్థితి ఉత్తర-దక్షిణ విభేదాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది.
అందువల్ల, జనాభా ప్రాతిపదికన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడు రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతోంది. పార్లమెంటులో సభ్యుల సంఖ్యను పెంచాలంటే.. 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్ సభ, రాజ్య సభ.. రెండిటిలోనూ రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న రేషియో ప్రకారమే నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
“మాపై కేంద్రం ఎప్పటికీ గెలవలేదు” – స్టాలిన్ ట్వీట్
జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న వివాదం తీవ్రమవుతోంది. ఈ కొత్త విద్యా విధానంతో హిందీని తమపై రుద్దుతున్నారని ఆరోపిస్తూ, తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ మరో ట్వీట్ పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఆయన విమర్శలు చేశారు.
“కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాపై మొదలుపెట్టిన యుద్ధం వారు ఎప్పటికీ గెలవలేదరు. ‘చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా.. గాలి ఊరుకోదు..’ అలాగే, మమ్మల్ని రెచ్చగొట్టిన ఆయనకు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నాం. ఎన్‌ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు విద్యావిధానంలో ఇప్పటికే అనేక లక్ష్యాలను సాధించింది. ఎల్‌కేజీ విద్యార్థి నుండి పీహెచ్‌డీ హోల్డర్‌కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది. మేం దిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై భాజపా ప్రభుత్వం చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకొని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్థలు, ప్రదానం చేసే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లనే పెట్టారు. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఎంతో ఇబ్బంది పెడుతోంది.” అని ట్వీట్ లో రాశారు.