ముంబైకి వచ్చేవారు మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేష్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలతో మహారాష్ట్రలో వివాదం రగిలింది. తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నట్లు ప్రకటించినప్పటికీ, వివాదం అణగలేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని శివసేన (ఉద్ధవ్) ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ గురువారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ముంబై అయినా, మొత్తం మహారాష్ట్ర అయినా తమ భాష మరాఠీయేనని, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ భాషను నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే భాషా రాజకీయం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నడుస్తున్న వివాదం తీవ్రంగా ఉంది. ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు చేస్తున్న బస్సులు ఈ భాషా గడవల కారణంగానే దాడులు జరగడంతో నిలిచిపోయాయి. మరోవైపు తమిళనాడులో కూడా భాషా రాజకీయం తీవ్ర రూపం దాలుస్తోంది. అన్ని తమిళ పార్టీలు భాష కోసం ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బిజేపీనే అధికారంలో ఉన్నా.. ఆ రాష్ట్రంలో కూడా మరాఠీ తప్పనిసరి అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యకరం.
‘శంభాజీ’ను చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు: సీఎం ఫడ్నవీస్
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగ్గా పట్టించుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. శంభాజీ జీవిత కథపై ఆధారితమైన ‘ఛావా’ చిత్రాన్ని వీక్షించిన ఆయన.. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. శంభాజీ ధైర్య సాహసాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని.. యోధుల చరిత్రపై ఈ సినిమా నేటి తరానికి ఎంతో అవగాహన కల్పిస్తుందని అన్నారు.
Also Read: భారీ బంగారం స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటి వెనుక రాజకీయ నాయకుడు
ఔరంగజేబు మంచి పరిపాలకుడు అని చెప్పిన ఎమ్మెల్యేపై వేటు
మరోవైపు.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్ నజ్మీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌ను వేధించిన ఔరంగజేబును ప్రశంసించడంపై అధికార కూటమి తీవ్రంగా ప్రతిఘటించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో.. స్పీకర్ మార్చి 26న బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయనపై సస్పెన్షన్ విధించారు. ఔరంగజేబు.. మొఘల్ చక్రవర్తులలో అందరి కంటే పరిపాలన సాగించాడని.. శివాజీతో యుద్ధం కేవలం రాజకీయం మాత్రమేనని మతపరంగా కాదని సినిమాల్లో చరిత్ర వక్రీకరిస్తున్నారని.. ఇస్లాంను ఎంతో గౌరవించిన శివాజీ అంటే తనకు కూడా గౌరవమని, ఎమ్మెల్యే అబు అసీమ్ చెప్పారు.
ఔరంగజేబును ప్రశంసించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి.. లేకుంటే : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి
ఔరంగజేబును కీర్తించిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించాలని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. ఆయనపై ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇటీవల యోగీ ఆదిత్యనాథ్ యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఔరంగజేబు నాటి చర్యలను వివరించారు. “సొంత తండ్రి షాజహాన్‌ను ఆగ్రా కోటలో బంధించి, కనీసం నీరు కూడా ఇవ్వకుండా ఔరంగజేబు చిత్రహింసలకు గురిచేశారు. అలాంటి వ్యక్తిని ప్రశంసించిన ఎమ్మెల్యేపై చర్యలు తప్పకుండా తీసుకోవాలి. లేకుంటే ఆయనను యూపీకి పంపండి. మేము ఆయనను సరిచేస్తాం.” అని సిఎం యోగి వ్యాఖ్యానించారు.