Mumbai News: ఎవరూ లేకపోతే.. ఒంటరి జీవితం ఎంత నరకం అనేది పైన కనిపిస్తున్న టెక్కీకి మాత్రమే తెలుసు. మానసికంగా కుంగిపోయిన ఆయన మూడేళ్లుగా తన ఫ్లాట్ నుంచి బయటకురాలేదు. దయనీయ స్థితిలో జీవించిన అతడ్ని సామాజిక కార్యకర్తలు తెలుసుకుని రక్షించారు. మనసును హత్తుకునే ఈ వ్యవహారం నవీ ముంబైలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఒంటరి జీవితానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కనిపిస్తున్న వ్యక్తి పేరు అనూప్‌కుమార్ నాయర్. ప్రస్తుతం ఆయన వయస్సు 55 ఏళ్లు ఉండవచ్చు. నవీ ముంబైలోని ఘర్‌కూల్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అతనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కంప్యూటర్ ప్రొగ్రామ్స్ చేయడంలో మంచి నేర్పరి కూడా. ఆయనకు డబ్బు కొదవలేదు. కాకపోతే మనసు చంపుకుని మూడేళ్లుగా ఆ ఫ్లాట్‌లో బంధీగా మారిపోయాడు. ఒక్కసారి కూడా ఆయన తన ఫ్లాట్ నుంచి బయటకు రాలేదు.. వచ్చిన సందర్భం కూడా లేదు. ఎలా జీవించాడు అనేది మీడౌట్? అక్కడికే వచ్చేద్దాం.
మూడు సంవత్సరాలుగా బయటి ప్రపంచం చూడని టెక్కీ అనూప్‌కుమార్ నాయర్ తనను తాను ఒంటరిగా బంధించుకున్నాడు. అయినవాళ్లు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 2022 నుంచి బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నాడు. ఒంటరిగా మూడేళ్లు జీవించాడు. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ తెప్పించుకుని జీవించేవాడు. ఈ టెక్కీని సొసైటీ నివాసితులు, ఎన్‌జీఓలు, సామాజిక కార్యకర్తలు రక్షించి, బయట ప్రపంచంలోకి తీసుకొచ్చారు.
కొన్ని సంవత్సరాల కిందట నాయర్ తన తల్లిదండ్రులు మరణించారు. ఆయన తల్లి ఎయిర్‌ఫోర్సులో టెలికమ్యూనికేషన్స్ విభాగంలో పని చేశారు. తండ్రి ముంబైలోని టాటా ఆసుపత్రిలో ఉద్యోగం చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు అంటే దాదాపు రెండు దశాబ్దాల కిందట టెక్కీ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస విషాదాల తర్వాత నాయర్ మానసికంగా కుంగిపోయాడు.
ALSO READ: మన్ కీ బాత్‌లో మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఆ డిప్రెషన్ నుంచి ఆయన బయటకు రాలేకపోయాడు. కేవలం ఫుడ్ డెలివరీ సిబ్బందికి మాత్రమే ఆ ఫ్లాట్ తలుపులు తెరుచుకునేవి. తనను తానే అసహించుకునేలా మారిపోయాడు. బంధువులు సాయం చేసేందుకు ప్రయత్నించినా మాట్లాడేందుకు ఇష్టపడేవాడు కాదు.
ఫుడ్ డెలివరీ బాయ్ కోసం తలుపు తీసినప్పుడు ఇంట్లో పేరుకుపోయిన చెత్తని గమనించారు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్తలకు తెలిపారు. వారు ఆ సొసైటీలోకి వ్యక్తులకు సమాచారం ఇచ్చారు. నాయర్ జుట్టు గుర్తు పట్టలేని విధంగా పెరిగింది. కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకి చర్మం నల్లగా మారింది. ఇంట్లో మంచం పూర్తిగా పాడుకావడంతో హాల్‌లోని ఓ కుర్చీపై నిద్రపోయేవాడు.
మొత్తానికి అందరూ కలిసి అనూప్ కుమార్‌ని బయట ప్రపంచంలోకి తీసుకొచ్చారు. పన్వేల్‌లోని ఆశ్రమానికి అతడ్ని తరలించారు. అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. తనకు సహాయం చేసిన వారితో నాయర్ కొన్ని మాటలు చెప్పాడు. తల్లిదండ్రులు లేదు.. సోదరుడు చనిపోయాడు. స్నేహితులు ఎవరూ లేరని, ఆరోగ్యం బాగాలేదని తెలిపాడు. కొత్త జీవితం ప్రారంభించే అవకాశం లేదని కన్నీరు పెడుతూ తన బాధ వెల్లబోసుకున్నాడు.