Huge GST Notice To Poor Labour| కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న ఒక నిరుపేదకు లక్షల రూపాయలు పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందాయి. దీంతో ఆ కూలీ షాకయ్యాడు. తన పేరు మీద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని ఆ నోటీసులో ఉంది. దీంతో ఆ వ్యక్తి నిజాలు తెలుసుకోవడానికి ఆరా తీయగా.. మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలానికి చెందిన నిరుపేద కూలీ జానపాటి వెంకటేశ్వర్లుకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పన్ను రూ. 22,86,014 (దాదాపు రూ.23 లక్షలు) చెల్లించాలని విజయవాడలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ నుంచి నోటీసు అందింది. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో వెంకటేశ్వర్లు రూ. కోట్ల మేరకు గ్రానైట్ వ్యాపారం చేశారని, దానికి సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో వివరాలున్నాయి. ఆ నోటీసు గురించి తెలుసుకొని వెంకటేశ్వర్లు షాకైపోయాడు. తాను లక్షలు బకాయి చెల్లించాలా? అని ఆందోళన చెందాడు.
అందుకే ఈ నెల 4న నోటీసు అందుకున్న వెంకటేశ్వర్లు, నోటీసులో పేర్కొన్న విజయవాడలోని కంపెనీ చిరునామాకు బుధవారం వెళ్లగా.. అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం లేదని తేలింది. తనకు తెలియకుండా వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని అతను ఆశ్చర్యపోతున్నాడే. 2022లో తనకు పాన్ కార్డు లేదని, ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా అతని ఆధార్ కార్డును ఎవరో సంపాదించి, దాని ద్వారా పాన్ కార్డు పొంది 2022లో గ్రానైట్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. చంద్రుగొండలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు జీఎస్టీ నోటీసు రావడం ఏమిటని బాధితుడు లబోదిబోమంటున్నాడు.
2 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు
మరోవైపు దేశంలో జీఎస్టీ ఎగవేతలు చేసేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను ఎగవేతలను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రభావం చూపడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు అంటే ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 మధ్యకాలంలో 25,397 జీఎస్టీ ఎగవేతలు నమోదయ్యాయి. వీటి విలువ ఏకంగా రూ. 1.95 లక్షల కోట్లుగా ఉందని లోకసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన అయిదు సంవత్సరాలలో జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి 86,711 కేసులు నమోదయ్యాయి. వీటి విలువ రూ. 6.79 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది.
ఇదే క్రమంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరి నాటికి 25,397 జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి, వీటి విలువ రూ. 1,94,938 కోట్లుగా ఉంది. అలాగే, ఆదాయ పన్నుకు సంబంధించి 13 వేల కేసులు నమోదయ్యాయి, వీటి విలువ రూ. 46,472 కోట్లు. పన్ను ఎగవేతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
గడిచిన అయిదు సంవత్సరాలలో జీఎస్టీ ఎగవేతలు
ఈ విధంగా, జీఎస్టీ ఎగవేతలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను అదుపులోకి తేవడానికి ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.