Warangal Crime News: వరంగల్‌లో సుపారీ హత్యలు కలకలం రేపుతున్నాయి. తన భర్తను చంపేందుకు ఓ భార్య వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ముఠా సభ్యుడి అత్యాశతో సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగింది? ఇంతకీ భర్తను చంపాల్సిన అవసరం భార్యకు ఎందుకు వచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సుపారీ గ్యాంగ్
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకుల తండాలో ఈ యవ్వారానికి వేదికైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆకుల తండాకు చెందిన ధరావత్ సుమన్‌కు అదే మండలం మహేశ్వరం తండాకు చెందిన భూక్యా మంజులతో ఏడేళ్ల కిందట మ్యారేజ్ జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. సుమన్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చార్మినార్ శాఖలోని ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్నాడు.
సుమన్-మంజుల మధ్య ఏం జరిగిందో తెలీదు. రెండేళ్లుగా చీటికి మాటికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ తలనొప్పి లేకుండా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. కొద్దిరోజుల కిందట మంజుల తన సమీప బంధువుతో కలిసి భర్త సుమన్‌ను చంపాలని స్కెచ్ వేసింది.
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
రాయపర్తి, తొర్రూరు, ఆకుల తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులతో రూ.2.50 లక్షలకు సుపారీ డీల్ కుదుర్చుకుంది. ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున నగదును ఇచ్చినట్లు తెలిసింది. ఇంతవరకు మంజుల వేసుకున్న ప్లాన్ బాగానే అమలు అయ్యింది. అసలు కథ ఇక్కడి నుంచే మారిపోయింది. అధిక డబ్బులకు ఆశపడ్డాడు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి.
ALSO READ: ఆ ఒక్క కారణంతో తల్లిని చంపిన కొడుకు
గ్యాంగ్‌లోని నరేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో తరచూ సుమన్‌కు తరచూ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తనకు కొంత డబ్బు ఇస్తే కీలకమైన విషయం చెబుతానని అనేవారు. ఇది జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పగానే భయపడ్డాడు. సరిగ్గా 10 రోజుల కిందట సుమన్ నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, కాల్ డేటా ఆధారంగా నరేష్‌ను విచారించడంతో హత్య ప్రణాళిక బయటపడింది.
హోలీ రోజు ప్లాన్
హోలీ రోజు బ్యాంకు ఉద్యోగి సుమన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు నరేష్. భార్య మంజులతో పాటు మోతీలాల్, నరేష్, మల్లేష్, గోపీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసిన వ్యవహారం వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
నెల కిందట
నెలకిందట వరంగల్ సిటీలో ఓ డాక్టర్‌ను సొంత భార్య హత్య చేయిచింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌తో డీల్ సెట్ చేసుకుంది. చివరకు పోలీసులకు అడ్డంగా చిక్కింది. ఈ ఘటన జరిగి పది రోజుల తర్వాత అలాంటి ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కాకపోతే సుపారీ గ్యాంగ్‌తో డీల్ ఓకే అయ్యింది. అనుకోని పరిస్థితుల్లో ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది అడ్డంగా ఆ మహిళ బుక్కైంది.