Governor: రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ప్రకారం గవర్నర్ల అధికారాల గురించి సవివరంగా ఉంది. గవర్నర్ కు ఎలాంటి అధికారాలు ఉంటాయి..? అధికారాలను ఎంత మేరకు ఉపయోగించాలి..? అనే రాజ్యాంగంలో క్లారిటీగా ఉంది. గవర్నర్ కు సంబంధించి ఆర్టికల్స్ నంబర్లతో సహా సవివరంగా ఉంటుంది. అయితే గవర్నర్ల అధికారాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం ఓ చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి పరిశీలన కోసం అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను స్టేట్ గవర్నర్ శాశ్వతంగా తన దగ్గర ఉంచుకోవద్దని తీర్పునిచ్చింది. శాసనసభ ఆమోదం పొందిన 10 బిల్లులకు ఆమోదముద్ర వేయకుండా తన వద్దే పెట్టుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గవర్నర్ ఈ విధంగా బిల్లులను తన దగ్గరే అంటిపెట్టుకోవడం చట్టవిరుద్ధమని, నిరంకుశత్వమని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం సీరియస్ అయ్యింది. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను తన దగ్గర పెట్టుకోవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని వివరించింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవని ప్రస్తావించింది. తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘గవర్నర్ 10 బిల్లులను నిలుపుదల చేశారు. అసెంబ్లీ మళ్ళీ బిల్లులు ఆమోదించి తిరిగి పంపినప్పుడు అయినా వాటిని ఆమోదించి ఉండాల్సింది. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగం పట్ల విశ్వాసంతో వ్యవహరించలేదు’ అని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన బెంచ్ మందలించింది. రాష్ట్ర యూనివర్సిటీలకు వీసీల నియామకంతో పాటు కీలకమైన బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత, వాటిని గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారు. నిర్దిష్ట గడువు పూర్తయిన తర్వాత కూడా అలాగే ఉంచుకున్నారు. దీంతో, తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదివరకే వాదనలు పూర్తవ్వగా అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
న్యాయ సమీక్షకు లోబడి గవర్నర్ చర్యలు
‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు పరిశీలనకు వచ్చినప్పుడు గవర్నర్ ముందు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. బిల్లుకు సమ్మతిని ఇవ్వవచ్చు.. లేదా అసమ్మతిని కూడా తెలియజేయవచ్చు. లేదా బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. బిల్లులోని ఏవైనా నిబంధనల పునఃపరిశీలన కోసం సభకు లేదా సభలకు తిరిగి పంపవచ్చు. అయితే, సభ తిరిగి ఆమోదించి పంపిన తర్వాత కూడా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా దగ్గర పెట్టుకోవద్దు. రాజ్యాంగానికి, ఆదేశిక సూత్రాలకు, జాతీయ సమగ్రతకు వ్యతిరేకంగా ఉందనిపిస్తే సదరు బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ రిజర్వ్ చేయవచ్చు. అయితే, ఈ ఆప్షన్లు వినియోగించుకోవడానికి గవర్నర్‌కు నిర్దిష్ట కాలపరిమితులు ఉంటాయి. ఈ కాల పరిమితులు దాటినా క్లియరెన్స్ ఇవ్వకపోతే గవర్నర్ చర్యలు న్యాయ పరిశీలనకు దారితీస్తాయి.
బిల్లుకు సమ్మతిని నిరారించడానికి, మంత్రి మండలి సలహాతో రాష్ట్రపతి సమీక్షకు బిల్లు రిజర్వ్ చేయడానికి గవర్నర్లకు కోర్టు ఒక నెల గడువును ఇచ్చింది. మంత్రి మండలి సలహా లేకుండా బిల్లును రిజర్వ్ చేసే సందర్భాల్లో ఈ గడువు మూడు నెలలుగా ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ పునఃపరిశీలన తర్వాత బిల్లును గవర్నర్‌కు సమర్పిస్తే గవర్నర్ ఒక నెల వ్యవధిలోనే ఆమోదించాలి. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలన్నీ న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇది గవర్నర్ అధికారాలను అణగదొక్కడం ఎంతమాత్రం కాదని పేర్కొంది. గవర్నర్ చర్యలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
చారిత్రాత్మకం.. స్వాగతిస్తున్నాం: సీఎం స్టాలిన్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ విజయం కేవలం తమిళనాడుకే కాదని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల గెలుపు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి, సమాఖ్య రాజకీయాల కోసం కోసం డీఎంకే తన పోరాటాన్నే కొనసాగిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన క్లారిటీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఆ పది బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్టుగా భావిస్తున్నానని సీఎం స్టాలిన్ తెలిపారు.