Indian Army New Strategies: నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధం జయించలేం. ఇదీ చీఫ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ చేసిన కామెంట్. ఈ కామెంట్లలో ఆయన ఉద్దేశమేంటి? ఈ వ్యాఖ్యలు మనం ఎలా అర్ధం చేసుకోవాలి? గత ఆపరేషన్ సిందూర్ లో భారత్ పాక్ ని నిలువరించడానికి గల కారణమేంటి? చైనా వెపన్ సపోర్ట్ కూడా ఉండి పాక్ చేతులెత్తడానికి గల రీజన్లేంటి? టర్కీ, యూఎస్ సహకారం ఉండి కూడా పాకిస్తాన్ ఎందకలా వెనక్కు తగ్గింది?
రేపటి టెక్నాలజీతో ఇవాళ్టి యుద్ధం చేయాలి
వ్యూహాలకు పదును పెట్టి యుద్ధాలు గెలిచిన భారత్, ఇరాన్ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. కొత్త టెక్నాలజీ పరాయి వారిది కారాదు.. ఆయుధం ఏదైనా సరే మనమే ఓన్ గా తయారు చేసుకోవాలి. ఇతరుల టెక్నాలజీ ఎంతైనా ఇతరులదే. కాబట్టి.. వారిపై ఆధారపడ్డం తగ్గించుకోవాలి. ఇదీ ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. చేసిన కామెంట్ల సారం. ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. అనిల్ చౌహాన్ మాటల్లో అర్ధమేంటని మరింత డీటైల్డ్ వర్షెన్లోకి వెళ్తే.. ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అదేంటంటే రేపటి టెక్నాలజీని వాడి ఇవాళ్టి యుద్ధం చేయాలి. నిన్నటి ఆయుధాలతో యుద్ధం గెలవలేం అంటారాయన. ఢిల్లీలో జరిగిన ఒక వర్క్ షాప్ లో పాల్గొన్న సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఈ రకమైన కామెంట్లు చేశారు. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన మిషన్లలో పాల్గొనేటపుడు.. ఈ జాగ్రత్త అత్యవసరంగా చెప్పారాయన. దిగుమతి చేసుకున్న టెక్నాలజీ అస్సలు వాడకూడదని హితవు పలికారు అనిల్ చౌహాన్. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఆయధాలను మనం సమర్ధవంతంగా తిప్పి కొట్టామంటే అందుకు కారణం. భారత సైన్యం వాడిన ఆకాష్, బ్రహ్మోస్ వంటి స్వదేశీ ఆయుధ పరిజ్ఞానమే అంటారాయన.
AI డెకాయ్ లైన X గార్డ్‌ల ద్వారా తిప్పి కొట్టిన భారత్
అదే పాక్ డ్రోన్లను టర్కీ నుంచి ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుందని.. ఈ పరాయి పరిజ్ఞానమే ఆ దేశాన్ని యుద్ధంలో తోక ముడిచేలా చేసిందని అంటారు సీడీఎస్ అనిల్ చౌహాన్. ఈ కామెంట్లలో కొన్ని విషయాలను విశ్లేషిస్తే.. చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.. భారత్ వాడిన రాఫెల్ యుద్ధ విమానాల్లోని.. AI డెకాయ్ లైన ఎక్స్ గార్డ్ ల ద్వారా భారీ ఎత్తున తిప్పి కొట్టిన మాట వాస్తవం. ఒక సమయంలో మన డమ్మీలను అసలైన విమానాలుగా భావించి.. తమ అడ్రెస్ తామే తెలియ చేసుకుని.. భారత్ నుంచి దారుణంగా దెబ్బ తినింది పాక్ వాడిన చైనీస్ టెక్నాలజీ. అదే మనం ఇలాంటి ఎన్నో వ్యూహాలతో పాక్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాం. భారత్.. కొన్ని ఆయుధాలను దిగుమతి చేసుకున్నా.. మరికొన్నిటిని రష్యన్, ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో.. ఓన్ మేడ్ వెపన్స్ తయారు చేసుకోవడం వల్ల.. వాటిపై మనకంటూ ఒక పట్టు ఏర్పడింది. దీంతో వీటి వాడకంపై మనం గట్టి కమాండ్ కలిగి ఉన్నామని అంటారు సీడీఎస్ చౌహాన్.
సొంత శాటిలైట్ సమాచారం వాడుకున్న భారత్
అంతే కాదు మనం మన సొంత శాటిలైట్ సమాచారం వాడుకున్నాం. అందుకే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలను అడ్రెస్ తో సహా పసిగట్టి.. గురి చూసి కొట్టగలిగాం. అందుకే ఈ ఆపరేషన్లో మనకు ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేసిన దేశంగా పేరొచ్చింది. అదే పాక్ చైనా నుంచి శాటిలైట్ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది. కానీ ఆ సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్ గా సీడీఎస్ అనిల్ చౌహాన్ చెప్పే మాటలేంటంటే.. యుద్ధమంటూ వచ్చాక ఇరు పక్షాలకు నష్టమైతే తప్పక కలుగుతుంది. అయితే ఎవరెంత తక్కువ నష్టానికి యుద్ధం ముగించారన్నది అత్యంత కీలకంగా మారుతుంది. ఆపరేషన్ సిందూర్ కన్నా ముందే.. పాక్ ఆయుధాల లేమితో అల్లాడుతున్న రిపోర్టులు అందాయి. ఉక్రెయిన్ కి తన మందుగుండును ఎక్కువగా సరఫరా చేయడంతో యుద్ధ సమయానికి ఆ దేశం చెంత నాలుగు రోజులకు మాత్రమే సరిపోయే సరుకుంది. అలాగని పాక్ తక్కువ తినలేదు. ఇటు టర్కీ నుంచి డ్రోన్ల సాయాన్ని.. అటు చైనా నుంచి పీఎల్ 15ల సదుపాయాన్ని పొందింది.
తెలివిగా యుద్ధ వ్యూహం మార్చిన భారత్
ఒక సమయంలో చైనా పీఎల్ ఫిఫ్టీన్ల దెబ్బకు మన రాఫెల్స్ నేలరాలిపోతున్నట్టు పెద్ద పెద్ద పత్రికల్లో కథనాలొచ్చాయి. అయితే భారత్ తెలివిగా యుద్ధ వ్యూహం మార్చింది. వారి అణ్వాయుధ నిల్వలున్న కిరానా కొండలకు దగ్గర్లోని నూర్ ఖాన్ బేస్ పై గురి చూసి కొట్టింది. ఈ ప్రాతం ఎంత కీలకమంటే ఇది గాలిలో ఉన్న యుద్ధ విమానాలకు ఇంధనం అందించే డిపో. రెండోది ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్, అణ్వాయుధ నిర్వహణా కార్యాలయం నేషనల్ కమాండ్ ఆఫీస్.. ఈ రెండూ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. దానికి తోడు మన బ్రహ్మోస్ పని తీరు ఈ ప్రపంచానికి తెలియ చెప్పాలనుకున్న భారత్ సరిగ్గా ఈ ఎయిర్ బేస్ పై కొట్టింది. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్నట్టు.. టోటల్ వార్ స్టోరీ కాళ్లబేరానికి వచ్చిందని అంటారు యుద్ధ వ్యూహకర్తలు.
పాక్ వల్ల చైనా, యూఎస్‌లకు కూడా చెడ్డపేరు
పాక్ చేతగానితనం వల్ల చైనా ఆయుధ సామర్ధ్యం మాత్రమే కాదు.. అమెరికా యుద్ధ విమానాలకు కూడా చెడ్డ పేరు వచ్చింది. దీంతో రెండు దేశాలూ ఈ ఆపరేషన్లో దారుణంగా దెబ్బ తిన్నాయి. దీనంతటికీ కారణం అనిల్ చౌహాన్ చెప్పినట్టు.. ఆయుధ తయారీలో పాక్ కి సొంత తెలివి లేక పోవడం. వారికంటూ తగిన యుద్ధ వ్యూహం లేక పోవడమే అన్నది అనిల్ చౌహాన్ కామెంట్ల సారం. ఇక్కడ మరో ముఖ్యమైన అంశమేంటంటే.. ఇంత పెద్ద ఆయుధ సంపత్తిగల రష్యా.. గత మూడేళ్లకు పైగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తూనే ఉంది. ఈ యుద్ధం ఇప్పటి వరకూ ఆగినట్టే కనిపించదు. అదే భారత్ సాటి అణ్వాయుధ దేశమైన పాక్ తో నాలుగు రోజులకే యుద్ధం ముగిసిపోయేలా చేయగలిగింది. మన స్వదేశీ ఆయుధ సామర్ధ్యంతో పాటు.. వ్యూహ రచనా సామర్ధ్యం కూడా కీలకమైనదే అంటారు నిపుణులు. కారణం భారత్ ఎప్పుడూ సుదీర్ఘ కాల యుద్ధాలను కోరుకోదనీ.. అలా చేయటం వల్ల దేశ ఆర్ధికాభివృద్ధి మందగిస్తుందని.. రక్షణ రంగంలో ఆటోమేషన్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అంటారు అనిల్ చౌహాన్ వంటి నిపుణులు.
రష్యన్ లాంగ్ వార్ వల్ల 500 శాతం సుంకాల బెడద
రష్యా- ఉక్రెయిన్ తో చేస్తున్న సుధీర్ఘ యుద్ధం ఎంత దారుణమైనదంటే, ప్రస్తుతం ఆ దేశం నుంచి ముడి చమురు కొంటున్న దేశాలపై 500 శాతం సుంకాలను విధించాలని చూస్తోంది యూఎస్. అంతేనా ఉక్రెయిన్ తో పదేళ్ల పాటు ఖనిజాల తవ్వకానికి ఒప్పందం చేసుకుంది. అంటే ఎటు చూసినా సుదీర్ఘ యుద్ధం రెండు దేశాలకు ఏమంత మంచిది కాదన్న విషయం తేటతెల్లమవుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఇరాన్- ఇజ్రాయెల్ వార్ కూడా సరిగ్గా భారత్- పాక్ యుద్ధంలా త్వరిత గతిలోనే ముగిసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. ఇజ్రాయెల్ హై ఎండ్ టెక్నికల్ వెపన్స్ కలిగిన దేశం. లేజర్ టెక్నాలజీతో ఎంత పెద్ద యుద్ధ విమానాలనైనా కూల్చి వేసే సామర్ధ్యం కలిగిన కంట్రీ. ఇదిలా ఉంటే ఇరాన్ దగ్గర 1960ల నాటి ఆయుధాలు మాత్రమే ఉండేవి. అయినా సరే ఇజ్రాయెల్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. రోజుకు 2500 కోట్ల మేర ఖర్చు చేయించి మరీ చుక్కలు చూపించింది ఇరాన్. ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో అడ్వాంటేజీ తీస్కుంది ఇరాన్. యూఎస్ కి ఖతార్ లో ఉన్న అల్ ఉదీద్- సైనిక స్థావరంపై దాడి చేసి.. తద్వారా కాల్పుల విరమణకు అవకాశమేర్పడేలా చేసింది.
వ్యూహాలకు పదును పెట్టి యుద్ధాలు గెలిచిన భారత్, ఇరాన్
ఇరాన్ కి కావచ్చు, భారత్ కి కావచ్చూ యుద్ధాలను ఇంత సులువుగా ముగించగలగడానికి వ్యూహాలే ఎక్కువ పని చేశాయని చెప్పాలి. అదే పాక్ వెనక ఇటు చైనాతో పాటు అటు యూఎస్ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ గా నిలిచాయి. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్ వెనక అతి పెద్ద బంకర్ బస్టర్ బాంబులు వేయగల అమెరికా ఉంది. అయినా సరే లెక్క చేయక భారత్, ఇరాన్ ఆయుధాలతో పాటు వ్యూహాలకు మరింత పదును పెట్టడం వల్లే.. ఈ యుధాలు ముగిశాయని చెప్పాలంటారు నిపుణులు. అనిల్ చౌహాన్ చేసిన ఈ కామెంట్ల వెనక దాగిన మరో ముఖ్యమైన అంశమేంటంటే.. ఆత్మనిర్భర భారత్. ఆత్మనిర్భర భారత్ ద్వారా మన రక్షణ రంగం ఎలా ప్రభావితమైంది? అందుకు మన దగ్గరున్న ఆధారాలేవి? మన ఆయుధ మార్కెట్ ఎలా విస్తరించింది? ఆ వివరాలు మరోమారు గుర్తు చేసుకుందాం.
గత కొన్ని యుద్ధాలుగా రష్యన్ ఆయుధాలే సపోర్ట్
బడ్జెట్ పెట్టలేని దేశాలకు ఆశాజనకంగా భారత్అనిల్ చౌహాన్ చేసిన కామెంట్లలో గుర్తించాల్సిన కీలకాంశం ఆత్మనిర్భర భారత్. అంటే స్వదేశీ పరిజ్ఞానంపై వీలైనంత ఎక్కువగా ఆధారపడ్డం అవసరం. అదే దేశానికి మేలు చేస్తుందని అంటారాయన. నిజానికైతే.. మనం గత కొన్ని యుద్ధాలుగా.. రష్యన్ ఆయుధాలనే ఎక్కువ సపోర్ట్ గా తీస్కుంటున్నాం. అంతరిక్ష రంగంలో కూడా తొలి నాళ్లలో ఇలాగే చేశాం. తర్వాతి కాలంలో రష్యన్ సాంకేతిక సహకారంతో.. మనమే మన మిషన్లు కంప్లీట్ చేయడం ఎలాగో నేర్చుకుంటూ వచ్చాం. బేసిగ్గా భారత దేశం దగ్గరున్న ఆయుధాలలో 70 శాతం రష్యన్ మేడ్ ఉంటాయి. తర్వాత మనకున్న సాంకేతిక సాయం ఇజ్రాయెల్ నుంచి ఎక్కువ అందుతుంది. అయితే ఇక్కడే భారత రక్షణ రంగం.. కాస్త తెలివిగా ఆలోచించి.. ఆయా దేశాల సాంకేతిక సహాయం తీసుకుంటూనే సొంతంగా ఆయుధాల తయారీ చేస్తూ వచ్చాం.
ఎస్ 400 కి ధీటుగా ప్రాజెక్ట్ కుషా
బ్రహ్మోస్ లో రష్యన్ సాంకేతిక పరిజ్ఞానం లేక పోలేదు. ఉంది. కానీ, దాన్నిమన చేతులతో మనం తయారు చేయడం వల్ల వచ్చిన లాభమేంటంటే దాని గుట్టు మట్లు మనకు బాగా తెలిసిపోతాయి. అదే జీవిత కాలం పాటు పరాయి దేశం నుంచి ఆయుధ దిగుమతి చేసుకోవడం వల్ల నష్టమేంటంటే.. విపరీతమైన ఖర్చు. దానికి తోడు వాటిపై మనకు పట్టుండక పోవడం మరో నష్టం. ఇదే అతి పెద్ద సమస్యాత్మకం. మొన్నటి యుద్ధంలో మనం వాడిన ఎస్ 400, రాఫెల్ ఈ రెండు డీల్స్ కి సంబంధించిన వ్యయం అక్షరాలా లక్ష కోట్ల మేర. అదే మనమే తయారు చేసుకోవడంపై దృష్టి సారిస్తే.. ఈ ఖర్చును విపరీతంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం భారత్ ఈ రెండింటి విషయంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ మొదలు పెట్టింది. దీన్నే ప్రాజెక్ట్ కుషా అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం.. సుదూర లక్ష్యాలను చేధించగల లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ని డెవలప్ చేయడం. ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చురుగ్గా పని చేస్తోంది.
రాఫెల్, ఎఫ్ 35 ధీటుగా పిఫ్త్ జనరేషన్ జెట్స్ తయారీ
అంతే కాదు రాఫెల్, ఎఫ్ 35 రకాలకు ధీటుగా భారత్ ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను తయారు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వీటి తయారీలో కూడా రష్యన్ సపోర్ట్ తీసుకుంటోంది. ఈ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్‌లోనే తయారుచేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయనుంది- రష్యా. భారత్ ఇలా చేయడం వల్ల ఆయుధ మార్కెట్ నానాటికీ విస్తరిస్తోంది. ఆకాష్ ఇప్పటికే 23 వేల కోట్ల విలువైన ఆర్డర్ పట్టేసింది. ఇదెందుకంత ప్రత్యేకం అంటే పాక్ వాడిన టర్కిష్ డ్రోన్ దాడులను సమర్ధవంతంగా తిప్పి కొట్టింది ఆకాశే. 1980లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రొగ్రాం ద్వారా రూపు దిద్దుకుంటూ వచ్చింది ఆకాశ్. ఇది శతృ విమానాలు, డ్రోన్లు, చాపర్లను ఢీ కొట్టగలదు. దీన్ని మన డీఆర్డీవో, బీఈఎల్, బీడీఎల్ సంయుక్త నిర్వహణలో తయారు చేశారు.
పాక్ డ్రోన్లను భారీగా దెబ్బ తీసిన ఫోర్‌డీ
వీటితో పాటు ఇండియన్ మేడ్ యాంటీ డ్రోన్ ఫోర్- D సిస్టమ్ కూడా పెద్ద ఎత్తున వర్కవుట్ అయ్యింది. ఆత్మనిర్భర భారత్ కింద భారత్ తయారు చేసిన ఈ స్వదేశీ పరిజ్ఞానపు మచ్చు తునక భారత్ అమ్ముల పొదిలో అత్యంత ప్రధానాస్త్రం. పాక్ డ్రోన్లను పెద్ద ఎత్తున దెబ్బ తీసిన ఆయుధాల్లో ఇది ఎంతో ఖచ్చితత్వంతో పని చేసింది. ఇది డీఆర్డీవో తయారు చేసిన బీడీఎల్ వారి తయారీ. ఇక నాగాస్త్ర- 1 సైతం.. స్వదేశీ పరిజ్ఞానపు ఆయుధమే. ఆత్మాహుతి డ్రోన్ సంతతికి చెందిన ఈ ఆయుధం.. టార్గెట్ దొరికే వరకూ ఆ ప్రాంతంలో ఉండి.. ఆపై దానిపై దాడి చేసే రకం. ఇటు టార్గెట్ ఛేజింగ్ తో పాటు అటు ధ్వంసం చేయగల సామర్ధ్యం దీని సొంతం. ఇక స్కై స్ట్రైకర్స్. ఇది బెంగళూరులో తయారు చేసిన ఆయుధం. భారత్- ఇజ్రాయెల్ జాయింట్ వెంచర్. ఇది కూడా ఆపరేషన్ సిందూర్ లో భారత్ పరువు నిలిపిన అస్త్రమే. ఈ ఆయుధాలన్నీ సూపర్ హిట్ కావడంతో ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ విలువ పెంచినవే.
Also Read: బాలానగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆయుధాలను కొనడానికి ఎగబడుతున్నాయి వివిధ దేశాలు. ఒకప్పుడు ఆయుధాలంటే అమెరికా- రష్యా ఆపై ఫ్రంచ్- చైనా. అదే ప్రస్తుతం చిన్నా చితకా దేశాలు.. పెద్ద పెద్ద బడ్జెట్ కేటాయించ లేని దేశాలకు భారత్ ఆశా జనకంగా కనిపిస్తోంది. దీంతో మనం ఇటు పాక్ వంటి దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూనే.. ఆపై ఎన్నో దేశాల నుంచి ఆయుధ ఆర్డర్లను సైతం పొందుతున్నాం. ఇదే భారత చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ అనిల్ చౌహాన్ చెబుతోన్న మాటలకర్ధం అంటారు ఆయుధ నిపుణులు.
Story By Adhinarayana, Bigtv