Dancers Kidnap Groom| పెళ్లి అనగానే అది ఒక పండుగ. అందుకే గానా బజానా పేరుతో సంగీత్ కార్యక్రమాల్లో అందరూ డాన్సులు కూడా చేస్తుంటారు. అయితే భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలకు డాన్సర్ల చేత ప్రత్యేక కార్యక్రమాలు చేయిస్తుంటారు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, హర్యణా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో అయితే హిజ్రాల చేత భారీగా డాన్స్ ప్రొగ్రామ్ ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన అలాంటి ఒక డాన్స్ ప్రొగ్రామ్ లో కాస్త హింసాత్మకంగా మారింది. డాన్స్ చేసేందుకు వచ్చిన హిజ్రాలు అతిథులపై దాడి చేసి ఏకంగా పెళ్లి కొడుకునే అందరిముందు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బిహార్ రాష్ట్రంల గోపాల్ గంజ్ జిల్లాలో సాధు చౌక్ ప్రాంతానికి చెందిన సురేంద్ర శర్మ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో ఒక ఫంక్షన్ హాల్ లో రెండు రోజుల క్రితం పెళ్లి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. పెళ్లి రిసెప్షన్ లో భాగంగానే సెలెబ్రేషన్స్ కోసం 15 మంది హిజ్రాలతో స్టేజిపై డాన్స్ ప్రొగ్రామ్ పెట్టారు. అయితే రాత్రి 8 గంటలకు ప్రారంభమైన డాన్స్ ప్రొగ్రామ్ అర్ధరాత్రి 12 దాటినా జరుగుతూనే ఉంది. దీంతో హిజ్రా డాన్సర్లంతా అలసిపోయారు.
ఇక కొనసాగించలేమని చెప్పినా పెళ్లిలో చాలా మంది పెద్దలు అతిథులుగా వచ్చారని ఇంకా గంటసేపు కొనసాగించాలని పెళ్లి పెద్దలు వారిపై ఒత్తిడి చేశారు. కానీ తాము అలసి పోయామని ఇక చేయలేమని వారు చెప్పినా పెళ్లి కూతరు తండ్రి ఒప్పుకోలేదు. పైగా వారితో అసభ్యంగా మాట్లాడారు. దీంతో పెళ్లిలో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత హిజ్రాలను కొంతమంది చితకబాదారు. ఫలితంగా హిజ్రాలు కూడా ఎదురు తిరిగారు. మొత్తం 15 మంది హిజ్రాలు.. పెళ్లిలో అంతా ధ్వంసం చేశారు.
పెళ్లి పెద్దలు, అతిథులపైన దాడులు చేసి వారి వద్ద ఉండే బంగారు నగలు, నగదు దోచుకున్నారని వధువు తల్లి విద్యావతి దేవి తెలిపారు. ఆ తరువాత అందరూ చూస్తుండగా.. రిసెప్షన్ స్టేజీపై కూర్చొని ఉన్న పెళ్లి కొడుకుని మెడపై కత్తి పెట్టి తీసుకెళ్లారు. ఇదంతా చూసి పెళ్లి కూతురు స్పృహ తప్పి పడిపోయిందని విద్యావతి దేవి అన్నారు. పెళ్లి అతిథులు గాయపడి ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లగా..ఈ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
పెళ్లి కొడుకు కోసం మొత్తం 8 గంటల పాటు గాలించారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు పొరుగు జిల్లా సీవాన్ లో ఆ హిజ్రాలు ఉన్నారని తెలిసుకొని అక్కడి నుంచి పెళ్లి కొడుకుని విడిపించారు. గోపాల్ గంజ్ ఎస్ పి అవధేష్ దీక్షిత్ మాట్లాడుతూ.. పెళ్లి కొడుకు ని కిడ్నాప్ చేసిన హిజ్రా డాన్సర్లు అతడికి ఏ హాని చేయలేదని, పైగా.. మంచి ఆహారం ఇచ్చి ఒక గదిలో పెట్టారని ఆయన తెలిపారు. అయితే పోలీసులు రావడం చూసి ఆ హిజ్రాలు పారిపోయారని అన్నారు.
Also Read: మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. జైలు సెక్యూరిటీ గార్డులు రాక్షసంగా ఆమెను
ఈ కేసులో హిజ్రాలకు వారి డాన్స్ చేసినందుకు పెళ్లి పెద్దలు డబ్బులు చెల్లించలేదని.. పైగా వారిపై ఎక్కువ సేపు డాన్స్ కోసం ఒత్తిడి చేసినందుకే గొడవ జరగడంతో ఇదంతా జరిగిందని మీడియకు ఎస్ పి అవధేష్ దీక్షిత్ తెలిపారు. హిజ్రాలు కోసం గాలిస్తున్నామని అన్నారు.