Delhi-NCR Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను రెండురోజుల కింద భారీ భూకంపం కుదిపేసింది. అత్యంత శక్తివంతమైన భూకంపం వల్ల దాదాపు 2,200 మందికి పైగా మృత్యువాత పడ్డారు. క్షతగ్రాతుల గురించి చెప్పనక్కర్లేదు. 3,600 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. దశాబ్దం తర్వాత ఆ దేశంలో ఈ స్థాయిలో వచ్చిన భూకంపం ఇదే. దీని నష్టం గురించి చెప్పనక్కర్లేదు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం నంగర్హార్, దాని పరిసర ప్రాంతాలలో 160 కిలోమీటర్లలో ఈ భూకంపం సంభవించింది. దాని ప్రభావం ఇండియాలోని జమ్మూకాశ్మీర్, ఢిల్లీ ప్రాంతాలపై పడింది. అక్కడ కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ-NCS తెలిపింది. భూమికి 135 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు తెలుస్తోంది.
భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ లెక్కన ఉత్తరాదిలో ప్రకంపనలు చోటు చేసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇకపై పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లో ఆ తరహా ప్రకంపనలు వస్తే ఉత్తరాదికి ముప్పే ఉన్నట్టే.
బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.0 నమోదు అయ్యింది. దాని ధాటికి అనేక గ్రామాలు నేల మట్టమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో శిధిలాలు దిబ్బగా మారిపోయాయి. అక్కడి ప్రజలు మట్టి-ఇటుకలు-కలపతో నిర్మించిన ఇళ్ల శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు.
ALSO READ: అమెరికా కూల్ డ్రింక్స్ ఇక బంద్.. ఆ రాష్ట్రంలో హోటళ్లు కీలక నిర్ణయం
నంగర్హార్-లాగ్మాన్ ప్రావిన్సుల్లో మరో 12 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు, అక్కడి సైన్యం శిథిలాల నుండి చిక్కుకుపోయినవారిని బయటకు తీస్తున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చెబుతున్నారు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అత్యవసర సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కునార్ ప్రాంతంలో 5,400 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు సహాయక బృందాలు చేరుకోలేదు. ఈలోగా ప్రకృతి భూకంపం రూపంలో కన్నెర్ర చేసింది. మరోవైపు ఆఫ్ఘాన్ భూకంప బాధితులకు సహాయంలో భారత్ నిమగ్నమైంది.
భారత్ నుంచి ఓ విమానం కాబూల్‌కు చేరుకుంది. దుప్పట్లు, టెంట్లు, పరిశుభ్రత కిట్లు, నీటి నిల్వ ట్యాంకులు, జనరేటర్లు, వంటగది పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, స్లీపింగ్ బ్యాగులు, అవసరమైన మందులు, వీల్‌చైర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వైద్య వినియోగ వస్తువులు సహా 21 టన్నుల సహాయ సామగ్రిని తరలించినట్టు ఎక్స్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.