భారత్ పై ప్రతీకార సుంకాలు విధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం నెగ్గించుకున్నారు. 25 శాతంతో మొదలు పెట్టి ఏకంగా 50శాతానికి చేర్చి భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని చూశారు. రష్యా చమురు ఒప్పందాన్ని బూచిగా చూపించి మరీ భారత్ పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. అయితే దీనికి విరుగుడుగా భారత ప్రభుత్వం ఇంకా ప్రత్యక్ష కార్యాచరణకు దిగలేదు. కానీ భారతీయులు మాత్రం ట్రంప్ నిర్ణయంపై రగిలిపోతున్నారు. కచ్చితంగా బదులు తీర్చుకోవాలని చూస్తున్నారు. మొట్టమొదటిగా తమిళనాడు వ్యాపారులు అమెరికాపై రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. అమెరికా కూల్ డ్రింక్స్ ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
అమెరికా డ్రింక్స్ బహిష్కరణ..
తమిళనాడు హోటల్ యజమానులు సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘం లో 10వేల హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటన్నిట్లో అమెరికా కంపెనీలైన పెప్సీ, కోకాకోలాకు చెందిన పానీయాలేవీ అందుబాటులో ఉంచరు. వారం రోజుల్లోగా ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హోటల్ యజమానుల సంఘం ప్రకటించింది. అమెరికా సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్టు వారు తెలిపారు.
ప్రత్యామ్నాయం ఏంటి?
భారత్ లో కూల్ డ్రింక్స్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. అందులో పెప్సీ, కోకాకోలా.. బ్రాండ్లకు మరింత డిమాండ్ ఉంటుంది. ఆ రెండు బ్రాండ్లకు చెందిన వివిధ కూల్ డ్రింక్స్ మార్కెట్ ని ఆక్రమించాయి. వాటితో భారతీయ కూల్ డ్రింక్స్ బ్రాండ్లు పోటీ పడలేకపోతున్నాయి. కేవలం ప్రచారంతోనే మల్టీనేషనల్ బ్రాండ్లు భారత్ మార్కెట్ ని క్యాప్చర్ చేశాయి. వాటికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు దేశీయ ఉత్పత్తులను విక్రయిస్తామని తమిళనాడు హోటల్ యజమానుల సంఘం స్పష్టం చేసింది. స్థానికంగా లభించే సోడాలు, కూల్ డ్రింక్స్, దేశీయ బ్రాండ్లు అయిన రిలయన్స్ లాంటి బ్రాండ్ల డ్రింక్స్ ని విక్రయించడానికి వారు సిద్ధమయ్యారు.
గతంలో కూడా..
తమిళనాడు హోటల్ యజమానుల సంఘం పెప్సి, కోకాకోలా వంటి కంపెనీల డ్రింక్ లను బహిష్కరించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తమిరబరణి నది నీటి వాడకం విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నది నీటిని పెప్సి, కోకాకోలా తయారీ కర్మాగారాలు విచ్చలవిడిగా ఉపయోగించడంతో స్థానిక రైతులు నష్టపోయేవారు. దీంతో తమిళనాడు వ్యాపారులు వారికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత కోర్టు కేసులు, ఇతరత్రా సంప్రదింపులతో ఆ బహిష్కరణ ఎత్తివేశారు. తాజాగా అమెరికా సుంకాల నేపథ్యంలో మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా దిగొస్తుందా..?
అమెరికా ఉత్పత్తులను మనం బహిష్కరిస్తే సుంకాల మోత తగ్గుతుందో లేదో చెప్పలేం కానీ, అమెరికాపై ఒత్తిడి పెరుగుతుందనేమాట వాస్తవం. ఈ విషయంలో చైనాను ఏ దేశమైనా ఆదర్శంగా తీసుకోవాలి. టెక్నాలజీతో సహా స్థానిక ఉత్పత్తులకే చైనా తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ ప్రయత్నం మనం కూడా చేస్తే, దెబ్బకు అమెరికా దిగి రావాల్సిందే. ట్రంప్ సుంకాలను వెనక్కు తీసుకోవాల్సిందే. అయితే అలాంటి తీవ్రమైన ఒత్తిడి మనం తీసుకు రాగలమా అనేది వేచి చూడాలి. ఈ బహిష్కరణ కేవలం తమిళనాడుకే పరిమితం అయితే ప్రయోజనం ఉండదు. యావత్ భారత దేశం మొత్తం అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తే అప్పుడు అగ్రరాజ్యం తన తప్పు తెలుసుకునే అవకాశం ఉంటుంది.