Uddhav Thackeray Shinde| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని చాలామంది ఇప్పుడు నిజమైన శివసేన ఎవరిదో తేలిపోయిందా? అనే ప్రశ్నను అడిగారు. ఎన్నికల్లో గెలిచిన పార్టీ నిజమైన శివసేన అని ఒకవైపు ఏక్ నాథ్ షిండే, మరోవైపు ఉద్ధవ్ బాల్ ఠాక్రే సవాల్ చేశారు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడంతో ఏక్ నాథ్ షిండే వర్గానికి విజయం లభించింది. బిజేపీ, షిండే శివసేన నాయకులు నిజమైన శివసేనను ప్రజలు గెలిపించారు. అని బాలా సాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలపై నడిచే ఏక్ నాథ్ షిండేకు మాత్రమే చెందుతుందని మాట్లాడుతన్నారు.
గెలిచిన వారంతా ఈ చర్చలో ఉంటే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం 2022లో తన ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్ నాథ్ షిండేపై మరోరకంగా దాడి చేశారు. “ఆ రోజు (2022లో) నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించావు. నన్ను వర్ష (ముఖ్యమంత్రి అధికారిక నివాసం పేరు) నుంచి బయటకు పంపావు. ఈ రోజు నీకు కూడా అదే గతి పట్టింది. నీవు కూడా ముఖ్యమంత్రి పదవి ఖాళీ చేయాల్సిందే. దేవేంద్ర ఫడ్నవీస్ కింద పనిచేయాల్సిందే. ఇప్పుడు నీవు కూడా వర్ష ఖాళీ చేసి బయటికి రావాల్సిందే. ఎన్నికల్లో గెలిచినా నీకు అదే గతి అంతే” అంటూ ఏక్ నాథ్ షిండేని ఉద్ధవ్ ఠాక్రే చురకలు అంటించారు.
Also Read: సీఎం అయ్యేది ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్ నాథ్ షిండే?
2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీ, శివసేన కూటమి విజయం సాధించింది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఓడిపోయింది. అయితే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి ఎవరు అని గొడవ జరిగింది. ఎందుకంటే అంతకుముందు వరకు బిజేపీకి శివసేన చాలాకాలం మద్దతు ఇస్తూనే ఉంది. ఎప్పుడూ సిఎం కుర్చీని శివసేన అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే ఆశించలేదు. దీంతో ముఖ్యమంత్రిగా బిజేపీ అభ్యర్థి ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో మొదటిసారి శివసేన పార్టీ తరపునే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. దీంతో బిజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన సిఎం అభ్యర్థి ఉద్ధవ్ ఠాక్రే ((Eknath Shinde) మధ్య వైరం మొదలైంది. బిజేపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. హడావుడిగా మెజారిటీ లేకపోయినా ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ 80 గంటల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది.
ఆ వెంటనే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల కూటమి ఏర్పడింది. శరద్ పవార్ తెలివితో బిజేపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ 2022లో ఉద్ధవ్ ఠాక్రేకి నమ్మకస్తుడు, స్నేహితుడు ఏక్ నాథ్ షిండే బిజేపీ సాయంతో తిరుగుబాటు చేశారు. శివసేనలో తన సన్నిహితులైన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని బిజేపీతో జతకట్టారు. ఈ కారణంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా మెజారిటీ కోల్పోయింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఉద్ధవ్ ఠాక్రే తనను ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) ద్రోహం చేశాడని ఆరోపించారు. షిండే కారణంగానే శివసేన రెండుగా చీలిపోయిందని విమర్శలు చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి పదవి కోసమే షిండే చేశారని చెప్పారు.
ఇప్పుడు 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపీకి స్వయంగా 133 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్క్ 145 సీట్లు. అంటే బిజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కేవలం 12 సీట్లు చాలు. ఒకవేళ షిండే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కూటమి నుంచి వెళ్లిపోయినా.. ఫడ్నవీస్ కు అజిత్ పవార్ వద్ద 39 సీట్లు లభిస్తాయి. ఈ కారణంగానే ఇప్పడు ఏక్ నాథ్ షిండే రెండో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు లేవు. ఇది విశ్లేషించిన ఉద్ధవ్ ఠాక్రే తనతో షిండే ఎలా ప్రవర్తించారో అదే గతి ఆయనకు కూడా పట్టిందని మీడియా ముందు ఎద్దేవా చేశారు.