CM Fadnavis Eknath Shinde| రాజీకాయాల్లో రాత్రికి రాత్రి అన్ని మారిపోతాయి. అయిదు నెలలంటే చాలా ఎక్కువ సమయం. దీనికి ఉదాహరణ మహారాష్ట్ర బిజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్. లోక్ సభ ఎన్నికల్లో బిజేపీకి మహారాష్ట్రలో తక్కువ సీట్లు రావడంతో ఆయన బాధ్యత వహిస్తూ.. జూన్ 2024లో పార్టీలో పదవి నుంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ 5 నెలల తిరిగే సరికి సీన్ మొత్తం మారిపోయింది.
నవంబర్ వచ్చేసరికి ఆయన బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి పెట్టారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహాయుతి కూటమిలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఆయనకు పోటీగా మహాయుతి కూటమిలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివసేన అధ్యక్షుడు ఏక్ నాథ్ షిండ్ ఉన్నారు. దీంతో ఎన్నికల్లో విజయం సాధించినా మహాయుతి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం పోటీ నెలకొంది. ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న కీలకంగా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. మొత్తం 288 సీట్లకు గాను మహాయుతి కూటమికే 220 సీట్లలో ముందంజలో ఉండగా… మరోవైపు మహా వికాస్ అఘాడీకి 57 స్థానాలు మాత్రమే దక్కే చాన్సు ఉంది.
Also Read: ఝార్ఖండ్‌లో బిజేపీని మట్టికరిపించిన హేమంత్ సొరేన్.. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు!
నాగ్ పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సునాయసం గెలిచే అవకాశం కనిపిస్తుండగా.. ఏక్ నాత్ షిండే కూడా కోప్రీ-పచ్‌పఖాడీ సీటుపై భారీ లీడ్ లో ఉన్నారు.
మహాయుతి కూటమికి భారీ విజయం దక్కే అవకాశం ఉండడంతో ప్రజల మదిలో ఇప్పుడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న మెదులుతోంది. బిజేపీకి అత్యధిక సీట్లు రావడంతో ఫడ్నవీస్‌కే పట్టం కడతారా? అనే విశ్లేషణ ముందుకువస్తోంది.
“ముఖ్యమంత్రి పదవికి ప్రధాన అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎదిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే అత్యుత్తమం” అని ఇండియా టుడే టివి కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అభిప్రాయ పడ్డారు. ఎన్నికల ముందు వరకు ఏక్ నాత్ షిండేని ముఖ్యమంత్రి చేయాలని కూటమిలో ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.
“దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికలకు గ్రౌండ్ లెవెల్ లో బాగా ప్రచారం చేశారు. రెబెల్ అభ్యర్థులను శాంతింపచేసి, వారిని తిరిగి పార్టీ వైపునకు తీసుకువచ్చారు. సీట్ల సర్దుబాటులో కూడా బిజేపీకి మంచి డీల్ కుదిర్చారు. రెండు నెలలపాటు ఊపిరి తీసుకోకుండా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా.. బిజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం కట్టబెట్టారు” అని జర్నలిస్ట్ అంకిత్ జైన్ రాశారు.
ఎన్నికలకు ముందు మహారాష్ట్ర సిఎం అభ్యర్థిపై అమిత్ షా మాట్లాడుతూ.. “మహాయుతి నాయకులు ఎన్నికల తరువాత చర్చించి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు” అని చెప్పారు. మరోవైపు షిండే శివసేన పార్టీ నాయకులు కూడా బిజేపీ నాయకుడు ముఖ్యమంత్రి అయితే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
ఎన్నికల్లో బిజేపీ మొత్తం 149 సీట్లలో పోటీ చేస్తే.. 124 స్థానల్లో లీడ్ లో ఉంది. అంటే 83 శాతం స్ట్రైక్ రేట్. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓటర్లను ఫడ్నవీస్ విజయవంతంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మాలెగావ్ సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతోనే ఎన్నికలు ఓడిపోయామని ప్రచారం చేశారు. అందుకే హిందువులందరూ ఒక్కటై ఓటు వేయాలని లేకపోతే బటేంగేతో కటేంగే (విడిపోతే నరికివేయబడతాం) అని హెచ్చరించారు. ఫలితంగా ధూలే అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూ ఓటర్లందరూ బిజేపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏక్ నాత్ షిండే ఈ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్రలో బలమైన మరాఠా నాయకుడిగా అవతరించారు. బాల్ ఠాక్రేకు రాజకీయాలలో తానే నిజమైన వారుసుడినని చెప్పుకుంటూ ఇప్పుడు నిరూపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో షిండే శివసేన మొత్తం 81 సీట్లలో పోటీ చేస్తే.. 55 సీట్లలో విజయం దిశగా వెళుతోంది. అంటే 81 శాతం స్ట్రైక్ రేట్. ఈ విజయానికి ముఖ్యకారణం ఏక్ నాత్ షిండే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో లాడ్లీ బహిన్ యోజన సంక్షేమ పథకం ప్రవేశపెట్టడమే. ఈ కారణంగానే మహిళా ఓటర్లు ఎక్కువగా షిండే శివసేనకు ఓటు వేశారని తెలుస్తోంది.
ఇంతకుముందు ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఉండగా.. శివసేన పార్టీని రెండుగా చీల్చి.. పార్టీని ఆక్రమించుకున్నారని ఆయనపై ఆరోపణలున్నా.. ప్రస్తుత ఫలితాలతో తాను ఒక బలమైన నాయకుడినని నిరూపించుకున్నారు.
ప్రస్తుతం ఏక్ నాత్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు తారుమారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.