Manipur President Rule Soldier Violence | మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఫిబ్రవరి 13, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. మణిపూర్‌లో కూకీ, మెయిటీ గిరిజన జాతుల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హింస నేపథ్యంలో శాంతిభద్రతలు దిగజారాయి. దీంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడింది.
రెండు జాతుల మధ్య రేగిన వైరం ఎంతటి హింసకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ విషయంలో మణిపూర్ రగులుతూనే ఉంది. ఈ హింసకు మూల కారణమైన కూకీ, మెయిటీ తెగల మధ్య వైరం ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి నిలిపేలా చేసింది. అయితే.. ఈ అల్లర్ల వెనుక బీరేన్ సింగ్ ఉన్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
దాదాపు రెండేళ్ల క్రితం హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ఠను దిగజార్చిన ఆ హింస ఇప్పటికీ పూర్తిగా ఆగిపోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయిటీలకు, కూకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండగానే కార్చిచ్చులా వ్యాపించాయి. అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా మృతుల సంఖ్య వేయికి పైగా ఉందనే ఆరోపణలూ ఉన్నాయి.
Also Read: ప్రైవేట్ విమానంలో బ్యాంకాక్ బయలుదేరిన మంత్రి కుమారుడు.. గాల్లోనే కిడ్నాప్?
ఇప్పటికీ 60,000 మంది బాధితులు తమ స్వస్థలాలకు వెళ్లలేక బిక్కుబిక్కుమంటూ సహాయ శిబిరాల్లో కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయిటీలు, కూకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలపై అత్యాచారాలు చేశారు. బహిరంగంగా రోడ్లపై స్త్రీలను వివస్త్రలను చేసిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పరిస్థితుల్లోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
తోటి సైనికులను కాల్చి చంపిన ఆర్మీ జవాన్
మణిపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాను ఘాతుకానికి పాల్పడ్డాడు. తోటి సైనికులపై ఉద్రేకంతో ఆ జవాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంప్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంఫెల్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. సంజయ్ కుమార్ అనే జవాను తన తోటి సైనికులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్, ఎస్‌ఐ స్పాట్‌లోనే చనిపోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని ఇంఫాల్‌లోని రిమ్స్‌కు తరలించారు. నిందితుడు 120వ బెటాలియన్‌కు చెందిన హవల్దార్ సంజయ్ కుమార్‌గా గుర్తించారు.