NHRC Chairperson Meet| భారతదేశ రాజకీయాల్లో బద్ధశత్రువులైన కాంగ్రెస్, బిజేపీ పార్టీల నాయకులు కీలక సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అమిత్ షా కూడా రావాల్సి ఉండగా ఆయన గైర్హజరయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission – NHRC) చైర్‌పర్సన్ నియామకం కోసం ఈ ప్రత్యేక మీటింగ్ జరిగింది
జాతీయ మానవ హక్కుల కమిషన్ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే, లోక్ సభ స్పీకర్, రాజ్య సభ చైర్మెన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ నియామకంతో పాటు, కమిషన్ సభ్యులను కూడా నియమిస్తుంది.
ALSO READ: సంక్షోభంలో విద్యారంగం.. దేశంలో 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. లక్ష విద్యార్థులు ఫెయిల్
అయితే కమిటీలోని ముగ్గురు సభ్యులు.. ప్రధాన మోడీ, రాహుల్, ఖర్గే మాత్రమే బుధవారం సమావేశమయ్యారు. జాతీయ మానవ హక్కువ కమిషన్ లో చైర్ పర్సన్ పదవి జూన్ 1, 2024 నుంచి ఖాళీగా ఉంది. అంతకుముందు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా చైరపర్సన్ గా ఉన్నారు. ఆయన జూన్ 2021 నుంచి జూన్ 2024 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ 8వ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 మానవ హక్కుల చట్టం సవరణ తరువాత ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి (ప్రధాన న్యాయమూర్తి కాకుండా) జాతీయ మానవ హక్కుల కమిషన్ చైరపర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సుప్రీం కోర్టు మాజీ జడ్డి అరుణ్ మిశ్రా. అయితే ఆయన చైర్ పర్సన్ పదవి చేపట్టే ముందు కూడా 7 నెలల వరకు ఈ పదవి ఖాళీగానే ఉంది. ఎందుకంటే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మాత్రమే అప్పటివరకు మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు. అయితే చట్టంలో సవరణ చేయడంతో అరుణ్ మిశ్రా నియమాకం జరిగింది.
అయితే ఫిబ్రవరి 2020లో అరుణ్ కుమార్ మిశ్రా చైర్ పర్సన్ పదవిలో ఉంటూనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఒక అంతర్జాతీయ జుడిషియరీ కాన్ఫెరెన్స్ లో ప్రశంసించారు. దీంతో ఆయన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవికాలం ముగిసిన తరువాత కమిషన్ తాత్కాలిక చైర్ పర్సన్ గా తెలంగాణ హై కోర్టు అడ్వకేట్ విజయ భారతి సయానీని నియామకాన్ని రాష్ట్రపతి జూన్ 1, 2024 ఆమోదించారు. విజయ భారతి సయానీ తెలంగాణ హై కోర్టులో మహిళా వేధింపులు, కట్నం వేధింపుల కేసులు వాదించేవారు. పేదవారి కేసులు ఉచితంగా వాదించారు. ఆమె డిసెంబర్ 2023 నుంచి జాతీయ మానవ హక్కువ కమిషన్ లో సభ్యురాలిగా ఉన్నారు.