Vegetable Vendor Death| రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద. కుటుంబంలో అతనొక్కడే సంపాదించేవాడు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులను పోషించేవాడు. అలాంటి వ్యక్తిని పని చేస్తూ అలసిపోయాడు. కాస్త విశ్రాంతి కోసం చెట్టు కింద కునుకతీయగా.. అప్పుడే అతడిని మృత్యువు కబళించింది. బాధ్యాతారాహిత్యంగా ఎవరో చేసిన పనికి ఆ పేదవాడు బలయ్యాడు. పారిశుధ్య కార్మికులు అతడిపై నాలా పూడిక వేశారు. దీంతో అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బరేలి జిల్లా బరాదరి ప్రాంతంలో ఒక కూరగాయల షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు సునీల్ కుమార్ ప్రజాపతి (45). అతనికి ఇంట్లో వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉండడంతో కాస్త విశ్రాంతి తీసుకుందామని షాపు సమీపంలో ఉన్న శ్మశానం ఎదురుగా ఉన్న ఒక చెట్టు కింద కాస్త సేదతీరేందుకు వెళ్లాడు. ఎండ బాగా ఉండడంతో ఆ చెట్టు కింద కూర్చొని ఉండగా అతనికి నిద్రపట్టేసింది. అప్పుడే అక్కడికి ఒక పారిశుధ్య కార్మికుడు ట్రాలీ నిండుగా నాలా పూడికతీతతో వచ్చాడు. ఆ ట్రాలీ నిండుగా ఉన్న చెత్త, నాలాపూడిక మొత్తం నిద్రపోతున్న సునీల్ కుమార్ పై వేశేశాడు. ఆ చెట్టు కింద నాలాపూడిక వేయమని మునిసిపల్ కాంట్రాక్టర్ నయీం శాస్త్రి వారికి నిర్దేశించడంతో అతను ఆ పనిచేశాడు.
అయితే నిద్రతో ఉన్న సునీల్ కుమార్ తనపై నాలా పూడిక పడడంతో ఊపిరి ఆడక కొట్టుమిట్టాడాడు. కానీ అది కూడా ఆ పారిశుధ్య కార్మికులు చూడలేదు. ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇది గమనించి ఈ విషయం అక్కడన్న అందిరికీ అప్రమత్తం చేశాడు. స్థానికులంతా చాలా శ్రమపడి సునీల్ ని ఆ చెత్తను తొలగించి బయటకు తీశారు. అయితే ఆశ్చర్యంగా సునీల్ మాత్రం చలనం లేకుండా పడి ఉన్నాడు. కాసేపు అతనిపై నీరు పోసి లేపాలిని ప్రయత్నించినా లేవలేదు. దీంతో అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతడు అప్పటికీ చనిపోయాడని ధృవీకరించారు. ఈ సమాచారం సునీల్ కుటుంబానికి తెలియజేశారు.
Also Read: మా ఆయన మహిళ వేషంలో అసభ్య వీడియోలు చేస్తాడు.. డాక్టర్ పరువు తీసిన భార్య..
సునీల్ కుమార్ తండ్రి గిరివార్ సింగ్ ప్రజాపతి తన కొడుకు మృతదేహాన్ని చూసి పట్టరాని దు:ఖంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునిసిపల్ వర్కర్ల నిర్లక్ష్యానికి తన కొడుకు చనిపోయాడని చెప్పాడు. పోలీసులు సునీల్ మరణం కేసుని నమోదు చేసుకొని మునిసిపల్ కాంట్రాక్టర్ నయీం శాస్త్రిని నిందితుడిగా తేల్చార. పోస్ట్ మార్టం నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ షాకింగ్ ఘటనపై స్థానిక మునిసిపల్ కమిషనర్ సంజీవ్ కుమార్ స్పందించారు. ఈ విషాద ఘటన జరగడానికి పారిశుధ్య కార్మికులు, మునిసిపల్ కాంట్రాక్టర్ కారణమని, వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రదేశంలో నాలా పూడిక వేయడానికి అనుమతి లేకున్నా.. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.