Heat waves: అసలైన వేసవికాలం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. రోజు రోజుకూ భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. విపరీతమైన ఎండలకుతోడు వడగాలులు తోడయ్యాయి. ఫలితంగా రాత్రి వేళ ఇంట్లో విపరీతమైన ఉక్కుపోత. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో వార్నింగ్ ఇచ్చింది. ఈనెల 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.
వాతావరణ శాఖ ఓ కబురు మోసుకొచ్చింది. ఎండాకాలంలో వేడి కబురు కాకుంటే.. చల్లని కబురు ఏముంటుంది. ఈనెల 30 వరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడ గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర, మధ్య భారతంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, విదర్భ. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్, ఇంకొన్ని ప్రాంతాలు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్‌లో వడగాలులు ప్రభావం ఉంటుందన్నది ఐఎండీ మాట. వడగాలులకు తోడు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని అసలు విషయం. ఈశాన్య(సెవెన్ సిస్టర్) రాష్ట్రాలు అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలియజేసింది.
మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి 30 మధ్య కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉందన్నది ఐఎండీ మాట.
ALSO READ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఎవరి బలమెంత?
రాజస్థాన్‌లో ఏప్రిల్ 25 నుంచి మరో ఐదురోజులు 30 వరకు వేడి గాలులు తప్పవని తేల్చింది.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఏప్రిల్ 25 నుంచి 29 వరకు వేడి గాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింద.
ఏప్రిల్ 24 నుంచి 25 వరకు బెంగాల్, ఒడిశా , బీహార్, తెలంగాణలో రాత్రి వేళ పరిస్థితులు వేడిగా ఉంటాయని తెలియజేసింది.
ఏప్రిల్ 24 నుంచి 26 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండనుంది.
ఢిల్లీలో ఏప్రిల్ 24 నుంచి 27 వరకు వేడి గాలులు వీస్తాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 నుండి 43 డిగ్రీలు చేరే అవకాశముందని అంచనా వేసింది.
రాంచీ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ చల్లటి కబురు చెప్పారు. కనీసం మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదన్నారు.ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. ఏప్రిల్ 27 నుండి చాలా ప్రాంతాల్లో వర్షం లేదా వడగళ్ల వాన పడే అవకాశం ఉందన్నారు.
ఒడిశాలోని సుందర్‌గఢ్, సంబల్‌పూర్, సోనేపూర్, బౌధ్, బోలాంగిర్, బర్‌గఢ్ జిల్లాల ప్రజలను హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది. కలహండి, నౌపాడ, డియోగఢ్, అంగుల్ జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ అయ్యింది.
ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం ఝార్సుగూడ దేశంలో మూడో వేడి ప్రదేశంగా నిలిచింది. మహారాష్ట్రలోని బ్రహ్మపురి 45.6 డిగ్రీలు కాగా, చంద్రపూర్ 45.5 తర్వాత స్థానంలో ఉన్నట్లు IMD వెల్లడించింది. ఓవరాల్‌గా పరిశీలిస్తే ఈశాన్య రాష్ట్రాలు తప్పితే దేశమంతా ఈనెల చివరి వరకు వేడిగాలులు తప్పవన్నది అసలు హెచ్చరిక.
ఇక తెలంగాణ విషయానికొద్దాం. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆదిలాబాద్, కుమురం భీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలను రెడ్ అలర్ట్ చేసింది. వడగాలుల కారణంగా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నది హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాట. పలు జిల్లాల్లో రాత్రి వేళ వేడిగా వాతావరణం ఉండనుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో వడ గాలుల ప్రభావం ఉందని తెలిపింది. 17 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాకపోతే రానున్న రెండు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీనివల్ల వాతావరణం కాస్త చల్లబడనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు వెళ్ళేటప్పుడు ప్రజలు ఎక్కువసేపు వేడికి గురి కాకుండా ఉండాలన్నారు. తడి గుడ్డ, టోపీ, గొడుగు తీసుకుని వెళ్లాలని సూచించింది.