Delimitation : దేశంలో త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించనున్నారు. దేశంలో పెరిగిపోతున్న జనాభా, అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశ్యంతో చేపట్టే.. ఈ చట్టపరమైన కార్యక్రమంపై ఉత్తరాధి రాష్ట్రాలు కిమ్మనకుండా ఉన్నాయి. కానీ.. దక్షిణాధి రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీలతో పాటుగా, దక్షిణాధి పార్టీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి, ఎందుకు దక్షిణాధి రాష్ట్రాలు మాత్రమే ఆందోళనలకు గురవుతున్నాయి అనే విషయాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అలాగే.. డీలిమిటేషన్ అంటే ఏంటి. ఎందుకు చేపడతారు, రాజకీయ పార్టీల ఆందోళనలు ఏంటి అనే విషయాలు ప్రతీ ఒక్కరు తెలుసుకుని తీరాలి.
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
దేశంలో 10 ఏళ్లకు ఓసారి జనాభా లెక్కింపు చేపడుతుంటారు. ఈ లెక్కల ఆధారంగా.. డీలిమిటేషన్ చేపడుతుంటారు. అంటే.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు దేశ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉండాలనేది ఈ ప్రక్రియ ఉద్దేశం. అంటే.. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సరిహద్దుల విషయంలో అనేక మార్పు చేర్పులు ఉంటుంటాయి. ఈ తీరుగా.. కొన్ని నియోజకవర్గాలు.. చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుంటే.. మరికొన్ని నియోజకవర్గాలు.. రెండు, మూడుగా విడిపోతుంటాయి కూడా. వీటన్నింటికీ.. అక్కడ నివసిస్తున్న భారత్ పౌరుల సంఖ్య ప్రధానం.
వివాదానికి కారణమేంటి.?
దేశంలో పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు ఒక్కరు లేదంటే ఇద్దరు పిల్లల విధానాన్ని చాన్నాళ్లుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కేంద్రం సైతం ఈ విధానాన్ని బాగా ప్రచారం చేసింది, రాష్ట్రాలు జనభా నియంత్రిణ విధానాల్ని అనుసరించేందుకు ప్రోత్సహించింది. ఈ విషయంలో.. దక్షిణాధి రాష్ట్రాలు సమర్థవంతంగా చర్యలు తీసుకున్నాయి. ఉత్తరాధి రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాలు జనాభా నియంత్రణకు పాటుపడలేదు. దాంతో.. అక్కడ జనాభా పెద్ద సంఖ్యలో పెరిగిపోగా, దక్షిణాధిలో మాత్రం జనాభా బాగా తగ్గిపోయింది.
ఈ దశలో.. జనాభా ఆధారంగానే కొత్త పార్లమెంట్ స్థానాలు ఏర్పాటు చేయడం అంటే.. దక్షిణాధిలో చాలా స్థానాలు కలిసిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరాధిలో మాత్రం పెరిగిపోయిన జనాభా కారణంగా.. పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. దీంతో.. దక్షిణాధి రాష్ట్రాలకు దేశ చట్ట సభల్లో ప్రాతినిథ్యం తగ్గిపోతుందని, సమస్యలపై గళం విప్పేందుకు కానీ, హక్కుల్ని పోరాడి సాధించుకునేందుకు కానీ ఇబ్బందులు ఎదురవుతాయని దక్షిణాధి రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
డీలిమిటేషన్ పై భారత రాజ్యాంగం ఏం చెబుతోంది
పెరిగిపోయే జనాభా, ప్రాంతాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు అధికారం ఉంది. ఈ అంశంపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, ఆర్టికల్ 170లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
ఆర్టికల్ 82: భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద.. పదేళ్లకు ఓ సారి నిర్వహించే జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల మార్పులు చేపట్టవచ్చు. నియోజకవర్గ సరిహద్దుల్లో మార్పు చేర్పులు, అక్కడి జనాభా సంఖ్య ఆధారంగా తీసుకునే.. ప్రాంతాల కలయిక, విభజనను నిర్దేశిస్తుంది. ఇందుకోసం.. ఈ ఆర్టికల్ ఆధారంగా కేంద్రం డీలిమిటేషన్ చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంతకు ముందు..
ఆర్టికల్ 170: ఈ ఆర్టికల్ ద్వారా దేశ పార్లమెంట్ రాష్ట్రాల శాసన సభా నియోజకవర్గాల ను విభజించడం, కలపడం వంటివి చేస్తుంటుంది. జనాభా లెక్కల ఆధారంగా ఒక్కో రాష్ట్రంలోని సీట్ల సంఖ్యను పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
గతంలో ఎప్పుడంటే
1950లో మొదటి జనాభా గణన తర్వాత దేశంలో డీలిమిటేషన్ జరిగింది. భారత్ లో తొలిసారి నియోజకవర్గాలు ఆ సమయంలోనే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1952, 1963, 1973, 2002లో నాలుగు సార్లు డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇటీవలి కాలంలో, జాతీయ జనాభా గణన, డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
లోక్ సభ నియోజకవర్గాల్ని పునర్విభజించేందుకు కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ అనేది ఒక అత్యున్నత స్థాయి మండలిని సిఫార్సు చేస్తుంది. దీనిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజముద్ర ద్వారా అధికారికంగా నియమిస్తుంది. ఈ కమిషన్ ఎన్నికల నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయిస్తుంది. ఈ కమిషన్‌లో ప్రధానంగా భారత ఎన్నికల కమిషనర్, ఇతర సభ్యులు ఉంటారు, వీరికి విశేష అధికారాలు ఉంటాయి.
దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ ప్రభావం:
డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తలెత్తుతున్న ప్రధాన సమస్య జనాభా సంఖ్య, పార్లమెంటులో సీట్ల నష్టం. నివేదికల ప్రకారం, 2026 నాటికి జనాభా 1.42 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో సీట్ల పెంపు చాలా తక్కువ. దక్షిణ రాష్ట్ర సీట్లు తగ్గనుండగా, ఉత్తర రాష్ట్ర సీట్లు పెరుగుతాయి:
నిపుణుల అంచనాల ప్రకారం.. పెరిగిన జనాభా ప్రకారం
కర్ణాటక- 26 నుంచి 36 స్థానాలకు పెంపు
తెలంగాణ – 17 నుంచి 20 సీట్లకు పెంపు
ఆంధ్రప్రదేశ్ – 25 నుంచి 28 సీట్లకు పెంపు
తమిళనాడు – 39 నుంచి 41 సీట్లు
జనాభా తక్కువగా ఉన్నందున కేరళ.. ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాల నుంచి ఓ సీటును కోల్పోతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 స్థానాలు ఉండగా.. ఈ సంఖ్య 19 స్థానాలకు పడిపోవచ్చు.
ఇదిలా ఉంటే.. ఉత్తరాదిలోని రెండు రాష్ట్రాల పరిస్థితులు చూస్తే చాలు.. సమస్య తీవ్రత అర్థం అవుతుంది అంటున్నారు నిపుణులు. వీరి అంచనాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు 80 లోక్ సభ సీట్లు ఉంటే… అది పునర్విభజన తర్వాత 128కి పెరగే అవకాశాలున్నాయి. అలాగే.. బీహార్‌లో ప్రస్తుతం 40 సీట్లు ఉండగా, అది 70 సీట్లకు చేరుకుంటాయని అంటున్నారు.
Also Read : Delimitation MK Stalin: సొంత దేశంలోనే రాజకీయ అధికారాలు కోల్పోతాం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ప్రసంగం
ఈ సవివరమైన సమాచారంతో దక్షిణాది నేతలు దక్షిణ భారతదేశంలో సీట్ల తగ్గింపునకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తించారని, దక్షిణాదిలో ఒక్క సీటు కూడా తగ్గకుండా కేంద్రం చూస్తోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయమైన వాటా లభిస్తుందని కూడా ఆయన చెప్పారు. కానీ.. దక్షిణాధి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు మాత్రం.. ఇది కచ్చితంగా వివక్ష కిందకే వస్తుందని ఆరోపిస్తున్నారు. తమకు దేశ చట్టసభలో మాట్లాడే గొంతు లేకుండా చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.