Rekha Gupta: రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతాయో ఎవరికీ తెలీదు. ట్రెండ్ తగ్గట్టుగా వెళ్లకుంటే ఇబ్బందులు తప్పవు. నేతలైనా.. పార్టీ అయినా. కాకపోతే బీజేపీ మాత్రం ట్రెండ్ సెటర్ రాజకీయాలు చేస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికే ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తోంది. రాజకీయాల్లో ఇదొక కొత్త వరవడి అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అదే జరిగింది. ఢిల్లీలో కూడా అదే రిపీట్ అయ్యింది.
బీజేపీ కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అక్కడ అధికారం సాధించింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం ఇచ్చింది హైకమాండ్. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళ ముఖ్యమంత్రి లేరు. ఆ లోటును ఇప్పుడు తీర్చుకుంది. శాలీమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆమె.
హరియాణాకు చెందిన రేఖా గుప్తా, 1974 జులై 19న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం పూర్తి చేశారు. ఆ సమయంలో అంటే 1992 ఏడాది ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో అడుగు పెట్టేశారు. 1995-96లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శి, 1996-97లో అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్న ఆమె, కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను మ్యారేజ్ చేసుకున్నారు. 2007లో మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ALSO READ: పరిమితికి మించి టికట్లు ఎలా ఇస్తారు?
సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు, జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళ రేఖాగుప్తా.
విద్యార్థుల్లో రాజకీయాలపై ఆసక్తి కలిగేలా చేయాలంటే రేఖా గుప్తాకు ఛాన్స్ ఇవ్వాలనే భావించింది బీజేపీ హైకమాండ్. దీనివల్ల యువత రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి యువత వచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. ఈ నిర్ణయం యువతను ప్రొత్సహించేలా ఉంటాయన్నది అగ్రనేతల ఆలోచన. కష్టపడినవారికి, యువతను ప్రొత్సహించే రాజకీయ వేదికలు ఉన్నాయని భావించి అవకాశం ఇచ్చింది. రాజధానిలో మహిళలు 50 శాతం పైగానే ఉన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున హామీలు ఇచ్చింది బీజేపీ. వేగంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అయితే బెటరని భావించింది. బీజేపీ అధికారంలోవున్న రాష్ట్రాల్లో మహిళకు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వలేదు. సుష్మాస్వరాజ్ తర్వాత ఆ స్థాయి మహళ నేత బీజేపీలో ఎవరూ లేదు. అందుకే ఈమెని ప్రొత్సహించినట్టు చెబుతున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పడానికి రేఖాగుప్తానే ఒక ఉదాహరణ.
బీజేఎల్పీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె పేరు చెప్పలేదని ఢిల్లీ సమాచారం. ఎమ్మెల్యేల్లో ఏమాత్రం అసంతృప్తి రాకుండా జాగ్రత్తగా పావులు కదిపింది బీజేపీ అగ్రనాయకత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మహిళ సీఎం అయితే వేగంగా అమలవుతాయన్నది పార్టీ మాట.
రాజకీయంగా కేజ్రీవాల్ ఊహించని దెబ్బ. ఆయన అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆప్ రెండుసార్లు గెలుపొందడానికి వైశ్య కమ్యూనిటీ బాగా సహకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేఖాగుప్తాకు ఛాన్స్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల కేజ్రీవాల్‌ను రాజకీయంగా బలహీనపరచవచ్చని కొందరు నేతల మాట.
ఎన్నికల ఫలితాల నుంచి సీఎం రేసులో ఉన్న మొదటి వ్యక్తి పర్వేశ్‌వర్మ. జాట్ వర్గానికి చెందిన నేత. ఢిల్లీ ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఐదు రాష్ఠ్రాల్లో వీరి ప్రాబల్యం ఉంది. కాకపోతే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేఖాకు ఛాన్స్ ఇచ్చారు. అలాగని పర్వేశ్‌వర్మను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. ఆయనకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తారన్నది కొందరు కమలనాధుల మాట.