High Court Railway Station Stampede| కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల మధ్య గత శనివారం (ఫిబ్రవరి 17, 2025) తెల్లవారుజామున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో 18 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే శాఖ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధారిత ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని, ట్రైన్ టికెట్లను ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై వివరణ అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL)ని ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 19న విచారణ చేపట్టింది. విచారణ సమయంలో.. రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. ప్రత్యేకంగా.. రైల్వే కోచ్‌లో పరిమితికి మించి ప్రయాణికులను ఎందుకు అనుమతిస్తున్నారని, టికెట్లను ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా.. రైల్వే ప్రమాదాలను నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రైల్వే శాఖకు సూచనలు చేసింది. రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం.. ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టాన్ని ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులను అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు. ఈ నియమాలను కఠినంగా అమలు చేయాలని కోర్టు సూచించింది.
Also Read: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు గణపతి గాయత్ అనే ధర్మాసనం ఈ విషయంపై విచారణ చేస్తూ.. రద్దీ సమయాల్లో కొంత మేరకు పరిమితి మించినా, ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ అంశంపై నిర్లక్ష్యం చూపితే ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరిగే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది.
రైల్వే శాఖ తరపున ప్రముఖ న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలను వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. అదే సమయంలో.. రైల్వే శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం తమ వివరణలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో మరణించిన 18 మందిలో 14 మంది మహిళలుండడం గమనార్హం. మృతుల్లో ఎక్కువ మంది బీహార్ (9), ఢిల్లీ (8), హర్యాణా (1) ప్రాంతాలకు చెందినవారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాలకు 2.5 లక్షలు, స్వల్ప గాయాలకు 1 లక్ష రూపాయలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆలస్యంగా వచ్చిన రెండు రైళ్లు ఒకేసారి స్టేషన్ మీదకు రావడంతో ప్లాట్ ఫామ్ వద్ద భారీ రద్దీ ఏర్పడినప్పుడు ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు సీట్ల కోసం పోటీపడి, టికెట్లు లేకుండానే రైలు ఎక్కడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్లాట్‌ఫామ్‌లో భారీగా ప్రయాణికులు ఉన్నారు, పరిస్థితిని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు లేవు.