అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో విమానంలో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ విమానం ఆస్పత్రి హాస్టల్ బిల్డింగ్ పై కూలడంతో వైద్య విద్యార్థులు, సిబ్బంది సహా మరో 33 మంది మృత్యువాతపడ్డారు. అయితే రోజులు గడుస్తున్నా మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం సమస్యగా మారింది. ప్రమాదం జరిగింది ఐదు రోజులవుతున్నా.. పూర్తి స్థాయిలో మృతదేహాల గుర్తింపు జరగకపోవడం విచారకరం. ప్రమాదం అనంతరం విమానంలోని ఇంధనం ఒక్కసారిగా అంటుకుని భారీ పేలుడు జరిగింది. దీంతో మృతదేహాలన్నీ మాంసం ముద్దలుగా మారిపోయాయి. బంధువులు కూడా అయినవారి ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో డీఎన్ఏ పరీక్ష తప్పనిసరి అయింది. 72 గంటల్లోగా డీఎన్ఏ టెస్ట్ లు పూర్తి చేసి మృతదేహాలను అప్పగిస్తామంటూ మొదట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదంత సులువు కాదని తేలిపోయింది.
Summary Dispatch Report
Updates up to :- 16/06/2025, 10:25 p.m.
NO. OF DNA MATCH – 125
NO. OF RELATIVES CONTACTED- 124
NO. OF MORTAL RELEASED- 83
The pending mortal remains will be handed over soon.
— Rushikesh Patel (@irushikeshpatel) June 16, 2025
ఇవి 72 గంటల్లో పూర్తవుతాయని అధికార వర్గాలు తొలుత ప్రకటించినా అంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంటోంది. ఇప్పటి వరకు 125 మృతదేహాలను గుర్తించారు. బంధువులు ఇచ్చిన నమూనాలతో డెడ్ బాడీల డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు నిర్థారించారు. 83 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించారు. మిగతావారి విషయంలో అహ్మదాబాద్‌లో డీఎన్‌ఏ ల్యాబొరేటరీ 24 గంటలూ పనిచేస్తోంది. శరీర కణజాలం దెబ్బతినడం, మృతుల సంఖ్య కూాడ ఎక్కువగా ఉండటం వల్ల డీఎన్‌ఏ నివేదికలు ఆలస్యమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారత్ లో DNA నిర్థారణ ఎలా..?
DNA నిర్థారణ అనేది ప్రయోగశాలలోనే జరుగుతుంది. అయితే అహ్మదాబాద్ ప్రమాదంలో మృతుల పేర్లు, వారి ఐడెంటిటీ నిర్థారించిన తర్వాత మృతదేహాలను గుర్తించేందుకు DNA శాంపిల్స్ ఇవ్వాలని బంధువులను అధికారులు కోరారు. రక్తసంబంధీకుల నుంచి శాంపిల్స్ సేకరించడం కూడా ఆలస్యం అయింది. మిగతా సందర్భాల్లో DNA పరీక్షలు చేసే ప్రయోగశాలలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి.. అక్కడికి బంధువుల శాంపిల్స్ తెప్పించడం కష్టంతో కూడుకున్న పని. దీనికి కచ్చితంగా ఆలస్యం అవుతుంది.
పరిమిత సామర్థ్యం..
భారత్ లో DNA పరీక్షలు చేసే ల్యాబొరేటరీలు పరిమితంగా ఉన్నాయి. ఉన్నవి కూడా పరిమిత సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తాయి. ఒకేసారి ఎక్కువ నమూనాలు వస్తే విశ్లేషించడం అక్కడ ఉన్న సిబ్బందికి కష్టసాధ్యం. ప్రస్తుతం అహ్మదాబాద్ ప్రమాదం విషయంలో కూడా అదే జరిగింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ల్యాబొరేటరీని ఉపయోగిస్తున్నారు. ఇక్కడి సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నా.. ఇంకా పని పూర్తి కాలేదు.
సమయం..
వాస్తవానికి ఒక బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయంలో నిర్వహించే పితృత్వ పరీక్షలకు 2 నుంచి 4 వారాలు సమయం పట్టవచ్చు. ఆరోగ్య విషయాలపై జరిపే పరీక్షలు, పూర్వీకుల విశ్లేషణ వంటి సమగ్ర పరీక్షలకు 6 నుంచి 8 వారాలు సమయం పడుతుంది. ప్రస్తుతం అహ్మదాబాద్ లో రక్తసంబంధీకులతో వారి డీఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కనిపెడితే చాలు. దీనికి పెద్దగా సమయం పట్టకపోయినా.. ఎక్కువమంది డీఎన్ఏలు విశ్లేషించాల్సి రావడంతో ఒకే ల్యాబొరేటరీపై ఒత్తిడి పెరిగింది.
కచ్చితత్వం..
డీఎన్ఏ నమూనాల పోలిక కచ్చితత్వంతో ఉండాలి, లేకపోతే దానవల్ల జరిగే అనర్థాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే ఒకటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. డీఎన్ఏ నిర్థారించడానికి అవసరమైన మేర నమూనాలను సేకరించలేకపోయినా, నమూనా కలుషితం అయినట్టు గుర్తించినా పునఃపరీక్షకు సిద్ధమవుతారు. దీనివల్ల అది మరింత ఆలస్యమవుతుంది.
ఇతర సందర్భాల్లో డీఎన్ఏ పరీక్షలపై ప్రభుత్వ ఆంక్షలుంటాయి, అందుకే అవి ఆలస్యమవుతాయి. డీఎన్ఏ నిర్థారించే ప్రయోగశాలలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వంటి సంస్థల మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సహకారం అవసరమయ్యే పరీక్షల విషయంలో మరింత ఆలస్యం సహజంగానే జరుగుతుంది. విస్తృతమైన, అత్యాధునిక పరీక్షా సౌకర్యాలు లేకపోవడం వల్ల కూడా డీఎన్ఏ ఫలితాల ప్రకటన ఆలస్యం అవుతుంది.
ప్రస్తుతం అహ్మదాబాద్ ప్రమాదంలో మృతుల కుటుంబాలను గుర్తించి, వారికి డెడ్ బాడీలను అందించే విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. డీఎన్ఏ పరీక్షలు ఆలస్యం అవుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో రెండు రోజుల్లో ఈ పరీక్షలన్నీ ఓ కొలిక్కి రావొచ్చు. ఇప్పటి వరకు 125 మంది మృతదేహాలను డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. 83 డెడ్ బాడీలను బంధువులకు అప్పగించారు.