True Crime Movie on OTT : తల్లి కావాలనే కోరికతో ఓ మహిళ ఏకంగా 9 నెలల పాటు నకిలీ గర్భంతో జీవిస్తే ? చివరికి అందరి ముందు బిడ్డను చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమె చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మెక్సికోలో జరిగిన నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ (A Child of my own). ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆస్కార్ నామినేటెడ్ దర్శకురాలు మైటే అల్బెర్డి తెరకెక్కించిన ఈ చిత్రం సాధారణ ట్రూ క్రైమ్ కథలా కాకుండా, ఒక నేరం వెనుక ఉన్న మానసిక సంఘర్షణ, కుటుంబ ఒత్తిడి, సమాజం విధించే మాతృత్వపు అంచనాల గురించి కూడా ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
అలెజాండ్రాకు చిన్నప్పటి నుంచే తల్లి కావాలనే కోరిక ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు వరుసగా మూడు గర్భస్రావాలు జరుగుతాయి. ఈ విషయాన్ని కుటుంబానికి చెప్పడానికి కూడా ఆమె భయపడుతుంది. ముఖ్యంగా భర్త, అత్తమామల నుంచి వచ్చే ఒత్తిడి ఆమెపై మరింత పెరుగుతుంది. చివరికి తనకు బిడ్డ పుట్టబోతున్నట్లు అందరినీ నమ్మించాలనే నిర్ణయానికి వస్తుంది.
అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అలెజాండ్రా ఏకంగా తొమ్మిది నెలల పాటు గర్భవతిగా నటిస్తుంది. బరువు పెరగడానికి ఎక్కువగా తినడం, గర్భిణిలా కనిపించడం, బేబీ షవర్ నిర్వహించడం, వైద్య రికార్డులను మార్చడం వంటి పనులు చేస్తూ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ నమ్మిస్తుంది. బయటకు చూస్తే ఆమె గర్భం సాధారణంగానే కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఆమె చెప్పిన అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి రోజురోజుకూ మరింత పెద్ద సమస్యల్లో చిక్కుకుంటుంది.
అయితే తొమ్మిది నెలలు పూర్తయ్యే సమయానికి ఆమె ముందు అసలు సమస్య మొదలవుతుంది. తాను బిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబాన్ని ఎలా నమ్మించాలి ? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ అలెజాండ్రా తీసుకున్న నిర్ణయం చివరికి ఒక నవజాత శిశువు అపహరణకు దారితీస్తుంది. ఆమె పని చేసే ఆసుపత్రిలోనే జరిగిన ఈ ఘటన తర్వాత మొత్తం వ్యవహారం పోలీసుల దర్యాప్తులోకి వెళ్తుంది.
అయితే ఈ కథలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. బిడ్డ తల్లి మైరా, అలెజాండ్రా చెప్పే కథనాన్ని పూర్తిగా అంగీకరించదు. అసలు బిడ్డను ఆమెకు ఇవ్వడానికి ముందే ఒప్పందం జరిగిందా? లేక అది కిడ్నాపా అనే ప్రశ్న కూడా కథలో కీలకంగా మారుతుంది. ఈ విభిన్న వాదనల మధ్య అసలు నిజం ఏంటి ? అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.
Also Read : ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ
మైటే అల్బెర్డి ఈ కథను కేవలం నేరంగా కాకుండా, తల్లి కావాలనే కోరిక, సమాజం మహిళలపై పెట్టే అంచనాలు ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలవో ప్రశ్నించే విధంగా తెరకెక్కించారు. నిజ జీవిత ఇంటర్వ్యూలతో పాటు నటీనటులతో చేసిన డ్రామాటైజ్డ్ సన్నివేశాలను కలిపి చెప్పిన ఈ ప్రత్యేకమైన ట్రూ క్రైమ్ డాక్యుడ్రామా, చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. 2026లో విడుదలైన ఈ చిత్రం 1 గంట 36 నిమిషాల నిడివితో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అసలు అలెజాండ్రా ఎందుకు ఇలాంటి పని చేసింది ? ఆమె చెప్పేది నిజమా, లేక తన నేరాన్ని సమర్థించుకోవడానికి అల్లుకున్న మరో కథా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ను Netflixలో చూడవచ్చు. కానీ సినిమా తెలుగులో లేదు.