Action Thriller OTT : రియల్ సంఘటన ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు ఆదరణ పొందాయి కూడా. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం మామూలుగా ఉండదు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా, 1952లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా రూపొందింది. చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన రెస్క్యూ మిషన్లలో ఒకటిగా దీనిని చెప్పుకుంటారు. 1952లో పెండిల్టన్ నౌక మునిగిపోతున్నప్పుడు, కేవలం 12 మంది పట్టే చిన్న కోస్ట్ గార్డ్ బోటులో ఏకంగా 32 మందిని ఎక్కించుకుని ఒడ్డుకు తెచ్చారు. ఇది ప్రపంచ కోస్ట్ గార్డ్ చరిత్రలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌గా రికార్డు సృష్టించింది. ఈ మిషన్ పూర్తి చేసిన తర్వాత బెర్నీ వెబ్బర్ అతని టీమ్‌కు అమెరికా ప్రభుత్వం అత్యున్నతమైన గోల్డ్ లైఫ్ సేవింగ్ మెడల్ ఇచ్చి గౌరవించింది.
అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ది ఫైనెస్ట్ అవర్స్’ (The Finest Hours). క్రెయిగ్ గిలెస్పీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్ పైన్, కాసే అఫ్లెక్, బెన్ ఫోస్టర్, ఎరిక్ బనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జియో హాట్‌స్టార్ (jio Hotstar) లో అందుబాటులో ఉంది.
ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా, నటుల మీద నిజంగానే వేల లీటర్ల చల్లటి నీటిని కుమ్మరించారు. రియలిస్టిక్ గా ఉండటం కోసం అలా చేసినా, ఆ చలిలో తడిచిన బట్టలతో షూటింగ్ చేయడం వల్ల నటులు చాలా ఇబ్బంది పడ్డారట. నటుడు క్రిస్ పైన్ ఆ కష్టాన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.
1952లో సముద్రం మీద ఒక రేంజ్ లో తుఫాను వచ్చి పడుతుంటుంది. ఆ రాకాసి అలల ధాటికి SS పెండిల్టన్ అనే పెద్ద ఆయిల్ షిప్ తట్టుకోలేక నడి సముద్రంలో నిలువునా రెండు ముక్కలైపోతుంది. సగం మునిగిపోయిన ఆ ఓడ ముక్కలో 30 మందికి పైగా పనివాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. ఇంకో రెండు మూడు గంటల్లో ఆ ముక్క కూడా మునిగిపోతుందని వాళ్లకి అర్థమవుతుంది. బయట చూస్తే భయంకరమైన గాలివానకు వీళ్ళంతా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు.
సరిగ్గా అప్పుడే కోస్ట్ గార్డ్ ఆఫీసర్ బెర్నీ వెబ్బర్ తన ముగ్గురు కుర్రాళ్లను తీసుకుని, ఒక చిన్న మోటార్ బోటులో వాళ్లను కాపాడటానికి బయలుదేరుతాడు. అసలు ఆ తుఫానులో అంత చిన్న బోటు వేసుకుని వెళ్లడమే ఆత్మహత్య అని అందరూ అంటారు. దారిలో మనుషుల ఎత్తులో వచ్చే అలలను దాటుకుంటూ, కనీసం దారి కూడా సరిగ్గా కనిపించని పరిస్థితుల్లో చావుతో పోరాడుతూ ఆ షిప్ ఉన్న చోటికి చేరుకుంటారు. అక్కడ సీన్ చూస్తే భయంకరంగా ఉంటుంది. 12 మంది పట్టే బోటులోకి ఆ 30 మందిని ఎలాగోలా ఎక్కించుకుని, మళ్లీ అదే తుఫానులో ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేరుకుంటారు. ఇది సినిమా కాదు బాబోయ్, నిజంగా జరిగిన సంఘటన. చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ మిషన్లలో ఇది ఒకటిగా మిగిలిపోయింది.
Read Also : మసాజ్ చేస్తూ మర్డర్లు చేసే సైకో కిల్లర్… ఉత్కంఠ రేపుతున్న పాకిస్తానీ మూవీ… ఐయండిబిలో 9.4 రేటింగ్