OTT Movie : ప్రముఖుల జీవితాలతో చాలా సినిమాలు వచ్చాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ స్టోరీ అమర్ సింగ్ చమ్కీలా అనే గాయకుడి చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తి నుండి ప్రముఖ గాయకుడిగా ఎలా ఎదిగాడో ఇందులో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ? వివరాల్లోకి వెళితే …
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో
ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘అమర్ సింగ్ చమ్కీలా’ (Amar Singh Chamkila). 2024 లో విడుదలైన ఈ మూవీకి ఇమ్తియాజ్ అలీ దర్శకత్వం వహించి, నిర్మించారు. ప్రఖ్యాత పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో దిల్జీత్ దోసాంఝ్ చమ్కీలా పాత్రలో, పరిణీతి చోప్రా అతని రెండవ భార్య అమర్జోత్ కౌర్ పాత్రలో నటించారు.ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, ఇర్షాద్ కమిల్ సాహిత్యం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
1988లో అమర్ సింగ్ చమ్కీలా, అమర్జోత్ హత్యలతో ఈ మూవీ స్టోరీ ప్రారంభమవుతుంది. వారు పంజాబ్‌లోని మెహసంపూర్‌లో ఒక ప్రదర్శన కోసం చేరుకుంటారు. ముసుగు ధరించిన వ్యక్తులు చమ్కీలాతో పాటు మరో వ్యక్తిని కూడా కాల్చి చంపుతారు. ఈ హత్య ఎవరు చేశారనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. అక్కడ నుండి కథ ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తుంది. పంజాబ్‌లోని లూధియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో ఒక దళిత సిక్కు కుటుంబంలో అమర్ సింగ్ చమ్కీలా పుడతాడు. చిన్నతనంలో విద్యుత్ కార్మికుడు కావాలని అనుకున్నప్పటికీ, అతను ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అయితే సంగీతం పట్ల అతనికి ఎక్కువ ఆసక్తి ఉండేది. అతను హార్మోనియం, ఢోల్కీ వాయించడం కూడా నేర్చుకుంటాడు. అతను ఒక రోజు ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురిందర్ షిండాను కలుసుకుని, అతని దగ్గర శిష్యుడిగా చెరిపోతాడు. ఆ తరువాత షిండా కోసం అనేక పాటలు రాసిన చమ్కీలా, ఒక రోజు షిండా ఒక ప్రదర్శనకు ఆలస్యంగా వస్తాడు. అప్పుడు అతని స్థానంలో పాడే అవకాశం చమ్కీలాకి వస్తుంది. అతని ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అప్పుటి నుంచి అతని దశ తిరిగిపోతుంది.
ఆ తరువాత, చమ్కీలా వెళ్లి, అమర్జోత్ కౌర్‌తో జతకడతాడు. వారిద్దరూ కలిసి సామాజిక, భక్తి తో కూడిన పాటలను పాడుతారు. ఈ పాటలు 1980లలో భారీ హిట్‌లుగా నిలిచాయి. అయితే, అతని సాహిత్యం తరచూ అశ్లీలంగా వచ్చేది. ఇది అతనికి విమర్శలను తెచ్చిపెట్టింది. అతని పాటలు పంజాబీ గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, మద్యపానం, డ్రగ్స్, వివాహేతర సంబంధాలు వంటి విషయాలను గుర్తుకు చేస్తాయి. చమ్కీలా అతని కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు, 1988 లో అతను అమర్జోత్ మెహసంపూర్‌లో ఒక ప్రదర్శన కోసం వెళతాడు. అప్పుడే అతన్ని గుర్తు తెలియమని వ్యక్తులు కాల్చి చంపేస్తారు. ఈ హత్య వెనుక ఉన్న కారణాలు, దోషులు ఎవరనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. కొందరు ఖలిస్తానీ తీవ్రవాదులని, మరికొందరు అతని పోటీదారులే ఈ పని చేసిఉంటారని అనుకున్నారు.