Animated Adventure: ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను ఎంతగానో అలరిస్తున్న యానిమేషన్ ఫ్రాంచైజీ ‘పా పెట్రోల్’ (PAW Patrol) నుంచి మరో సరికొత్త సాహస చిత్రం వచ్చేసింది. అదే ‘PAW Patrol: The Dino Movie’. రైడర్ నాయకత్వంలోని క్యూట్ పప్పీ గ్యాంగ్ ఈసారి ఏకంగా డైనోసార్లు ఉండే ఓ రహస్యమైన దీవిలో అడుగుపెడుతుంది. అక్కడ భారీ అగ్నిపర్వతం బద్దలయ్యే ప్రమాదం ఎదురైతే.. అమాయక డైనోసార్లను, దీవిని కాపాడేందుకు ఈ చిన్నారుల హీరోలు ఎలాంటి సాహసం చేశారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ యానిమేషన్ అడ్వెంచర్ నవంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించిన ఈ యానిమేషన్ అడ్వెంచర్ ఏ ఓటీటీలోకి వచ్చింది ? కథేంటో తెలుసుకుందాం పదండి.
రైడర్, అతని పప్పీ టీమ్ ఓ సముద్ర ప్రయాణంలో ఉండగా అనుకోకుండా భయంకరమైన తుఫానులో చిక్కుకుంటారు. దీంతో వారి నౌక దారి తప్పి, డైనోసార్లు నివసించే ఓ రహస్యమైన ఉష్ణమండల దీవిలో కూలిపోతుంది. అక్కడ వారికి రెక్స్ అనే కొత్త పప్పీ పరిచయమవుతాడు. కొన్నేళ్లుగా ఆ దీవిలోనే ఉంటున్న రెక్స్‌కు డైనోసార్ల గురించి ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. అంతేకాదు, అక్కడి పరిస్థితులు, ప్రమాదాల గురించి కూడా అతనికి బాగా తెలుసు. ఈ క్రమంలో టీమ్‌కు రబార్బ్ అనే చిన్న టైరన్నోసారస్ రెక్స్ పిల్ల కూడా పరిచయమవుతుంది.
అయితే ఆ దీవిలో మరో ప్రమాదం పొంచి ఉంటుంది. పా పెట్రోల్‌కు పాత శత్రువైన మేయర్ హమ్‌డింగర్ అక్కడి సహజ వనరులను దోచుకోవాలనే అత్యాశతో అక్రమ మైనింగ్ పనులు మొదలుపెడతాడు. అతని చర్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న భారీ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో దీవిలోని డైనోసార్ల ప్రాణాలకు ముప్పు ఎదురవుతుంది. లావా ప్రవాహం నుంచి అందరినీ కాపాడేందుకు రైడర్, రెక్స్‌తో కలిసి భీభత్సమైన రెస్క్యూ ఆపరేషన్‌కు పప్పీ టీమ్ సిద్ధమవుతుంది.
మరి అగ్నిపర్వతం నుంచి దూసుకొచ్చే లావాను ఎలా అడ్డుకున్నారు? డైనోసార్లను సురక్షితంగా ఎలా కాపాడారు? హమ్‌డింగర్ పన్నిన పథకాన్ని భీమ్ గ్యాంగ్ తరహాలో ఈ పప్పీలు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ. భారీ డైనోసార్లు, రంగురంగుల యానిమేషన్ విజువల్స్, ఉత్కంఠభరితమైన రెస్క్యూ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పిల్లలతో కలిసి ఫ్యామిలీగా చూడటానికి మంచి యానిమేషన్ అడ్వెంచర్ మూవీ ఇది.
‘PAW Patrol: The Dino Movie’ కాల్ బ్రంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. కార్టర్ యంగ్, మెకెన్నా గ్రేస్, టెర్రీ క్రూస్, జెన్నిఫర్ హడ్సన్, రాన్ పార్డో తదితరులు వాయిస్ ఓవర్లు అందించారు. సుమారు 88 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 12 నుంచి Paramount+లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ప్రైమ్ వీడియో (Prime Video) ఆపిల్ టీవీ (Apple TV) లలో కూడా ఈ ఇంగ్లీష్ మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది.