Animated Adventure Series: జూలో ఉండాల్సిన నాలుగు చిన్న జంతువులకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. దాంతో మొదలయ్యే రహస్య సాహసాలు. సెంట్రల్ పార్క్ జూలో పెరుగుతున్న అలెక్స్, మార్టీ, మెల్‌మన్, గ్లోరియా కలిసి చేసే అల్లరి, స్నేహం, సాహసాలే ‘మడగాస్కర్: ఎ లిటిల్ వైల్డ్’ (Madagascar: A Little Wild) కథ. ‘మడగాస్కర్’ ఫ్రాంచైజ్‌లోని ఈ యానిమేటెడ్ సిరీస్ లో మనకు పరిచయమైన పాత్రలనే ఇందులో చిన్న వయసులో చూపిస్తారు. ఇప్పుడు ఓటీటీలోనే ఈ ఫన్నీ యానిమేషన్ సిరీస్ ను చూడొచ్చు. మరి స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
అలెక్స్, మార్టీ, మెల్‌మన్, గ్లోరియా చిన్న వయసులో సెంట్రల్ పార్క్ జూలోని ఓ రెస్క్యూ హ్యాబిటాట్ లో ఉంటారు. జూ వాళ్లకు సురక్షితమైన ప్రపంచం. ఆహారం సమయానికి వస్తుంది. చూసుకునే వాళ్లు ఉంటారు. కానీ బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం వాళ్లలో ఎప్పుడూ ఉంటుంది. అలెక్స్ కు పెద్దగా స్టార్ అవ్వాలనే కల ఉంటుంది. మార్టీకి కొత్త విషయాలు తెలుసుకోవడం, సాహసాలు చేయడం అంటే ఇష్టం. మెల్‌మన్ కు చిన్న విషయాల్లో కూడా భయం ఎక్కువ. గ్లోరియా మాత్రం తనకు నచ్చిన పని చేయడంలో చాలా ఉత్సాహంగా ఉంటుంది.
వీళ్ల నలుగురి స్వభావాలు వేరైనా స్నేహం మాత్రం చాలా బలంగా ఉంటుంది. జూలోని హద్దులు దాటి బయట ప్రపంచంలోకి వెళ్లడానికి వీళ్లకు ఓ రహస్య మార్గం కూడా దొరుకుతుంది. పికిల్స్, డేవ్ అనే చింపాంజీల దగ్గర ఉండే రహస్య టన్నెల్ ద్వారా న్యూయార్క్ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం వస్తుంది. దీంతో ఒక్కోసారి వాళ్లు మనుషుల కళ్లకు కనిపించకుండా నగరంలో తిరుగుతూ కొత్త సాహసాలు చేస్తారు. వాళ్లు చేసే ప్రతి ప్రయత్నం సరదాగా మొదలై చివరికి ఓ సమస్యను తెస్తుంది.
ఓసారి ఓ పిల్లాడి టెడ్డీ బేర్‌ను తిరిగి ఇవ్వడానికి నగరంలోకి వెళ్లడం, మరోసారి షోల్లో తమ ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నించడం, ఇంకోసారి తమ స్నేహితుల కోసం అనుకోని సాహసాలకు వెళ్లడం ఇలా ఒక్కో ఎపిసోడ్ కు ఓ ప్రత్యేకమైన కథ ఉంటుంది. ప్రయాణంలో వాళ్లు స్వేచ్ఛ అంటే కేవలం జూ నుంచి బయటకు రావడం కాదని, స్నేహితుల కోసం నిలబడటం, తప్పుల నుంచి నేర్చుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమేనని తెలుసుకుంటారు. చిన్న పిల్లలకు సరదాగా అనిపించే సన్నివేశాల మధ్య పెద్దలకు కూడా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది.
జూ గేట్లు దాటిన తర్వాత ఈ నలుగురు ఎలాంటి సమస్యల్లో పడతారు ? బయట ప్రపంచంలో వాళ్లకు ఎదురయ్యే పెద్ద సవాలు ఏంటి ? స్వేచ్ఛ కోసం చేసిన సాహసాలు చివరికి వాళ్ల స్నేహాన్ని మరింత బలపరుస్తాయా ? ప్రతి సారి ప్రమాదంలో పడినప్పుడు ఈ నలుగురూ ఎలా బయటపడతారు ? వాళ్ల చిన్న చిన్న కలలు చివరికి నెరవేరుతాయా ? అనేది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
‘మడగాస్కర్: ఎ లిటిల్ వైల్డ్’లో అలెక్స్, మార్టీ, మెల్‌మన్, గ్లోరియా చిన్న వయసులో కనిపిస్తారు. మెయిన్ రోల్స్ కి టక్కర్ చాండ్లర్, అమీర్ ఓ’నీల్, షైలిన్ బెక్టన్, ల్యూక్ లో తదితరులు వాయిస్ ఇచ్చారు. ఈ యానిమేటెడ్ కామెడీ అడ్వెంచర్ సిరీస్ జీ5లో ఇంగ్షీషులో అందుబాటులో ఉంది.
Read Also: డేటింగ్ యాప్ ఫౌండర్ కు డేరింగ్ ఛాలెంజ్… ఓటీటీలోకి తెలుగులో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ సిరీస్