Romantic Web Series: ఇద్దరు డేటింగ్ యాప్ ఫౌండర్లు… ఒకరు ప్రేమలో కెమిస్ట్రీనే ముఖ్యమని నమ్ముతారు. మరొకరు మాత్రం ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఉంటేనే సంబంధం నిలబడుతుందని అంటారు. తమ సిద్ధాంతమే నిజమని నిరూపించుకోవడానికి ఇద్దరూ ఏకంగా 60 రోజుల ఛాలెంజ్ కు దిగితే ? ప్రేమను అల్గారిథమ్ తో కొలవగలమా ? లేక నిజమైన కెమిస్ట్రీ ఏ యాప్‌కీ చిక్కదా ? ఈ ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ రొమాంటిక్ సిరీస్ ‘లవ్’ (Love). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఏకంగా 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
తారా (Aishwarya Lekshmi) ఓ డేటింగ్ యాప్ ను నడుపుతుంటుంది. ప్రేమ పట్ల ఆమె నమ్మకం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇద్దరి మధ్య సరైన కంపాటిబిలిటీ ఉంటేనే ఆ సంబంధం సక్సెస్ అవుతుందని ఆమె భావిస్తుంది. మరోవైపు మ్యాథ్యూ పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తాడు. అతడి దృష్టిలో ప్రేమను లెక్కలతో, ప్రశ్నలతో లేదా అల్గారిథమ్ తో పూర్తిగా అర్థం చేసుకోలేం. కెమిస్ట్రీనే అసలు విషయం అని అతడు నమ్ముతాడు. ఇలా ఇద్దరూ తమ తమ డేటింగ్ యాప్ లతో పోటీ పడుతుంటారు.
తారా నడిపే FOUND యాప్‌కు, మ్యాథ్యూ అనుబంధంగా ఉన్న Find My Bae యాప్ కు మధ్య పోటీ కూడా పెరుగుతుంది. వ్యాపార పోటీగా మొదలైన ఈ వ్యవహారం వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడుతుంది. తారా తన కంపెనీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మ్యాథ్యూ ఓ డేరింగ్ ఛాలెంజ్‌ను తీసుకొస్తాడు. ఈ ఛాలెంజ్ ప్రకారం ఇద్దరూ ఒకరి డేటింగ్ యాప్ ను మరొకరు ఉపయోగించి డేట్స్ కు వెళ్లాలి. తమ సిద్ధాంతం నిజమని నిరూపించుకోవడానికి మొదలైన ఈ ప్రయోగం క్రమంగా వాళ్ల వ్యక్తిగత జీవితాలను మార్చడం మొదలు పెడుతుంది. మొదట ఒకరినొకరు ప్రత్యర్థులుగా చూసుకున్న వీళ్లిద్దరి మధ్య క్రమంగా అనుకోని సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
కానీ సమస్య ఇక్కడే మొదలవుతుంది. వ్యాపారంలో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నిజంగానే ఒకరిపై ఒకరు ఆకర్షితులైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? తారా, మ్యాథ్యూ పెట్టుకున్న ఈ ఛాలెంజ్ చివరికి ఎవరి సిద్ధాంతాన్ని మార్చబోతోంది ? ప్రేమను నిజంగా అల్గారిథమ్‌తో అంచనా వేయగలమా ? లేక వాళ్లిద్దరికీ తమ సొంత యాప్‌లు కూడా ఊహించని ప్రేమ ఎదురవుతుందా ? వ్యాపార పోటీ ప్రేమకు అడ్డుగా నిలుస్తుందా ? 60 రోజుల తర్వాత వాళ్లిద్దరి మధ్య మిగిలేది గెలుపా… ప్రేమా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఐశ్వర్య లక్ష్మి, అర్జున్ దాస్, అర్జున్ చిదంబరం తదితరులు నటించిన ‘లవ్’ సిరీస్ కు బాలాజీ మోహన్ (Balaji Mohan) దర్శకత్వం వహించారు. సౌందర్య రజినీకాంత్ (Soundarya Rajinikanth) ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ తమిళ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
Read Also: అన్నదమ్ములిద్దరికీ ఒకే అమ్మాయి… ఫ్యామిలీలో చిచ్చురేపే రచ్చ… ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనే