Arabic Comedy Drama: ఇంట్లో చిల్లిగవ్వ లేకపోయినా బయట మాత్రం కోట్ల ఆస్తులు ఉన్నట్టు బిల్డప్ ఇస్తే… ఏదో ఒకరోజు అసలు నిజం బయట పడాల్సిందే. తాము చాలా ధనవంతులమని నమ్ముతూ, నమ్మిస్తూ జీవిస్తున్న ఓ కుటుంబానికి… ఒక్కసారిగా తమ ఆర్థిక పరిస్థితి అనుకున్నంత గొప్పది కాదని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? పరువు కాపాడుకోవడానికి మొదలు పెట్టిన అబద్ధాలు మరింత పెద్ద గందరగోళానికి దారి తీస్తే… ఇదే కథతో రూపొందిన అరబిక్ మూవీ ‘క్రేజీ రిచ్, ఇన్‌క్రెడిబ్లీ బ్రోక్’ (Crazy Rich, Incredibly Broke). మరి ఈ కామెడీ కథ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిందో తెలుసుకుందాం.
అల్ థహాబీ కుటుంబం బయట ప్రపంచానికి చాలా సంపన్న కుటుంబంగా కనిపిస్తుంది. ఖరీదైన జీవితం, డబ్బున్న కుటుంబం అన్న ఇమేజ్ తో వాళ్లు తమ చుట్టూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా తమ స్థాయి గురించి చాలా గొప్పగా భావిస్తుంటారు. కానీ ఓ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి సంబంధించిన నిజం బయట పడుతుంది. దీంతో తాము అనుకున్నంత ధనవంతులు కాదని, తమ దగ్గర ఉన్న సంపద గురించి కుటుంబమే తప్పుగా అర్థం చేసుకుందని తెలుస్తుంది.
ఇక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. నిజం బయటికి వస్తే తమ పరువు పోతుందని భయపడే కుటుంబ సభ్యులు పరిస్థితిని దాచి పెట్టాలని నిర్ణయించుకుంటారు. డబ్బు లేకపోయినా డబ్బున్నట్టే కనిపించాలి. సాధారణ జీవితం గడపాల్సి వచ్చినా బయట మాత్రం విలాసవంతమైన జీవితాన్ని చూపించాలి. దీంతో ఒక్కో సందర్భంలో ఒక్కో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అలా మొదలైన నటన క్రమంగా కుటుంబం మొత్తాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒక సందర్భాన్ని కప్పిపుచ్చడానికి చెప్పిన అబద్ధం మరో కొత్త సమస్యకు దారి తీస్తుంది.
బంధువులు, పరిచయస్తుల ముందు తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కామెడీకి కారణమవుతాయి. అయితే సినిమా కేవలం డబ్బు, పరువు చుట్టూ తిరిగే కామెడీ మాత్రమే కాదు. కుటుంబం అంటే కేవలం సంపదతో నిర్ణయించేది కాదనే అంశాన్ని కూడా కథ స్పృశిస్తుంది. ఆర్థిక పరిస్థితి మారిపోయినప్పుడు, డబ్బు కష్టాలు ఎదురైనప్పుడు ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరినొకరు ఎలా చూసుకుంటారు ? బయట ప్రపంచం ముందు ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి కోసం ఎంత దూరం వెళ్తారు ? అనేది ఇందులో హాస్యభరితంగా చూపించారు.
ఈ అరబిక్ సినిమాలో రషెద్ అల్ షమ్రానీ, ఇదా అల్‌కుసయ్, అద్వా బదర్ తదితరులు నటించారు. ‘క్రేజీ రిచ్, ఇన్‌క్రెడిబ్లీ బ్రోక్’ సౌదీ అరేబియా నేపథ్యంలోని కామెడీ డ్రామా. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అరబిక్, ఇంగ్లీష్ కేటగిరీలో అందుబాటులో ఉంది. కానీ తెలుగు ఆడియో లేదు.
Read Also: క్రిప్టోతో కోటీశ్వరుడు
అవ్వాలనుకుంటే ఊహించని చిక్కులు… దిమాక్ కరాబ్ ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్ తెలుగులోనే