Horror Mystery Thriller: ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను తెగ భయపెడుతూ, క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘శ్వేత్ కాళి’ సీజన్ 2 (Shwetkaali Season 2 ). బెంగాలీలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ సస్పెన్స్ డ్రామా డిజిటల్ వరల్డ్‌లో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. సాధారణంగా దేవుళ్లు, భయానక శాపాలు, పగటి పూట కూడా ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్ కూడా సరిగ్గా అదే జోనర్ లో వ్యూవర్స్ ను స్క్రీన్ కు అతుక్కుపోయేలా చేస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ అనేది తెలుసుకుందాం పదండి.
సీజన్ 2లో ఊర్వి ఓ గర్భిణీ డాక్టర్‌గా మేఘ్-ఝురి గ్రామానికి వస్తుంది. అక్కడ తారను గుహ కాళీ దేవతగా భావిస్తారు. ఆమె ప్రవర్తనలో కనిపించే వింత మార్పులతో గ్రామం భయంలో మునిగిపోతుంది. అహానా పాముకాటుతో చనిపోవడంతో గుహ కాళీ శాపం మళ్లీ తెరపైకి వస్తుంది. ఈ మరణం వెనుక నిజంగా దైవశక్తి ఉందా, లేక ఎవరో కావాలనే ఈ భయాన్ని ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు మొదలవుతాయి. ఊర్వి, హిమాల్ కలిసి ఈ రహస్యాన్ని పరిశోధిస్తుండగా, బనలతకు సంబంధించిన కీలకమైన నిజాలు బయటపడతాయి. మరోవైపు వరుస మరణాలు ఆగకపోవడంతో ఊరిలో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయి. హిమాల్, ఝిల్మిల్ మరణాలు ఈ మిస్టరీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి.
తార మానసిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఊర్వి ప్రయత్నిస్తుంది. కానీ తారే ఊర్విని ఇబ్బందుల్లోకి నెట్టడంతో ఆమెకు ప్రమాదాలు పెరుగుతాయి. ఇదే సమయంలో ఊర్వి వ్యక్తిగత జీవితంలోనూ ఆందోళన కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. చివరికి బిర్సాను బలి ఇవ్వకుండా ఊర్వి కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న శాపం, మోయినాకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటుంది. దీంతో ఈ మరణాలన్నీ నిజంగానే శాపం వల్ల జరుగుతున్నాయా, లేక పాత నేరాన్ని దాచి పెట్టేందుకు ఎవరో ఆడుతున్న ఆటనా అనే అనుమానం పెరుగుతుంది. ఒక వైపు అంతుచిక్కని దైవశక్తులు, మరోవైపు ఊహించని వింత పరిణామాలు, వరుస పాముకాట్లతో ఒక మారుమూల గ్రామంలో జరుగుతున్న మరణాలు కథను ఊహించని మలుపు తిప్పుతాయి.
ఊరిలో కొలువైన ఒక దేవతకు సంబంధించిన ప్రాచీన శాపం కారణంగానే ఈ అంతుచిక్కని చావులు సంభవిస్తున్నాయని గ్రామస్థులు గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి రహస్యాలు ఆ గ్రామం వెనుక దాగి ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రహస్యాల వెనుక ఉన్న నిజాలు ఏంటి ? వరుస హత్యలు లేదా ప్రాణాంతక కాట్లు ఎవరి ప్లాన్ ? ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన ప్రధాన పాత్ర ఊర్వి ఎదుర్కొన్న భయానక నిజాలు ఏమిటి ? ఆమె ఆ ఊరి శాపాన్ని ఛేదించగలిగిందా లేదా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్.
‘శ్వేత్ కాళి’ సీజన్ 2 జీ5 (ZEE5) ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం అధికారికంగా బెంగాలీ ఆడియో మాత్రమే ఉంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి రాలేదు. ఈ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కుర్చీ నుంచి కదలకుండా చేస్తాయి. హారర్, మిస్టరీ జానర్లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ వీకెండ్‌లో కచ్చితంగా చూడాల్సిన పర్‌ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.