Sports Drama On OTT : క్రికెట్ మ్యాచ్ అంటే సాధారణంగా గెలుపు, ఓటమి మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఒక ఊరిలో అదే ఆట కులం, గౌరవం, ఆధిపత్యంతో ముడిపడితే పరిస్థితి ఎలా మారుతుంది ? ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడే ఇద్దరు క్రికెట్ కెప్టెన్లు… ఓ సందర్భంలో తమ పాత పగను పక్కన పెట్టి ఒకే జట్టు కోసం ఆడాల్సి వస్తే ? అంతేకాదు… తమకంటే బలమైన కార్పొరేట్ టీమ్ ను ఓడించడానికి ఇద్దరూ ఒక్కటైతే ? ఇలాంటి ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామానే ‘Blue Star’. తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓటీటీ ద్వారా వచ్చింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
అరక్కోణం అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అక్కడ క్రికెట్ పై యువతకు ఉన్న మక్కువే కథకు ప్రధాన నేపథ్యం. రంజిత్ ‘బ్లూ స్టార్’ జట్టుకు కెప్టెన్. అదే ప్రాంతంలో రాజేష్ ‘ఆల్ఫా’ టీమ్ ను నడిపిస్తుంటాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. మైదానంలో తలపడటం దగ్గర నుంచి వ్యక్తిగత గొడవల వరకు వీరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ పోటీ వెనుక మరో పెద్ద సమస్య దాగి ఉంటుంది. రంజిత్ జట్టుకు చెందిన ఆటగాళ్ల సామాజిక నేపథ్యాన్ని కారణంగా చూపిస్తూ వారిని చిన్నచూపు చూసే పరిస్థితులు ఎదురవుతాయి.
ఒక క్రికెట్ గ్రౌండ్ విషయంలో మొదలైన వివాదం కూడా ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తుంది. దీంతో రంజిత్, రాజేష్ మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. ఇంతలో వీళ్లిద్దరికీ ఊహించని అనుభవం ఎదురవుతుంది. ‘ఎలైట్’ అనే కార్పొరేట్ సంస్థకు చెందిన ఖరీదైన క్రికెట్ జట్టు… స్థానిక ఆటగాళ్లను ఏమాత్రం లెక్కచేయదు. రంజిత్, రాజేష్ ఇద్దరినీ ఒకే స్థాయిలో అవమానిస్తూ, మాకు పోటీగా నిలబడే అర్హత మీకు లేదన్నట్టుగా మాట్లాడుతుంది. దీంతో ఆ ఇద్దరికీ అప్పటివరకు తమ మధ్య ఉన్న గొడవల కంటే ఈ అవమానమే పెద్దదిగా అనిపిస్తుంది.
ఇంకేముంది రంజిత్, రాజేష్ ఒక నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత పగలు, పాత విభేదాలు అన్నీ పక్కన పెట్టి ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అనుకుంటారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే వైపు నిలబడతారు. కానీ కార్పొరేట్ టీమ్ ను ఓడించడం అంత సులభం కాదు. పరిమిత వనరులతో ఉన్న స్థానిక ఆటగాళ్లు… బలమైన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నారు ? చివరి మ్యాచ్‌లో ఎవరి సత్తా ఏంటో ఎలా నిరూపించారు ? అన్నదే సినిమా స్టోరీ.
Also Read : స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ
పా. రంజిత్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్. జయకుమార్ దర్శకత్వం వహించారు. అశోక్ సెల్వన్, శాంతను భాగ్యరాజ్‌తో పాటు కీర్తి పాండియన్, పృథ్వీ రాజన్, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. క్రికెట్ నేపథ్యంతో పాటు సామాజిక అసమానతలు, ఆత్మగౌరవం, స్నేహం, ఐక్యత వంటి అంశాలను కలిపి చెప్పే ఈ స్పోర్ట్స్ డ్రామా సెప్టెంబర్ 10 నుంచి ETV Winలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.