Romantic Fantasy Comedy on OTT: సినిమా కథలంటే ఎన్నో రకాల ప్రయోగాలు చూస్తుంటారు మేకర్స్. అయితే మనిషిని కాకుండా ఏకంగా వెదురుతో అల్లిన ఒక బుట్టను పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన ఎప్పుడైనా విన్నారా? వినడానికే ఇదెక్కడి విచిత్రమైన కథరా బాబూ అనిపిస్తోంది కదూ. అలాంటి ఒక వినూత్నమైన, సెటైరికల్ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ చిత్రం ‘విక్కర్’ (Wicker) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విజేత ఒలివియా కోల్‌మన్, హాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ పీటర్ డింక్లేజ్, ఎలిజబెత్ డెబికి వంటి దిగ్గజ నటీనటులు కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించడం విశేషం. ఈ చిత్రం రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 94 శాతం పాజిటివ్ స్కోర్ సాధించి బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ బుట్టనే భర్తగా ఎందుకు ఎంచుకుందో, ఆ తర్వాత ఆ ఊరిలో ఏం జరిగిందో, ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సినిమా కథంతా ఒక సముద్ర తీరంలోని చిన్న గ్రామం నేపథ్యంలో ఎంతో సరదాగా, వ్యంగ్యంగా సాగుతుంది. ఆ ఊరిలో చేపలు అమ్ముకుంటూ ఒంటరిగా జీవించే ఒక మహిళ (ఒలివియా కోల్‌మన్)కి పెళ్లి కాకపోవడంతో, గ్రామస్తులంతా ఆమెను నిత్యం హేళన చేస్తూ వెలివేసినట్లు చూస్తుంటారు. తన ఒంటరితనానికి, బయట వాళ్ళ సూటిపోటి మాటలకు విసిగిపోయిన ఆ మహిళ, తనకు తోడు కావాలని నిర్ణయించుకుని ఊరిలోని బుట్టలు అల్లే వ్యక్తి దగ్గరికి వెళ్లి, వెదురు పేముతో తనకు ఒక ‘బుట్ట భర్త’ను (Wicker Husband) తయారు చేసి ఇవ్వమని కోరుతుంది.
అయితే ఆ బుట్టల వ్యాపారి తయారు చేసిన ఆ బుట్ట బొమ్మ (అలెగ్జాండర్ స్కార్స్‌గార్డ్) అనూహ్యంగా ప్రాణం పోసుకుని, ఎంతో సున్నితమైన మనస్తత్వం, ప్రేమను పంచే మనిషిలా రావడంతో ఆ మహిళ అతడితో గాఢమైన ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటుంది. మొదట్లో ఆమెను చూసి నవ్వుకున్న ఆ ఊరి జనం, ఆ బుట్ట భర్త చూపిస్తున్న ప్రేమను చూసి అసూయపడటం మొదలుపెడతారు. గ్రామస్తులందరిలో మొదలైన ఆ ఈర్ష్య చివరికి ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? ఆ విచిత్ర జంట తమ ప్రేమను కాపాడుకుందా లేదా? అనేది కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింపజేసేలా తెరకెక్కించారు.
అలెక్స్ హస్టన్ ఫిషర్, ఎలియనోర్ విల్సన్ కలసి దర్శకత్వం వహించిన ‘విక్కర్’ (Wicker) కి IMDbలో 7.4/10 రేటింగ్, రొటెన్ టొమాటోస్‌లో 94 శాతం స్కోర్ సాధించింది. నిన్నటి నుంచే (2026 నవంబర్ 24) ప్రైమ్ వీడియోలో రెంట్, పర్చేజ్ విధానంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియోతో పాటు సబ్‌టైటిల్స్ సదుపాయంతో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, రొటీన్ కథలకు భిన్నంగా ఉండే ఫాంటసీ, డార్క్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
Read Also: మంచు తుఫానులో లవ్ బర్డ్స్… సడెన్‌గా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ