Chiranjeevi: చిత్రసీమలో మెగాస్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చిరంజీవి.. హీరోగానే కాకుండా ఎంతో మందికి అండగా నిలుస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని, ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది నటీనటులు ఇప్పుడు ఉన్నత స్థానాన్ని చేరుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే మనకు ఆయన సినిమాలు, సహాయాలు మాత్రమే తెలుసు. కానీ ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి జీవితానికి సంబంధించిన పలు విషయాలతో ఏదైనా డాక్యుమెంటరీ వస్తే బాగుండు అని ఆశపడిన అభిమానులు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ చిరంజీవి అభిమానుల కోసం ఒక అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చిరంజీవి ఒక పాడ్ కాస్ట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం ద్వారా ఆయన తన వ్యక్తిగత, సినీ జీవితంలోని అనుభవాలను ప్రేక్షకులతో నేరుగా పంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిజానికి చిరంజీవితో ఒక డాక్యుమెంటరీ రూపొందించాలనే ఆలోచనతోనే.. ఈ పాడ్ కాస్ట్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తన జీవిత ప్రయాణం, సినీ అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు , విజయాలు, మరిచిపోలేని సంఘటనల గురించి చిరంజీవి మరింత స్వేచ్ఛగా మాట్లాడేందుకు ఈ పాడ్ కాస్ట్ రూపం సరైనదని చిరంజీవి భావించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రముఖులు తమ జీవిత విశేషాలను సంభాషణల రూపంలో ప్రేక్షకులతో పంచుకునే కార్యక్రమాలకు ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ పెరుగుతోంది . ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆడియన్స్ కు మరింత చేరువ కావడానికి ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!
48 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనకు ఎదురైన వ్యక్తిగత అనుభవాలు పరిశ్రమల్లో మారిన పరిస్థితులు, తన ఆలోచన విధానంలో వచ్చిన మార్పులు.. ఇలా ఎన్నో విషయాలను చిరంజీవి ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకత కూడా ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె ప్రముఖ నిర్మాత సుస్మిత కొణిదెల ఈ పాడ్ కాస్ట్ ను నిర్మించనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ రాబోతోందని.. ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఎన్ని భాగాలు ఉంటాయి? చిరంజీవి ఎలాంటి విషయాలపై మాట్లాడనున్నారు? వంటి విషయాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు పాడ్ కాస్ట్ లతో మెగాస్టార్ చిరంజీవి మరొకసారి ఆడియన్స్ ను అలరించబోతున్నారు అనే అంశం అప్పుడే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.