Korean Fantasy Thriller: కొరియన్ వెబ్ సిరీస్ లలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా Death’s Game అని చెప్పాలి. ఒక మనిషికి మరణం తర్వాత మరో అవకాశం దొరికితే ఎలా ఉంటుంది? కానీ ఆ అవకాశం వరం కాకుండా శాపంగా మారితే? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిన ఈ కొరియన్ ఫాంటసీ థ్రిల్లర్ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ జీవితం విలువను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ సిరీస్ కథేంటో తెలుసుకుందాం పదండి.
ఈ సిరీస్ కథ చోయ్ యీ-జే (సియో ఇన్-గుక్) అనే ఒక నిరుద్యోగ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఏడేళ్ల పాటు ఉద్యోగం కోసం కష్టపడి, చివరికి ఉన్న డబ్బు కూడా మోసపోయి జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోయాక నరకం గేటు దగ్గర అతనికి ‘మృత్యుదేవత’ ఎదురవుతుంది. మరణాన్ని చాలా చులకనగా చూశావని ఆగ్రహించిన మృత్యువు, అతనికి ఒక భయంకరమైన శిక్ష విధిస్తుంది. ఇక ఆ శిక్షతో అసలు కథ మొదలవుతుంది.
ఆ శిక్ష ఏంటంటే.. అతను చావు అంచున ఉన్న 12 మంది వేర్వేరు మనుషుల శరీరాల్లోకి వెళ్లి, ఆ 12 మరణాల బాధను అనుభవించాలి. అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది.. ఆ 12 జన్మలలో ఏ ఒక్క శరీరంలోనైనా తనకు రాబోయే మృత్యువు నుండి తప్పించుకుని బ్రతికితే, ఆ జీవితాన్ని శాశ్వతంగా గడిపే అవకాశం లభిస్తుంది. బిజినెస్ మ్యాన్, యాక్షన్ స్టంట్ మ్యాన్, స్టూడెంట్, సీరియల్ కిల్లర్ టార్గెట్ ఇలా 12 విభిన్న జీవితాల్లో అతను ఎదుర్కొన్న మృత్యు పోరాటం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. జీవితంలో నిరాశతో చావాలనుకునే వారు ఈ సిరీస్ చూస్తే కచ్చితంగా తమ నిర్ణయం మార్చుకుంటారు.
‘Death’s Game’లో చోయ్ యీ-జే పాత్రలో సియో ఇన్-గుక్, డెత్ పాత్రలో పార్క్ సో-డామ్ నటించారు. హా బైంగ్-హూన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 2023 డిసెంబర్ 15న విడుదలైంది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రస్తుతం Amazon Prime Videoలో కొరియన్ ఆడియోతో పాటు ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే.
Read Also: అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్