Telugu Comedy Short Film: ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఉద్యోగం, జీతం, ఆస్తి, కుటుంబం గురించి అడగడం సహజం. కానీ “నీ CIBIL స్కోర్ ఎంత?” అని అడిగితే ఎలా ఉంటుంది ? వినడానికి ఇది సరదాగా అనిపించినా, నేటి యువత ఆర్థిక అలవాట్లను దృష్టిలో పెట్టుకుని చూస్తే… ఇది అంత చిన్న విషయం కాదు. అప్పులు తీసుకుని విలాసాలకు అలవాటు పడుతున్న కాలంలో, ఆర్థిక క్రమశిక్షణ కూడా జీవిత భాగస్వామిని ఎంపిక చేసే ప్రమాణంగా మారితే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన ఆలోచనతో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ Cibil Score Pellikoduku. ఈ 20 నిమిషాల చిత్రం వినోదంతో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని కూడా అందిస్తోంది. కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ప్రసాద్ అనే మధ్యతరగతి తండ్రికి తన కూతురు పెళ్లి గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది. మంచి ఉద్యోగం, భారీ జీతం, ఖరీదైన కారు లేదా పెద్ద ఇల్లు ఉన్న అబ్బాయి కంటే… ఆర్థికంగా బాధ్యతగా ఉండే వ్యక్తినే అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకే పెళ్లి సంబంధం చూసే ప్రతి అబ్బాయికి ఒకే ప్రశ్న వేస్తాడు… “నీ సిబిల్ స్కోర్ ఎంత?”
అతని ఈ కండిషన్ విన్నవాళ్లు మొదట నవ్వుకుంటారు. కానీ ప్రసాద్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఒకరోజు పెళ్లి చూపులకు వచ్చిన యువకుడిని కూర్చోబెట్టి, అతని పాన్ కార్డ్ నంబర్ అడుగుతాడు. అంతటితో ఆగకుండా, వచ్చిన ఓటీపీ కూడా చెప్పమని అడిగి, అతని సిబిల్ స్కోర్ చెక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి మొదలయ్యే సంఘటనలు నవ్వులు పంచుతూనే, నేటి ఆర్థిక వాస్తవాలను ప్రేక్షకుల ముందుంచుతాయి.
జీతం ఎక్కువగా ఉన్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి పరిస్థితి ఒకవైపు… తక్కువ సంపాదించినా ఆర్థికంగా క్రమశిక్షణతో జీవించే వారి జీవితం మరోవైపు కథలో సహజంగా చూపించారు. డబ్బు సంపాదించడం కంటే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నామన్నదే అసలు విలువ అని ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేస్తుంది. చివరకు ప్రసాద్ తన కూతురికి ఎలాంటి అబ్బాయిని ఎంపిక చేశాడు ? సిబిల్ స్కోర్ నిజంగా జీవితాన్ని నిర్ణయించే స్టాండర్డా ? లేక దాని వెనుక మరేదైనా రీజన్ దాగి ఉందా? అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించారు.
ప్రస్తుతం ‘సిబిల్ స్కోర్ పెళ్లికొడుకు’ ETV Winలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా కేవలం 20 నిమిషాల నిడివి ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించారు. దేవీ ప్రసాద్ తన సహజమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, అభినవ్ మణికంఠ, సోని శ్రీవాస్తవ, ధనలక్ష్మి తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు చైతన్య కథను సరదాగా చెప్పడంతో పాటు, శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలకు మంచి బలం ఇచ్చింది.
కేవలం నవ్వించడమే కాదు, నేటి యువతకు డబ్బు విలువ, ఆర్థిక బాధ్యత, అప్పుల ప్రభావం గురించి సరదాగా చెప్పే షార్ట్ ఫిల్మ్ ఇది. కుటుంబమంతా కలిసి ఇరవై నిమిషాలు నవ్వుకుంటూనే ఒక మంచి సందేశాన్ని చూడాలనుకుంటే ఈ చిత్రం మంచి ఆప్షన్. ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్‌ను మిస్ అవ్వకుండా చూడండి. ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న కథా సుధ – సండే స్టోరీస్ సిరీస్‌లో భాగంగా విడుదలైంది.
Read Also : రోగి మరణం వెనుక గత జన్మల మిస్టరీ… సైకియాట్రిస్ట్‌కే మైండ్ బ్లాంకయ్యే ట్విస్ట్