Creature Survival Horror Movie: చుట్టూ అంతులేని సముద్రం… ఎటు చూసినా దట్టమైన అడవి. అలాంటి ప్రదేశంలో ఓ భయంకరమైన రాక్షస జీవి మనుషుల్ని వేటాడటం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది… ప్రాణాలు కాపాడుకోవడానికి శత్రువులతోనే చేతులు కలపాల్సిన పరిస్థితి వస్తే… ఇలాంటి ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కిన హిస్టారికల్ క్రియేచర్ హారర్ మూవీ ‘మాన్స్టర్ ఐలాండ్’ (Monster Island). మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? అసలు కథ ఏంటి ? తెలుగులోనూ ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ 1944లో నడుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయం. జపాన్‌కు చెందిన ఓ నౌకలో యుద్ధ ఖైదీలను బానిసలుగా పని చేయించేందుకు తరలిస్తుంటారు. ఆ నౌకలో సైటో అనే జపాన్ సైనికుడు, బ్రాన్సన్ అనే బ్రిటిష్ యుద్ధ ఖైదీ ఉంటారు. వీరిద్దరి మధ్య ఇప్పటికే బద్ద శత్రుత్వం ఉంటుంది. అయితే సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరగడంతో… ఈ ప్రమాదంలో సైటో, బ్రాన్సన్ సముద్రంలో పడిపోతారు. అక్కడి నుంచి ఈదుకుంటూ ఓ నిర్జన దీవి ఒడ్డుకు చేరుకుంటారు.
అక్కడికి చేరుకున్న తర్వాతే వారికి అసలు షాక్ తగులుతుంది. ఆ దీవిలో మనుషుల్ని వేటాడే ఓ భయంకరమైన జీవి ఉందని వారికి ఆలస్యంగా తెలుస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జీవి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అర్థం చేసుకుంటారు. ఒకవైపు ప్రాణాలు తీసే రాక్షస జీవి… మరోవైపు ఒకరిపై మరొకరికి ఉన్న ద్వేషం. ఈ పరిస్థితుల్లో ఇద్దరూ తమ పాత గొడవలను పక్కన పెట్టి, ప్రాణాలతో బయట పడడానికి కలిసి పోరాడాల్సి వస్తుంది.
ఆ దీవిలో ఎక్కడ దాక్కున్నా ఆ జీవి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అది ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇద్దరూ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ జీవి ఏంటి ? ఆ దీవిలోనే ఎందుకు ఉంటుంది ? దాని బారి నుంచి తప్పించుకోవడానికి శత్రువులుగా ఉన్న సైటో, బ్రాన్సన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ? చివరికి ఆ దీవి నుంచి ప్రాణాలతో బయట పడగలిగారా? అన్నదే ఈ సినిమా కథ.
‘మాన్స్టర్ ఐలాండ్’ 2025లో విడుదలైన హిస్టారికల్ సర్వైవల్ హారర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా A సర్టిఫికేషన్ తో ఉంది. కాబట్టి చిన్న పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్. ‘ఓరాంగ్ ఇకాన్’ (Orang Ikan) పేరుతోనూ గుర్తింపు పొందిన ఈ చిత్రానికి మైక్ విలువాన్ (Mike Wiluan) దర్శకత్వం వహించారు. డీన్ ఫుజియోకా (Dean Fujioka), కాలమ్ వుడ్‌హౌస్ (Callum Woodhouse), అలన్ మాక్సన్ (Alan Maxson) కీలక పాత్రల్లో నటించారు. తెలుగు సినిమా లవర్స్ కోసం ఈ గగుర్పొడిచే యాక్షన్ హారర్ చిత్రం క్లియర్ తెలుగు ఆడియోలో అందుబాటులో ఉండటం ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.