Crime Thriller Web Series on OTT: కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలోనే ఒక హంతకుడు దాక్కుంటే ? చట్టాన్ని అమలు చేసే అధికారులనే ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ, గతంలో చేసిన నేరాలకు ప్రతీకారం తీర్చుకుంటే ? ఆ హత్యల వెనుక ఏళ్ల క్రితం జరిగిన ఓ భయంకరమైన ఘటనకు సంబంధం ఉందని తెలిస్తే ? అలాంటి ప్రశ్నల చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన క్రైమ్ డ్రామానే ‘విమెన్ ఇన్ బ్లూ సీజన్ 2’ (Women in Blue Season 2). 1970ల నాటి మెక్సికో సిటీని నేపథ్యంగా తీసుకుని, పోలీస్ శాఖలోని అవినీతి, అధికార దుర్వినియోగం, పాత నేరాలు, ప్రతీకారం వంటి అంశాలను మిస్టరీతో ముడిపెట్టిన ఈ స్పానిష్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనేది చూద్దాం పదండి.
మొదటి సీజన్‌లో మెక్సికోలో తొలి మహిళా పోలీస్ బృందంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన నలుగురు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. పురుషాధిక్యమైన పోలీస్ వ్యవస్థలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే వారికి పెద్ద పోరాటంగా మారింది. ఇప్పుడు రెండో సీజన్‌లో వారి ముందున్న కేసు మాత్రం గతంలో ఎదుర్కొన్న సమస్యల కంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది.
ఒక విద్యార్థి మృతదేహం బయట పడటంతో ఈ కొత్త కేసు మొదలవుతుంది. తొలుత ఇది సాధారణ హత్యగానే కనిపించినా, దర్యాప్తు కాస్త ముందుకు వెళ్లగానే కథ చాలా ఏళ్ల వెనక్కి వెళ్తుంది. ముఖ్యంగా 1968లో జరిగిన మెక్సికో విద్యార్థులపై జరిగిన ఘోరమైన కాల్పుల ఘటనకు సంబంధించిన ఆధారాలు బయటపడటం కేసును ఒక్కసారిగా కీలక మలుపు తిప్పుతుంది.
ఆ పాత ఘటనలో పోలీస్ వ్యవస్థ పాత్రపై కూడా అనుమానాలు మొదలవుతాయి. అప్పట్లో జరిగిన విషయాలను దాచిపెట్టేందుకు కొందరు అధికారులు ప్రయత్నించారా ? ఆ ఘటనకు సంబంధించిన నిజాలు ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు రాలేదు ? అనే ప్రశ్నలు దర్యాప్తును మరింత సంక్లిష్టంగా మారుస్తాయి.
ఇదే సమయంలో ఆ పాత ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా హత్యకు గురవుతుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే… ఈ హత్యలు యాదృచ్ఛికంగా జరగడం లేదు. గతంలో అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులే మిస్టరీ కిల్లర్ టార్గెట్‌గా మారుతుంటారు.
దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే కలకలం మొదలవుతుంది. ఇంతకాలం నేరస్తులను వెతికిన అధికారులు ఇప్పుడు తమ వ్యవస్థలోనే దాగి ఉన్న ఒక హంతకుడి కోసం గాలించాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చంపుతున్న వ్యక్తి ఎవరు? అతని లక్ష్యం కేవలం ప్రతీకారం తీర్చుకోవడమేనా? లేక పోలీస్ శాఖలోని మరింత పెద్ద రహస్యాన్ని బయట పెట్టడానికే ఈ హత్యలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు కథను ఉత్కంఠగా నడిపిస్తాయి.
ఈ దర్యాప్తు మధ్యలో మారియా జీవితంలో కూడా కీలకమైన మార్పు వస్తుంది. లెఫ్టినెంట్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత ఆమెపై బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఒకవైపు తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. మరోవైపు తాను పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థలోనే దాగి ఉన్న అవినీతి, పాత నేరాల నిజాలను బయటకు తీయాల్సి వస్తుంది.
దర్యాప్తు జరిగేకొద్దీ మారియాకు తన చుట్టూ ఉన్న వ్యక్తులపైనే అనుమానాలు మొదలవుతాయి. నమ్మినవారిలో ఎవరు నిజంగా తనకు సహకరిస్తున్నారు ? ఎవరు నిజాలను దాచి పెడుతున్నారు ? అన్నది కూడా ఆమెకు అంతుచిక్కని పరిస్థితిగా మారుతుంది. ఈ క్రమంలో మహిళా పోలీస్ బృందం కేవలం ఒక హత్య కేసును సాల్వ్ చేయడానికి మాత్రమే కాకుండా, తమ సొంత డిపార్ట్‌మెంట్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో జరిగిన ఒక విషాద ఘటన, వర్తమానంలో జరుగుతున్న వరుస హత్యలతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకోవాలంటే ఈ సీజన్ ను చూడాల్సిందే.
బార్బరా మోరి, నటాలియా టెల్లెజ్, అమోరిటా రాస్గాడో, క్సిమెనా సరినానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను ఫెర్నాండో రోవ్జార్, పాబ్లో అరామెండి రూపొందించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు పొలిటికల్ కాన్స్పిరసీ, మిస్టరీ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి కథను ముందుకు తీసుకెళ్లారు. సాధారణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథలకు భిన్నంగా పోలీస్ వ్యవస్థలోనే దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టే కథనం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. మహిళా పోలీసులు ఎదుర్కొనే వృత్తిపరమైన సవాళ్లతో పాటు, 1968 నాటి ఘటన చుట్టూ అల్లుకున్న మిస్టరీ, వరుస హత్యలు, మిస్టరీ కిల్లర్ ఎవరనే ప్రశ్న కథపై ఆసక్తిని పెంచుతాయి.
‘విమెన్ ఇన్ బ్లూ సీజన్ 2’ ప్రస్తుతం Apple TV+లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పానిష్ భాషలో రూపొందిన ఈ క్రైమ్ డ్రామా తెలుగులో లేదు. పోలీసులను టార్గెట్ చేస్తున్న ఆ మిస్టరీ కిల్లర్ అసలు ఎవరు? అతని గతం ఏమిటి? 1968 నాటి విద్యార్థుల విషాద ఘటనతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? ముఖ్యంగా నిజాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మారియా తన సొంత డిపార్ట్‌మెంట్‌ను ఎంతవరకు నమ్మగలదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లింగ్ సిరీస్ ను చూడాల్సిందే.
Read Also: నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం