Thriller Movie OTT : దెయ్యాలు, భూతాలుతో పుట్టించే భయం కంటే, కొన్ని సినిమాలలో మనుషులు పుట్టించే భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సినిమా చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మీద ఓ లుక్ వేయండి. ఇందులో ఒక సైకో గన్ పట్టుకుని దూరంగా కూర్చుని, దొరికిన వాడిని దొరికినట్టు పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు అమ్మో! ఇప్పుడు ఎవరికి బుల్లెట్ తగులుతుందో అని గుండె దడదడలాడిపోతుంది. ఇందులో రక్తపాతం మాత్రం మామూలుగా ఉండదు, ఒళ్లు జలదరించేలా బీభత్సంగా చూపిస్తారు. పక్కాగా చెప్పాలంటే, ఇది గట్స్ ఉన్నోళ్లు మాత్రమే చూడాల్సిన రక్తం ఏరులై పారే సినిమా. దీని పేరు ? ఎక్కడ చూడచ్చు అనే వివరాల్లోకి వెళ్తే..
2017లో వచ్చిన ఈ అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డౌన్‌రేంజ్’ (Downrange). దీనికి ర్యూహీ కిటమురా దర్శకత్వం వహించారు. దర్శకుడు తక్కువ బడ్జెట్‌తో కేవలం ఒకే ఒక లొకేషన్‌లో గంటన్నర పాటు ఉత్కంఠను కొనసాగించడంలో విజయం సాధించారు. ఈ సినిమా అంతా పట్టపగలు ఎండలోనే సాగుతుంది. సాధారణంగా హారర్ సినిమాలు చీకటిలో ఉంటాయనే పద్ధతిని మార్చి, వెలుతురులో కూడా భయాన్ని పుట్టించవచ్చని ఈ సినిమా నిరూపించింది. ఇందులో దాదాపు అందరూ కొత్తవారే నటించారు. ముఖ్యంగా కెల్లీ కొన్నైర్, స్టెఫానీ పీయర్సన్ తమ నటనతో యాక్టింగ్ చక్కగా పండించారు. ఈ సినిమా 2017లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇది హారర్ ప్రియుల కోసం Shudder, Apple TV ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.
ఆరుగురు స్నేహితులు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు మీద అకస్మాత్తుగా కారు టైర్ పేలిపోతుంది. టైర్ మార్చడానికి కిందకు దిగిన వాళ్ళకి, ఆ టైర్ పేలింది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని, ఎవరో గన్‌తో కావాలనే షూట్ చేశారని అర్థమవుతుంది. ఆ ఒక్క నిమిషం వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరపోతారు. ఇక అసలు టెన్షన్ మొదలవుతుంది. కంటికి కనిపించని ఒక అజ్ఞాత వ్యక్తి, వీళ్ళని దూరం నుంచి స్నైపర్‌తో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. బయటకు వస్తే ఎక్కడ బుల్లెట్ తగులుతుందో అని భయపడి, అందరూ ఆ కారు చాటునే దాక్కుంటారు.
Also Read : మనిషి మాంసంతో బిజినెస్… వంద నిమిషాల పాటు వెన్నులో వణుకు పుట్టించే సినిమా
ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, ఎండ తీవ్రత పెరగడం, పైగా ఆ షూటర్ ఏ మాత్రం కనికరం లేకుండా ఒక్కొక్కరిని చంపడానికి ప్రయత్నించడంతో పరిస్థితి చాలా భయంకరంగా మారుతుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు, ఎందుకు చంపాలనుకుంటున్నాడో అంతకన్నా తెలియదు. చావుతో ఆడుకునే ఆ సైకో నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ స్నేహితులు కూడా చాలా భీకర పోరాటమే ఈ చేస్తారు. ఈ క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా చాలా హింసాత్మకంగా, షాకింగ్‌గా ముగుస్తుంది. అసలు కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపుతున్నాడు ? వీళ్ళంతా ప్రాణాలతో బయటపడతారా ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.