Feel Good Drama: స్నేహితుడు చనిపోయే ముందు తన దగ్గర ఉన్న భారీ కుక్కను ఓ రచయిత్రికి అప్పగిస్తాడు. కానీ ఆ కుక్క సాధారణ పెంపుడు జంతువు కాదు. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. పైగా ఇంట్లో తిరగడానికి కూడా కావలసినంత స్థలం సరిపోదు. ఫర్నిచర్ పాడవుతుంది… ఇంటి ఓనర్‌తో గొడవలు వస్తాయి… జీవితమంతా గందరగోళంగా మారుతుంది. మొదట దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రయత్నించిన ఆమెకు క్రమంగా ఆ కుక్కతో ఏర్పడే అనుబంధం తనలోని మరో ప్రపంచాన్ని చూపిస్తుంది. ఒంటరితనం, స్నేహం, ప్రేమ వంటి అంశాలతో హృదయాన్ని తాకే కథే ‘ది ఫ్రెండ్’ (The Friend). మరి ఈ ఫీల్ గుడ్ డ్రామా స్ట్రీమింగ్ ఎక్కడ ? ఏ భాషలో ఉంది ? అనేది తెలుసుకుందాం.
న్యూయార్క్ లో ఒంటరిగా జీవించే రచయిత్రి ఐరిస్. ఆమెకు పుస్తకాలు, పని, తనకంటూ ఓ ప్రశాంతమైన జీవితం ఉంటాయి. కానీ ఆమెకు అత్యంత సన్నిహితుడైన రచయిత, మెంటార్ వాల్టర్ చనిపోతాడు. ఆయన మరణించిన తర్వాత ఐరిస్ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. అతను తన పెంపుడు గ్రేట్ డేన్ కుక్క అపోలోను ఐరిస్ కు అప్పగిస్తాడు. తన తదనంతరం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వీలునామాలో ఆమెను కోరతాడు.
భారీ ఆకారంలో ఉండే అపోలోను ఇంట్లో ఉంచుకోవడం ఐరిస్ కు మొదట పెద్ద సమస్యగా మారుతుంది. తను ఉండే చిన్న అపార్ట్‌మెంట్ లో అది తిరగడం వల్ల వస్తువులు పాడవుతాయి. పొరుగు వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. ఇంటి యజమాని కూడా కుక్కను పంపించేయాలి అని ఒత్తిడి చేస్తాడు. ఐరిస్ కు అంతకుమించిన అసలు సమస్య అపోలోను చూసుకోవడం కాదు… తన స్నేహితుడి మరణాన్ని అంగీకరించడం. వాల్టర్ ను కోల్పోయిన బాధలో ఆమె మానసికంగా ఒంటరిగా మారుతుంది. అపోలో మాత్రం ఎప్పుడూ ఆమెతోనే ఉంటుంది.
మొదట బాధ్యతగా కనిపించిన కుక్క క్రమంగా ఐరిస్ జీవితంలో భాగమవుతుంది. ముందుగా దాన్ని ఎవరికైనా అమ్మేయాలి అనుకుంటుంది. కానీ తరువాత దాని కోసం ఆమె తన అలవాట్లు మార్చుకోవాల్సి వస్తుంది. బయటకు తీసుకెళ్లాలి, తినిపించాలి, దాని ఆరోగ్యం చూసుకోవాలి. ఈ చిన్న చిన్న పనుల మధ్య ఆమె తన జీవితంలో కోల్పోయిన అనుబంధాలను మళ్లీ గుర్తు చేసుకుంటుంది. అపోలోతో ఏర్పడే బంధం ఐరిస్ లోని సృజనాత్మకతను కూడా ప్రభావితం చేస్తుంది. తన స్నేహితుడి జ్ఞాపకాలు, అతనితో ఉన్న సంబంధం, తన ఒంటరితనం అన్నీ మరోసారి ఆమెకు గుర్తొస్తాయి.
ఒకప్పుడు భారంగా కనిపించిన కుక్కే తన జీవితంలో ఓ భావోద్వేగ ఆధారంగా మారుతుంది. కుక్కను వదిలించుకోవాలనే ఆలోచన నుంచి దానిని కోల్పోతాననే భయానికి ఐరిస్ ప్రయాణం సాగుతుంది. మనిషి జీవితంలో ఓ పెంపుడు జంతువు కేవలం జంతువు కాకుండా ఒక జ్ఞాపకంగా, కుటుంబ సభ్యుడిగా ఎలా మారుతుందో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరి ఆ కుక్కను ఆమె అనుకున్నట్టుగా అమ్మేసిందా ? క్లైమాక్స్ లో ఏమయ్యింది ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
నయోమీ వాట్స్ (Naomi Watts), బిల్ ముర్రే (Bill Murray), సారా పిడ్జన్ (Sarah Pidgeon) నటించిన ‘ది ఫ్రెండ్’కు స్కాట్ మెక్‌గీహీ, డేవిడ్ సీగెల్ దర్శకత్వం వహించారు. Netflixసినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలో ఇంగ్లీష్, హిందీ ఆడియో… ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. తెలుగు డబ్ మాత్రం లేదు.
Read Also: సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్