Feel good Movie OTT: ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ ఫిదా అవుతుంటారు. అలాంటి సినిమాలు మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈ సినిమాలోని అతిపెద్ద స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో నటించిన వాళ్ళల్లో దాదాపు 85% మంది నిజంగానే జైలు శిక్ష అనుభవించి విడుదలైన వాళ్ళే. ఈ సినిమాలోని ప్రధాన పాత్ర పోషించిన క్లారెన్స్ మాక్లిన్ నిజ జీవితంలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. ఇక మరో అసలు విషయం ఏమంటే, ఈ సినిమాకు వచ్చిన లాభాలను నటీనటులు, టెక్నీషియన్లు అందరూ సమానంగా పంచుకునేలా ఒక ప్రత్యేకమైన ఒప్పందం చేసుకున్నారు. అంటే పెద్ద స్టార్ల నుండి చిన్న నటుల వరకు అందరికీ సినిమాలో వాటా వచ్చింది. ఈ సినిమా పేరు కూడా 2024 ఆస్కార్ రేసులో బలంగా వినిపించింది.
2023లో వచ్చిన ఈ అమెరికన్ ఫీల్ గుడ్ డ్రామా మూవీ పేరు ‘సింగ్ సింగ్’ (Sing Sing). గ్రెగ్ క్వెడార్ దీనికి దర్శకత్వం వహించారు. ఇది న్యూయార్క్‌లోని సింగ్ సింగ్ కరెక్షనల్ ఫెసిలిటీ అనే జైలులో నిర్వహించే ‘రిహాబిలిటేషన్ త్రూ ది ఆర్ట్స్’ (RTA) అనే థియేటర్ ప్రోగ్రామ్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో హీరో కోల్మన్ డొమింగో, అలాగే సపోర్టింగ్ రోల్ చేసిన మాజీ ఖైదీ క్లారెన్స్ మాక్లిన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా సెప్టెంబర్ 2023లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల నుండి భారీగా ప్రశంసలు అందుకుంది. జూలై 2024లో థియేటర్లలో విడుదలై, ఆస్కార్ రేసులో కూడా గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా prime videoలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇందులో హీరో చేయని నేరానికి అన్యాయంగా జైలుకు వెళ్తాడు. కానీ బయట సమాజం తనని ఎలా చూసినా, లోపల మాత్రం తను ఒక మనిషిలా బతకాలని అనుకుంటాడు. అందుకే జైలులోని తోటి ఖైదీలందరినీ పోగు చేసి, ఒక డ్రామా టీమ్ కడతాడు. జైలు గోడల మధ్య కూడా నాటకాలు వేస్తూ, ఆ కాసేపైనా తాము ఖైదీలం అనే విషయాన్ని మర్చిపోయి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా సాగుతున్న క్రమంలో, డివైన్ ఐ అనే ఒక రౌడీ ఖైదీ వీళ్ల టీమ్‌లోకి వస్తాడు. అతను చాలా మొండివాడు, ఎవరి మాట వినడు, ఎప్పుడూ గొడవ పడే రకం కూడా. మొదట్లో మన హీరోకి, వాడికి అస్సలు పడదు. కానీ నాటకంలో రిహార్సల్స్ చేస్తూ, ఒకరినొకరు అర్థం చేసుకునే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న కోపం తగ్గిపోతుంది. ఆ గరుకు మనిషిలో కూడా ఒక కళాకారుడు ఉన్నాడని, అతనికి కూడా ప్రేమ కావాలని హీరో గుర్తిస్తాడు. అలా వాళ్లిద్దరూ మంచి దోస్తులవుతారు.
చివరికి వీళ్లంతా కలిసి ఒక వింతైన కామెడీ నాటకాన్ని స్టేజ్ మీద ప్రదర్శిస్తారు. ఆ నాటకం వేస్తున్నప్పుడు వాళ్ల కళ్లలో ఒక రకమైన మెరుపు కనిపిస్తుంది. జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే చోటు మాత్రమే కాదు, మనిషిలోని తప్పుల్ని దిద్దుకుని కొత్తగా పుట్టే చోటు అని ఈ సినిమా చూపిస్తుంది. సినిమా చివరలో హీరోకి బెయిల్ వచ్చి బయటకు వెళ్లేటప్పుడు, ఆ జ్ఞాపకాలు మనల్ని కదిలిస్తాయి. కళ అనేది మనిషిని ఎంతగా మారుస్తుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
Read Also : గుండెను మెలిపెట్టే స్టోరీ… ప్రెసిడెంట్ కోరిక కోసం తిప్పలు పడే చిన్నారి… ఎన్నో అవార్డులు గెలిచిన స్టోరీ