Documentary Series: సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు చూస్తే వాళ్ల జీవితం అంతా గ్లామర్ గా కనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూసినట్టు పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కానీ కెమెరా ఆఫ్ చేసిన తర్వాత వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుంది ? ఫాలోవర్లు, బ్రాండ్లు, ఫ్యాషన్, వ్యక్తిగత సంబంధాల మధ్య ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ జీవితం ఎలా ఉంటుంది ? సోషల్ మీడియా, వాటిలో పాపులర్ అయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్ల లైఫ్ వెనుక దాగి ఉన్న నిజమైన జీవితాన్ని చూపించే సిరీస్ ‘గర్ల్స్ ఆఫ్ వార్సా’ (Girls of Warsaw). మరి ఈ రియాలిటీ సిరీస్ స్ట్రీమింగ్ చూడొచ్చంటే ?
‘గర్ల్స్ ఆఫ్ వార్సా’ ఫిక్షన్ సిరీస్ కాదు. పోలాండ్ కు చెందిన ప్రముఖ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ల జీవితాలను కెమెరాతో దగ్గరగా చూపించే రియాలిటీ, డాక్యుమెంటరీ సిరీస్ ఇది. సోషల్ మీడియాలో వాళ్లు చూపించే గ్లామర్ వెనుక ఉన్న కథలు, నిజ జీవితంలో వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులను కూడా ఇందులో చూడొచ్చు. అందం, ఫ్యాషన్, ఈవెంట్స్, సోషల్ మీడియా పోస్టులు… ఇవన్నీ వాళ్ల జీవితంలో ఓ భాగం మాత్రమే. కెమెరా ముందు ఎప్పుడూ కాన్ఫిడెంట్ గా కనిపించే ఈ మహిళలు వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబం, సంబంధాలు, పని, బాధ్యతలు వంటి ఎన్నో విషయాలను చూసుకునే బాధ్యతను నెత్తికెత్తుకుంటారు.
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కు సోషల్ మీడియాలో ఉన్న ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో… అదే సమయంలో తన నిజ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా సిరీస్ చూపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అభిమానుల ముందు పంచుకోవాలా ? లేక వాటిని ప్రైవేట్ గా ఉంచాలా ? అనే సందిగ్ధతకు కూడా సమాధానం కనిపిస్తుంది. అలాగే సోషల్ మీడియా ప్రపంచంలో విజయాన్ని సాధించిన తర్వాత కూడా అసలు జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు ఎలా ఉంటాయో సిరీస్ లోని పాత్రల ద్వారా తెలుస్తుంది.
కుటుంబ సభ్యులతో సంబంధాలు, స్నేహాలు, కెరీర్ ప్లాన్స్, వ్యక్తిగత నిర్ణయాలు… ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో కోణం బయట పడుతుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ లో వార్సా నగరానికి చెందిన ప్రముఖ మహిళల జీవితాలను దగ్గరగా చూడొచ్చు. సోషల్ మీడియాలో కనిపించే లైఫ్‌స్టైల్ కు, నిజ జీవితానికి మధ్య ఎంత తేడా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఈ సిరీస్ మంచి ఆప్షన్.
ఆండ్జియాక్స్ (Andziaks), ఓలా నోవాక్ (Ola Nowak), జెస్సికా మెర్సిడెస్-కిర్ష్నర్ (Jessica Mercedes-Kirschner), క్లాడియా సడోనిక్ (Klaudia Sadownik) తదితర ఇన్‌ఫ్లుయెన్సర్ల జీవితాల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ‘గర్ల్స్ ఆఫ్ వార్సా’లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. సెప్టెంబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పోలిష్ డాక్యుమెంటరీ, రియాలిటీ సిరీస్. కాబట్టి తెలుగులో లేదు. అయితే ఇంగ్షీషు ఆడియో మాత్రం అందుబాటులో ఉంది.