Land Acquisition: భూసేకరణ, పునరావాసం కోసం విడుదల చేసిన రూ.813 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత రైతులకు అందించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధులు విడుదలైనప్పటికీ అవి ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోవడం, భూసేకరణ పూర్తికాక సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ల పనితీరుపై ఉత్తమ్ అసహనం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసం–పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా ప్రభుత్వం రూ.2,504 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చెల్లింపులకు పెండింగ్‌లో ఉన్న రూ.813 కోట్లలో రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద, మరో రూ.311 కోట్లు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నట్లు తెలిపారు. దీనిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదలైన తరువాత అవి తప్పనిసరిగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలని ఆదేశించారు. కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని రైతులతో సంప్రదింపులు జరపడంతోపాటు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన అవసరాల కోసం 2026లో రూ.6 వేల కోట్లు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని నీటిపారుదల శాఖ సాధారణ బడ్జెట్‌కు అదనంగా సమకూరుస్తున్నట్లు తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులపై అధికారులు న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. అవార్డులు జారీ చేసి, చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాతే టోకెన్లు సమర్పించాలని స్పష్టం చేశారు. అవార్డు ప్రకటించిన తరువాత కూడా పరిహారం చెల్లింపులు ఆలస్యమైన కేసుల్లో నిబంధనల ప్రకారం రైతులకు వడ్డీ చెల్లించాలని ఆదేశించారు.
మరోవైపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ తదితర జిల్లాల్లో భూసేకరణకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి జిల్లాలవారీగా సమీక్షించారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి రిజర్వాయర్, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో జాప్యంపై ఆరా తీశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయిన తరువాత దాని ప్రయోజనాలు రైతులకు అందాలంటే పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి దశకు నిర్దిష్ట గడువు పెట్టుకొని సాధ్యమైనంత తక్కువ సమయంలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
Also Read: మనిషి vs రోబోట్.. బాక్సింగ్ రింగ్‌లో బిగ్ ఫైట్.. సినిమా కాదండోయ్ నిజం!
అటు సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ.. చెల్లింపులకు పూర్తిగా సిద్ధమైన తరువాతే నిధులను కోరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖాతాల్లో నిరుపయోగంగా ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆదేశించారు. కాగా ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Also Read: అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!