MP Chamala: నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిజాం నవాబులు 200 ఏళ్ల కాలంలో ఆస్తులు కూడబెడితే, కేసీఆర్ కుటుంబం మాత్రం కేవలం పదేళ్ల పాలనలోనే అపారమైన ఆస్తులను సంపాదించిందన్నారు. తొమ్మిది జిల్లాల్లో 24 మండలాలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలో 400 ఎకరాలకు పైగా భూములు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం సోమవారం శంషాబాద్‌లోని సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్‌ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ చామల మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని ఎంపీ చామల మండిపడ్డారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని విమర్శించారు. తెలంగాణ పరిస్థితిని కేసీఆర్ ‘కుక్కలు చింపిన విస్తరి’లా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అసలైన ఫామ్ హౌస్ సంస్కృతిని బీఆర్‌ఎస్ నేతలే తీసుకొచ్చారని ఎంపీ ఆరోపించారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌ను చూసి హరీష్ రావు, హరీష్ రావును చూసి కేటీఆర్, కేటీఆర్‌ను చూసి జగదీష్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలు ఫామ్ హౌస్‌లు నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌లోని సర్వే నంబర్లు 162, 223 లలో జగదీష్ రెడ్డి దాదాపు 50 ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్ నిర్మించారని ఇందులో ఇనాం భూములు కూడా ఉన్నాయని ఆరోపించారు. జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్‌లో ఇనాం భూములు ఉంటే వెంటనే వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.
2009లో జగదీష్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన అఫిడవిట్‌లో కేవలం రూ. 12 లక్షల ఆస్తి మాత్రమే ఉందని చామల గుర్తుచేశారు. కానీ 2014, 2018, 2023 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన ఆస్తులు అంచెలంచెలుగా కోట్లకు పడగెత్తాయని ఆరోపించారు. జగదీష్ రెడ్డికి తన నియోజకవర్గంతో సంబంధం లేని శంషాబాద్ ప్రాంతంలో ఇన్ని ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇదే సూర్యాపేట నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ కుటుంబం నేటికీ ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంటే బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.
Also Read: ఖాతాల్లో రూ.813 కోట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? కలెక్టర్లపై మంత్రి ఉత్తమ్ ఫైర్!
తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న సామాన్యులు, విద్యార్థులు తమ ప్రాణాలను, ఆస్తులను కోల్పోయారని ఎంపీ చామల గుర్తుచేశారు. శ్రీకాంతాచారి తల్లి ఇప్పటికీ సొంత ఊరిలోనే సాధారణ జీవితం గడుపుతోందని, ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్, కోదండరాం లాంటి ఉద్యమకారులు ఉద్యమం ద్వారా ఏమీ సంపాదించుకోలేదని పేర్కొన్నారు. 1,600 మంది బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ కొందరి స్వార్థ రాజకీయాలకు, ఫామ్ హౌస్‌ల నిర్మాణాలకు పరిమితమైందని విచారం వ్యక్తం చేశారు. పూర్వపు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన టంగుటూరి ఆంజయ్యకుగానీ, ఇతర ఏ ముఖ్యమంత్రికైనా ఇన్ని ఫామ్ హౌస్‌లు ఉన్నాయా అని ఎంపీ ప్రశ్నించారు.
Also Read: హోటల్లో అడుగుపెట్టగానే.. గదిని ఎందుకు ఫొటోలు తీయాలి? లేకపోతే జరిగే నష్టం ఏంటి?