Comedy Series: ఒక ఊరిలో మొబైల్ టవర్ పెట్టాలంటే ఇంత రచ్చ జరుగుతుందా ? టవర్ వల్ల వ్యాధులు వస్తాయని కొందరు, సముద్రంలో సునామీ వచ్చినా దానికి సంబంధమేనని మరికొందరు నమ్మితే… ఊరి పరిస్థితి ఎలా ఉంటుంది ? దీనికి తోడు ఓ అమ్మాయి పరీక్ష, ఓ యువకుడి ప్రేమ, ఓ పోలీస్ అధికారికి కనిపించిన స్కామ్… అన్నీ కలిస్తే ధడక్ పూర్ లో మరోసారి నవ్వుల సందడి మొదలవుతుంది. ‘దుపహియా’ (Dupahiya) రెండో సీజన్ కూడా ఇదే గందరగోళాన్ని మరింత పెంచుతూ, ఆడియన్స్ కి నవ్వులు పంచుతోంది. మరి ఈ క్రేజీ కామెడీ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.
ధడక్ పూర్ గ్రామంలో బన్వారీకి చెందిన బంజరు భూమిని మొబైల్ టవర్ ఏర్పాటు కోసం సెలెక్ట్ చేసుకుంటారు. దీనివల్ల గ్రామానికి కొత్త సౌకర్యం రాబోతోందని అనిపిస్తుంది. కానీ గ్రామస్థులకు మాత్రం ఆ టవర్ పై అనుమానాలే ఎక్కువ. టవర్ వల్ల టైఫాయిడ్ నుంచి సునామీ వరకు ఏదైనా జరగొచ్చనే స్థాయిలో ఊరిలో రకరకాల ప్రచారాలు మొదలవుతాయి. మరోవైపు భూగోల్ జాకి సోషల్ మీడియాలో కొత్త గుర్తింపు వస్తుంది. అయితే అది అతడు కోరుకున్న స్థాయిలో మాత్రం ఉండదు. ఎందుకంటే ఫిమేల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా వైరల్ అవ్వడం అతడి జీవితాన్ని మరో విధంగా మార్చేస్తుంది.
ఊరిలో ఒక చిన్న విషయం జరిగినా దానిని సోషల్ మీడియాలోకి తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే సమయంలో రోష్ని జాకి ఎస్‌ఎస్‌సీ పరీక్ష చాలా కీలకం. పరీక్షలో మంచి ఫలితం సాధించాలనే ఒత్తిడిలో ఉన్న ఆమెకు అమావస్ ఓ షార్ట్‌కట్ చూపిస్తాడు. కానీ ఆ షార్ట్‌కట్ కేవలం పరీక్షకు సంబంధించినది కాదు… అతడి మనసులో రోష్ని మీద ఉన్న ప్రేమ కూడా అందులోనే ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్ మిథ్లేష్ కు మాత్రం ఈ వ్యవహారంలో ఏదో మోసం జరుగుతోందనే అనుమానం మొదలవుతుంది.
ఒకవైపు మొబైల్ టవర్ చుట్టూ గ్రామస్థుల గందరగోళం, మరోవైపు రోష్ని పరీక్షకు మిగిలిన ఏడు రోజులు, ఇంకోవైపు అమావస్ ప్రేమ ప్రయత్నాలు… అన్నీ ఒకేసారి నడుస్తూ కథను కామెడీగా ముందుకు తీసుకెళ్తాయి. మరి ఆ మొబైల్ టవర్ వల్ల ఊర్లో జరిగిన సంఘటనలు ఏంటి ? రోష్ని పరీక్షలు ఎలా రాసింది ? ఇన్స్పెక్టర్ అనుమానం నిజమైందా ? అన్నది తెలియాలంటే వెంటనే సిరీస్ పై ఒక లుక్కేయండి.
ఈ సిరీస్ లో గజరాజ్ రావ్ (Gajraj Rao), రేణుకా షహానే, స్పర్శ్ శ్రీవాస్తవ, భువన్ అరోరా, శివాని రఘువంశి, యశ్‌పాల్ శర్మ తదితరులు నటించారు. అయితే ఈ సీజన్ కు సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ‘దుపహియా సీజన్ 2’ ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ ఆడియో, ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు.