OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కిస్తుంటాయి. అయితే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ జానర్లో తెరకెక్కే సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అలాంటి మూవీనే ఇది. పైగా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నిజాయితీ గల ఆఫీసర్ హంతకుడిగా ఎలా మారాడు? తరువాత అతని పరిస్థితి ఏమైంది? అనేది స్టోరీ లైన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
కోస్టావో ఫెర్నాండెస్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) ఒక నిజాయితీపరుడైన కస్టమ్స్ అధికారి. 1979లో గోవాలో ప్రివెంటివ్ ఆఫీసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభిస్తాడు. అతను తన భార్య మరియా (ప్రియా బాపట్), ముగ్గురు పిల్లలతో సాధారణ జీవితం గడుపుతాడు. కోస్టావో అంకితభావం, ధైర్యం అతన్ని గోవాలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో మంచి గౌరవం ఉన్న వ్యక్తిగా చేస్తాయి.
1990లలో గోవా బంగారం స్మగ్లింగ్‌కు ఒక కేంద్రంగా మారుతుంది. పవర్ ఫుల్ రాజకీయ నాయకులు, క్రిమినల్ సిండికేట్‌లు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తాయి. దీంతో రంగంలోకి దిగిన కోస్టావో స్మగ్లర్లను పట్టుకోవడానికి తన తెలివితేటలు ఉపయోగించి, ఊహించని ప్లాన్స్ వేస్తాడు. అతను చేసే పనులు స్మగ్లింగ్ రాకెట్‌లకు పెద్ద ఆటంకంగా మారతాయి. ఇంకేముంది ఆఫీసర్ ను టార్గెట్ చేస్తుంది ఆ గ్యాంగ్. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది.
కోస్టావో ఒక భారీ స్మగ్లింగ్ ఆపరేషన్‌ను ఆపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో… చర్చిల్ అలెమావో అనే రాజకీయ నాయకుడి బంధువు అయిన అల్వర్నాజ్ అలెమావోతో గొడవ మొదలవుతుంది. స్వీయ రక్షణ కోసం కోస్టావో పీటర్ ను చంపేస్తాడు. ఈ ఘటన అతని జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. ఎందుకంటే అతనిపై హత్య కేసు నమోదవుతుంది, అలాగే అతన్ని అందరూ హంతకుడిగా చూడడం మొదలు పెడతారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్, సీబీఐ కూడా అతని నిజాయితీని పక్కన పెట్టి, ఒక హంతకుడిగా చూస్తుంది. మరోవైపు రాజకీయ ఒత్తిడి, ఫ్యామిలీలో సమస్యలు మొదలవుతాయి. మరి కోస్టావో చివరికీ ఆ సిండికేట్ బాగోతాన్ని బయట పెడతాడు? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిన స్టోరీ.
Read Also : ఇది అమ్మాయా ఆడ పిశాచా మావా ? రాత్రయితే చాలు దెయ్యంతో ఆ పాడు పనులేంటి?
ఏ ఓటీటీలో ఉందంటే?
గోవాలో 1991లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది ‘కోస్టావో’ (Costao) మూవీ. ముఖ్యంగా కస్టమ్స్ అధికారి టోనీ డా కోస్టా ఫెర్నాండెస్ జీవితం, భారత చరిత్రలో అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌లలో ఒకదాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ (కోస్టావో), ప్రియా బాపట్ (మరియా), కిశోర్ కుమార్ జి (డీమెల్లో), హుస్సేన్ దలాల్ (పీటర్), గగన్ దేవ్ రియార్ తదితరులు నటించారు. సేజల్ షా దర్శకత్వం వహించిన ఈ హిందీ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ప్రస్తుతం జీ 5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.