Bethlehem Kudumba Unit OTT: ఓ పెద్ద కుటుంబంలో పెళ్లి వయసుకు వచ్చిన యువకుడు… అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఓ చిన్న అమ్మాయి… వీళ్ల మధ్య ఏర్పడే పరిచయం చివరికి ప్రేమగా మారితే… ఈ తరం ప్రేమ, పెళ్లి, కుటుంబ సభ్యుల అంచనాలు, యువత ఆలోచనలు… ఇలాంటి అంశాలన్నీ ఉన్న మలయాళ కామెడీ డ్రామానే ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit). థియేటర్లలో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అసలు ఏం జరుగుతుంది ? ఆ చిన్న అమ్మాయితో ఏర్పడిన పరిచయం కుటుంబంలో ఎలాంటి గందరగోళానికి దారి తీస్తుంది ? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో యాష్లే తన కుటుంబంతో కలిసి ముండక్కాయమ్ నుంచి అంగమలికి వచ్చి సెటిల్ అవుతుంది. కాలేజ్ చదువుతున్న ఆమెకు కొత్త ప్రాంతంలో మొదట అంతా అపరిచితంగానే అనిపిస్తుంది. అయితే అక్కడి క్యాథలిక్ కమ్యూనిటీతో పరిచయం ఏర్పడటంతో క్రమంగా ఆ వాతావరణానికి అలవాటు పడుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు బెత్లెహెమ్ కుటుంబ యూనిట్‌లోని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఈ కొత్త పరిచయాల మధ్యే యాష్లే జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తి కూడా ఆమెకు దగ్గరవుతాడు.
యాష్లే ఇంటికి పక్కనే ఉండే జస్టిన్ డేవిస్ స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తి. ముప్పై ఏళ్ల వయసులో ఉన్న జస్టిన్‌కు అప్పటివరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన పెద్దగా ఉండదు. కేటరింగ్ వ్యాపారం నిర్వహిస్తూ తన పనిలో తాను బిజీగా ఉంటాడు. అయితే అవసరమైనప్పుడు చుట్టుపక్కల వాళ్లకు అండగా నిలబడటం, వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందుండటం అతడి స్వభావం. బయటకు సీరియస్‌గా కనిపించినా జస్టిన్‌లో మంచి హాస్యభావం, సున్నితమైన మనసు ఉంటాయి.
యాష్లేతో జస్టిన్‌కు ఏర్పడిన పరిచయం క్రమంగా ఓ ప్రత్యేకమైన బంధంగా మారుతుంది. ముఖ్యంగా సంగీతంపై ఇద్దరికీ ఉన్న ఆసక్తి వారిని మరింత దగ్గర చేస్తుంది. తొలుత జస్టిన్‌ను వయసులో పెద్దవాడిగా, కాస్త గంభీరంగా చూసిన యాష్లే… అతడి సరదా మాటలు, ఆప్యాయత, మంచితనం తెలుసుకున్న తర్వాత మనసు మార్చుకుంటుంది. జస్టిన్‌కి కూడా యాష్లేపై ఇష్టం పెరుగుతుంది. ఇలా పెద్దగా ఎలాంటి హడావుడి లేకుండానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఈ బంధం గురించి బయటకు తెలియడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. యాష్లే కంటే జస్టిన్ 13 ఏళ్లు పెద్దవాడు కావడంతో వారి సంబంధంపై చుట్టుపక్కల వాళ్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి.
వీధిలో మొదలైన చర్చలు చివరకు స్థానిక పారిష్ కమిటీ వరకు చేరతాయి. మరోవైపు యాష్లే తల్లి కూడా ఈ సంబంధాన్ని అంగీకరించదు. మరి ఈసారి యాష్లే, జస్టిన్ ఏ నిర్ణయం తీసుకున్నారు ? గతంలో విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటయ్యారా ? కుటుంబం, సమాజం పెట్టిన గీతలను దాటి తమ బంధాన్ని నిలబెట్టుకోగలిగారా ? చివరకు వారి ప్రేమకు ఎలాంటి ముగింపు లభించిందనేదే ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’లో చూడాల్సిన కథ.
నివిన్ పౌలీ (Nivin Pauly), మమిత బైజు (Mamitha Baiju), లాలూ అలెక్స్ (Lalu Alex), అర్జున్ అశోకన్ (Arjun Ashokan) తదితరులు నటించిన మలయాళం కామెడీ డ్రామా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. గిరీష్ ఎ.డి. (Girish A.D.) దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.